శనివారం 06 జూన్ 2020
Zindagi - May 19, 2020 , 23:30:03

కేసీఆర్‌ మెడలో... సిరి సెల్ల!

కేసీఆర్‌ మెడలో... సిరి సెల్ల!

ఆ అంచుల సెల్ల.. బోళాశంకరుడి లాంటి పెద్ద మనిషి ధరిస్త్తే నాజూకైన నాగభూషణం.  ఏ కుబేరుడి మెడలోనో వేలాడితే ఖరీదైన కౌస్తుభహారం. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర ‘పొలిటీషియన్‌' పాలిట ‘లీడర్‌ ఇన్‌ మేకింగ్‌' అన్న ఐడీ కార్డు. అనేక యుద్ధాలలో ఆరితేరిన మహానాయకుడు అలంకరించుకొంటే మాత్రం...  ఆ సాదాసీదా నేత వస్త్రం తలరాతే మారిపోతుంది. వార్తలకెక్కుతుంది. సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తుంది. జనంలో ఆసక్తి పెరుగుతుంది. మగ్గం కళకు మంచిరోజులొస్తాయి. నాలుగు చేనేత కుటుంబాలు సెల్లపేరు చెప్పుకొని చల్లగా బతుకుతాయి. కేసీఆర్‌ కండువా... ఇప్పుడో హాట్‌ టాపిక్‌!

తలపైకి ఎండను దరిజేరనీయక కాపాడునది మన కండువా..శ్రవణ రంధ్రమ్ముల చలిగాలి చొరనీక కాపాడునది మన కండువా.. ముక్కు పుటముల దుమ్ము చేరనీయక కాపాడునది మన కండువా... నోటి తుంపిళ్లు జనులపై పడకుండ కాపాడునది మన కండువా.. చెమటకారినపుడు, చిమిడి విదిలించినపుడు,దగ్గురేగినపుడు, తుమ్మువచ్చినపుడు..మనను వదలక కాపాడును మన కండువా! 

మే 15న ముదురు ఎరుపు అంచు సెల్లతో..

కండువా.. పెద్దరికానికి, హుందాతనానికి, తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు చిహ్నం. తెలుగుబిడ్డ కండువాను కుడిచేత్తో ఒడుపుగా ఎడమ భుజంపై వేసుకునే ఘట్టం ముచ్చటైన దృశ్యం! రుమాలు, తువ్వాల, పెద్ద దస్తీ, శెల్ల.. కండువాకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు. చేనేతకు ప్రసిద్ధమైన సిరిసిల్లలో వీటినే సెల్ల అనీ పిలుస్తారు. ఆధునిక దుస్తుల మోజులో పడిపోయి.. రక్షణ కవచంలాంటి కండువాను దూరం చేసుకున్నాం మనం. కరోనా కష్టకాలంలో వందలకు వందలు పెట్టి.. మాస్కులు కొంటున్నామే తప్ప, ఎల్ల అవసరాలకూ ఉపయోగపడే సెల్ల వైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు. కానీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు  ఇటీవల అన్ని సమావేశాలకూ సెల్ల భుజాన వేసుకొని హాజరు అవుతున్నారు. దీంతో అందరి దృష్టీ వీటిపై పడింది. 


మే 17 న గులాబీ అంచు సెల్లతో..

సకల అవసరాలకూ: కండువా.. ఓ అలంకరణ, ఓ అవసరం. వేసవిలో తలకు కట్టుకుంటే.. ఎండ దెబ్బ తగలకుండా రక్షణ. ముక్కుకు చుట్టుకుంటే వడగాల్పులకు అడ్డుకట్ట, తలకూ చెవులకూ నిండుగా చుట్టుకుంటే చలి తీవ్రత నుంచి ఉపశమనం. తుమ్ము, దగ్గు, జలుబు వచ్చినప్పుడు..  నిక్షేపంగా అడ్డుపెట్టుకోవచ్చు. ఒడుపుగా పట్టుకుంటే సంచిలా ఉపయోగపడుతుంది. పొలం నుంచో పట్నం నుంచో వస్తూవస్తూ నాలుగు కూరగాయలు వేసుకుని రావచ్చు. పిల్లలకు పండ్లో పలారమో తీసుకురావచ్చు. మట్టిపనులో, రాళ్ల పనులో చేస్తున్నప్పుడు చిన్నచిన్న గాయాలైతే బ్యాండేజ్‌ క్లాత్‌లా చుట్టుకోవచ్చు. రైళ్లలోనూ, బస్సుల్లోనూ సీట్ల కోసం కిటికీలోంచి రుమాలు విసిరే అలవాటు మనకు ఎప్పటి నుంచో ఉంది. కూర్చోవాల్సిన చోట దుమ్మూ ధూళీ దులపడానికి కూడా పనికొస్తుంది. ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే... ఒక్కసారి తీక్షణంగా చూసి సెల్లా జాడిస్తే  ‘ఖబర్దార్‌' అన్న తీవ్ర హెచ్చరికే! కొరడా ఝళిపించినట్టు అవతలి మనిషి భయపడిపోతాడు. ఒక సెల్ల్ల వంద మాస్కులకు సరిసాటి. చాలా సినిమాల్లో హీరోలు తమదైన ఎక్స్‌ప్రెషన్‌తో సెల్ల్ల భుజాన వేసుకునే సీన్లు కలెక్షన్లు కురిపించాయి.  

మేడ్‌ ఇన్‌ సిరిసిల్ల: సిరిసిల్లలోని అనంతనగర్‌కు చెందిన గుంటుక మల్లేశం తనయులు కోటేశ్వర్‌, శ్రావణ్‌. ఈ సోదరులు గత 40 ఏండ్లుగా చేనేతనే నమ్ముకున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల తన వస్త్రధారణలో భాగం చేసుకున్న కండువాలు వీరి దగ్గర ప్రత్యేకంగా నేయించి తెప్పించినవే. ఇప్పటికే, మూడు రంగుల్లో పదహారు వందల కండువాలను అందించాడు కోటేశ్వర్‌. వీటిని చూసి ముచ్చటపడిన ముఖ్యమంత్రి.. మరో 2500 సెల్ల్లాలకు ఆర్డరు ఇచ్చినట్టు ఆ చేనేత కార్మికుడు తెలిపాడు. వీటికి మహారాష్ట్రలో మహా గిరాకీ. తీరొక్కరంగులో లభ్యం అవుతుండటంతో.. అన్ని రాజకీయ పార్టీలూ తమ చిహ్నాలతో కూడిన  కండువాలను ఇక్కడే తయారు చేయిస్తాయి. సెల్ల్ల కొంటే... ఏదో ఓ వస్ర్తాన్ని కొన్నట్టు మాత్రం కాదు. మనల్ని మనం రక్షించుకుంటూ, ఓ చేనేత కుటుంబాన్నీ కాపాడినట్టు! 

-  కె. ప్రకాశ్‌ రావు


logo