శనివారం 06 జూన్ 2020
Zindagi - May 18, 2020 , 22:38:15

‘సీతాకోక’ చింతలు!

‘సీతాకోక’ చింతలు!

బాబు పుట్టినప్పటి నుంచీ నీరజ బాగా అలసిపోతున్నది. ఒళ్లంతా నొప్పులు. బరువు కూడా పెరుగుతున్నది. కాకతాళీయంగా చేయించిన పరీక్షల్లో ఆమెకు హైపోథైరాయిడ్‌ సమస్య ఉందని తేలింది. బరువు పెరుగుతుంటేనో, జుట్టు రాలిపోతుంటేనో మాత్రమే థైరాయిడ్‌ రుగ్మత ఉన్నట్టు కాదు.  కొన్నిసార్లు, చిన్నచిన్న సమస్యల రూపంలోనూ ఆ లక్షణాలు బహిర్గతం కావచ్చు.  బిడ్డ పుట్టిన తరువాతా, మెనోపాజ్‌ దశలోనూ థైరాయిడ్‌ సమస్యలు కనిపించే ప్రమాదం మరీ ఎక్కువ. 

మెడ దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలను తన నియంత్రణలో ఉంచుకుంటుంది. అందుకే థైరాయిడ్‌లో కానీ, అది విడుదల చేసే హార్మోన్లలో కానీ సమస్య వస్తే... ఆ ప్రభావం శరీరం మొత్తం మీద అనేక రకాలుగా ఉంటుంది. మెదడు ఎదుగుదల మొదలు సంతానోత్పత్తి వరకు .. చాలా విషయాల్లో థైరాయిడ్‌ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మారుతున్న జీవనశైలి కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు ... థైరాయిడ్‌ సమస్య.

ఒత్తిడే కారణమా..?: . నాలుగైదు దశాబ్దాల క్రితం అయొడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అయ్యేది. అయొడిన్‌ ఫోర్టిఫైడ్‌ ఉప్పు లాంటివి అందుబాటులోకి వచ్చాక అదో సమస్యే కాకుండా పోయింది. ప్రస్తుతం ‘ఆటో ఇమ్యూన్‌ స్థితి’ వల్లనే ఎక్కువగా హైపోథైరాయిడిజమ్‌ కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో శరీరంలోని సొంత కణాలపైనే వ్యాధి నిరోధక కణాలు దాడిచేస్తాయి. తద్వారా థైరాయిడ్‌ లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యకు మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. మనం తినే తిండిలోని క్రిమిసంహారకాల ఆనవాళ్లూ ఓ కారణమే. కాలుష్యం కూడా థైరాయిడ్‌ గ్రంథి పనితీరును దెబ్బతీస్తుందన్న వాదనా ఉంది. 

లక్షణాలు: బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం... తదితర లక్షణాలు కనిపిస్తేనే థైరాయిడ్‌ ఉందేమో అనుకుంటారు. బలహీనత, నీరసం, అలసట, ఒళ్లునొప్పులు, కాళ్లవాపులు కూడా... కొన్నిసార్లు థైరాయిడ్‌ లక్షణాలే. అయితే,  థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టిఎస్‌హెచ్‌) చాలా ఎక్కువ మోతాదులో ఉంటేనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడ్‌ సమస్య ఉంటే డిప్రెషన్‌ కూడా నెత్తినెక్కి కూర్చుంటుంది.

హైపర్‌ థైరాయిడిజమ్‌: ఇది హైపోథైరాయిడిజమ్‌ కన్నా కొంచెం క్లిష్టమైనది. చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ సమస్య వల్ల థైరాయిడ్‌ గ్రంథి అవసరానికి మించి పనిచేస్తుంది. దీంతో జీవక్రియల వేగం పెరుగుతుంది. తద్వారా, హృదయ స్పందనల రేటు వంద దాటుతుంది. బరువు తగ్గుతుంది. మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. దడ ఉంటుంది. గుండె సమస్యలు రావచ్చు. మానసిక ఇబ్బందులూ ఉత్పన్నం అవుతాయి. బైపోలార్‌ లాంటి మానసిక వ్యాధులు కనిపిస్తాయి. పిల్లల్లో అయితే ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌' కనిపించవచ్చు. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది. ప్రవర్తనలో అసహజత్వం తొంగిచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో థైరాయిడ్‌ పనితీరులో వేగాన్ని తగ్గించడానికి మందులు ఇస్తారు. లేదంటే, రేడియో అయోడిన్‌ అబ్లేషన్‌ విధానం ద్వారా రేడియో అయోడిన్‌ క్యాప్సుల్‌ను ఇస్తారు. దీని నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల గ్రంథి చిన్నదై, థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గుతాయి. 

క్యాన్సర్‌: కొన్నిసార్లు క్యాన్సర్‌ వల్లా, కొన్నిసార్లు క్యాన్సర్‌ లేకుండా కూడా థైరాయిడ్‌ గడ్డలు  ఏర్పడవచ్చు. ఇందుకు పూర్తిస్థాయి చికిత్స ఉంది. ఆపరేషన్‌ ద్వారా థైరాయిడ్‌ గ్రంథిని తీసేస్తారు. అవసరమైతే రేడియేషన్‌తో మాడ్చేస్తారు. 

పిల్లలు మినహాయింపు కాదు : థైరాయిడ్‌ సమస్య ఎప్పుడైనా రావొచ్చు. కాబట్టి, నవజాత శిశువుకు థైరాయిడ్‌ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పుట్టిన ఏడాదిలోగా థైరాయిడ్‌ సమస్య కనిపిస్తే మాత్రం, అది కచ్చితంగా జన్యుపరమైన కారణం వల్లే. పుట్టుకతో వచ్చే థైరాయిడ్‌ సమస్యను కనుక్కోవడానికి... బిడ్డ కాలి బొటనవేలికి చిన్న సూది గుచ్చి, రక్తం తీసుకుని పరీక్షిస్తారు (హీల్‌ ప్రిక్‌ టెస్ట్‌). థైరాయిడ్‌తో పాటుగా పుట్టుకతో వచ్చే దాదాపు ఇరవై ఒక్క మెటబాలిక్‌ డిజార్డర్లను కూడా ఈ పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. పాపకో బాబుకో మూడేండ్లు నిండాకే, థైరాయిడ్‌ కనిపిస్తే అది పెద్దవాళ్లలో వచ్చే ఆటోఇమ్యూన్‌ సమస్యే అయివుంటుందని అర్థం, జన్మతః వచ్చిన రుగ్మత కాకపోవచ్చు. ఆడపిల్లలకే  థైరాయిడ్‌ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. చిన్నారుల్లో థైరాయిడ్‌ సమస్య ఉంటే ఎదుగుదలలోనూ లోపాలు ఉంటాయి. థైరాయిడ్‌ సమస్యకు ఒకసారి మందుల వాడకం మొదలుపెడితే, వైద్యులు చెప్పేదాకా ఆపకూడదు. సొంతవైద్యం పనికిరాదు. 

ఏ వయసులో.. ఎలా?

ఈ సమస్యకు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. వ్యాధి లక్షణాలు  20-40 ఏండ్ల మధ్య అధికంగా కనిపిస్తాయి. 

యవ్వనంలో..

పునరుత్పత్తి వయసులో ఉన్నవాళ్లపై కూడా ఈ గ్రంథి ప్రభావం ఉంటుంది. థైరాయిడ్‌ లోపాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. గర్భధారణలో ఇబ్బందులు తప్పవు. చాలా సందర్భాల్లో గర్భస్రావాలు అవుతాయి. 

వృద్ధాప్యంలో..

50 ఏండ్లు దాటితే థైరాయిడ్‌ సమస్య కొలెస్ట్రాల్‌నూ పెంచుతుంది. 60 దాటాక చాలామంది థైరాయిడ్‌ సమస్య ఉందని కూడా తెలుసుకోలేరు. దీంతో, ఒంట్లో నీరు పేరుకుపోయి వాపులు వస్తాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అవీ ఓ పట్టాన వదలవు. ఏదైనా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే.. అనెస్తీషియా దుష్ఫ్రభావం చూపవచ్చు. 

పిల్లల్లో..

  • పిల్లల్లో ఈ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అయితే, మెదడు ఎదుగుదలలో సమస్య వస్తుంది. వెంటనే గుర్తించి చికిత్స చేస్తేనే, మానసిక ఎదుగుదల కుంటుపడకుండా ఉంటుంది.  బుద్ధిమాంద్యం రాకుండా నివారించవచ్చు. అయిదేండ్ల వయసు దాటాక, పిల్లల ఎత్తు పైనా థైరాయిడ్‌ ప్రభావం చూపిస్తుంది. కౌమారంలో యవ్వన లక్షణాలకు దోహదపడేది ఈ హార్మోనే.
  •  బిడ్డను ప్రసవించిన తరువాత (పోస్ట్‌ పార్టమ్‌) లేదా మెనోపాజ్‌ తరువాత కూడా థైరాయిడ్‌ సమస్యలు రావచ్చు. ఒత్తిడి వల్ల ఈ దశలో థైరాయిడ్‌ ఇబ్బందులు చుట్టుముడతాయి.  
  • థైరాయిడ్‌ నియంత్రణలో లేకుంటే ‘కాగ్నిటివ్‌ సమస్యలు’ వస్తాయి. నిర్ణయాలు తీసుకునే శక్తి మందగిస్తుంది. వినికిడి సామర్థ్యం తగ్గుతుంది.
  • హైపోథైరాయిడిజమ్‌ రోగులు క్యాబేజి, కాలిఫ్లవర్‌ తినకూడదని అంటారు. అయితే థైరాయిడ్‌ వల్ల వాపు ఉంటే, ఇవి ఆహారం నుంచి అందే అయోడిన్‌ను శరీరం గ్రహించకుండా చేస్తాయి. వాపు లేకపోతే నిక్షేపంగా తినవచ్చు. కాబట్టి ఇది అందరికీ వర్తించదు. 
  • థైరాయిడ్‌ మందులను జీవితాంతం వేసుకోవాలన్న ప్రచారం పూర్తిగా నిజం కాదు. 20 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య తాత్కాలికమే. 70-80 శాతం మందికి మాత్రం జీవితాంతం అవసరం పడొచ్చు. మందుల విషయంలో వైద్యులు తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు.

డాక్టర్‌ పి. సుధాకర్‌ రెడ్డి

సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌


logo