మంగళవారం 26 మే 2020
Zindagi - May 18, 2020 , 22:38:11

లాక్‌డౌన్‌లో... లొల్లి తగ్గింది!

లాక్‌డౌన్‌లో... లొల్లి తగ్గింది!

 దేశవ్యాప్తంగా కరోనా సీజన్‌లో భార్యా భర్తల మధ్య గొడవలు పెరిగినట్టు, గృహహింస కేసులు భారీగా నమోదు అయినట్టు  రికార్డులు చెబుతున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం.   ఆలూమగలు మహా అన్యోన్యంగా ఉన్నారు. ఎంతైనా ప్రేమ పునాదుల మీద పుట్టిన నగరం కదా!

లాక్‌డౌన్‌ పుణ్యమాని, హైదరాబాద్‌లో ఆలూమగల గొడవలు అనూహ్యంగా తగ్గాయి. సాధారణ పరిస్థితులలో సీసీఎస్‌కు అనుబంధంగా పనిచేసే మహిళా పోలీస్‌స్టేషన్‌కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతుంటాయి. లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం, గణనీయంగా ఫిర్యాదులు తగ్గాయి. అందులోనూ.. మే నెలలో పదహారో తేదీ వరకూ  కేవలం 26 గృహహింస ఫిర్యాదులొచ్చాయి. దీనికి అనేకానేక కారణాలు. 

సర్దుకుపోదాం రండి...!

హైదరాబాద్‌ ప్రధాన ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకునేవారూ, వ్యాపారులూ ఎక్కువ. బంధువర్గమంతా దాదాపుగా పరిసరాల్లోనే ఉంటారు. అపార్ట్‌మెంట్లు కొంటున్నప్పుడూ ఇండ్లు కట్టుకుంటున్నప్పుడూ... ఆత్మీయులూ అయినవారూ కూతవేటు దూరంలో ఉండే కాలనీలనే ఎంచుకుంటారు. ఏదైనా సమస్య వస్తే తమలో తామే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకూ వివాదాల  జోలికి వెళ్లరు.  భాగ్యనగర మహిళల్లో సహజంగానే సహనం ఎక్కువ. అటు భర్త- పిల్లలు, ఇటు అత్తమామలు.. కుటుంబ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూనే ఉద్యోగాలు చేస్తారు. ఆఫీసులో ‘బెస్ట్‌ ఎంప్లాయీ అవార్డు’నూ అందుకుంటారు. భర్తలూ అంతే. అవసరమైతే వంటలు చేస్తారు, బట్టలు ఉతుకుతారు, చీపురు పడతారు. ఇంటిపనులన్నీ చేసిపెట్టి ‘మావారు బంగారు కొండ’ అన్న కితాబు అందుకుంటారు. కానీ, మిగతా సమయాల్లో వృత్తి ఉద్యోగాల ఒత్తిడుల కారణంగా... కూర్చొని చర్చించుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడలా కాదే. ఒకరి కష్టం ఒకరు చూస్తున్నారు. ఒకరి పరిస్థితిని మరొకరు సావధానంగా అర్థం చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత...ఆలూమగలు రోజుల తరబడి ఇంట్లోనే ఉండాల్సి వస్తున్న అరుదైన సమయమూ ఇదే. ఈ సుదీర్ఘ సెలవు దగ్గరి తనాన్ని పెంచింది. ఎదుటివారి బలహీనతల్ని అర్థం చేసుకునే సహనాన్ని ఇచ్చింది. గొడవలు తగ్గడానికి ఇదో కారణం కావచ్చు.   ‘హైదరాబాద్‌లో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది. బంధాలకు ప్రాధాన్యం ఇస్తారు.  వివాదాల్ని సమన్వయంతో పరిష్కరించుకునే మనస్తత్వం కూడా పెరుగుతున్నది. మరింత మార్పు వస్తే గృహి హింస కేసులు ఇంకొన్ని తగ్గే అవకాశం ఉంది’ అంటారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ జీసీ కవిత. 

సీసీఎస్‌ మహిళా ఠాణాకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు..

  • జనవరి-195
  • ఫిబ్రవరి-218
  • మార్చి-164
  • ఏప్రిల్‌ -14
  • మే (16 వరకు)  26


logo