శనివారం 06 జూన్ 2020
Zindagi - May 18, 2020 , 22:30:25

తెలివి

తెలివి

మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ముగ్గురూ తెలివైనవారే. కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. అందుకోసం ఒకరోజు పొరుగు ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక పెద్ద అడవిని దాటి వెళ్ళాలి. రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. మార్గమధ్యంలో ఒకడికి తాడు దొరికింది. ఎందుకైనా మంచిదని జాగ్రత్త చేశాడు. రెండోవాడికి చాట కనిపించింది. ఇంట్లోకి పనికొస్తుందని పక్కన పెట్టాడు. మరొకడికి గడ్డపార దొరికింది. దాన్ని తీసుకున్నాడు. అందరూ అడవి మధ్యలోకి వచ్చారు. అప్పటికే అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు. దూరంగా ఒక గుడి కనిపించింది. అక్కడికి చేరుకొని కాసేపు నిద్రపోయారు. 

అంతలో అటు వైపుగా ఒక రాక్షసుడు వచ్చాడు. వాడికి గుడిలో నుంచి నరవాసన వచ్చింది. దాన్ని బట్టి లోపల మనుషులుఉన్నారని నిశ్చయించుకున్నాడు. రాక్షసుడు దేవుడి గుడిలోకి అడుగు పెట్టలేడు కాబట్టి బయట నుంచే ‘ఒరేయ్‌! మానవా.. నేనెవరినో తెలుసా? రాక్షసుడినిరా! రారా బయటకు, నమిలి మింగేస్తా’ అని పెద్దగా అరిచాడు. ఆ అరుపులకే ముగ్గురూ లేచి కూర్చున్నారు. ముందు భయపడినా, ఒకడు తేరుకొని ‘ఒరేయ్‌ రాక్షసుడా.. నేనెవరో తెలుసా? రాకాసులను మించిన గూకాసినిరా!’ అంటూ హూంకరించాడు.  అప్పుడు రాక్షసుడు కోపంగా అరుస్తూ ‘ఐతే బయటకు రా! నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం’ అని రంకెలేశాడు.  దానికి మొదటివాడు ‘నేను రావడమేమిట్రా నా గోరు చాలు నిన్ను పొడిచి చంపడానికి’ అని గడ్డపారను చూపాడు. గడ్డపారను చూసి గోరు అనుకొని భ్రమపడ్డాడు రాక్షసుడు. ఇంతలో రెండోవాడు ‘నా చెవిని చూడరా,  బలంగా ఆడించానంటే దాని గాలికే కొట్టుకుపోతావు’ అంటూ చాటని బయటకు తీసి అటూ ఇటూ ఊపాడు. ఇక మూడోవాడు ‘నా తోక చూడరా!’ అని తాడుని బయటికి విసిరాడు. ఇలాంటి వింతజీవి కచ్చితంగా తనని  చంపేస్తుందని భయపడ్డాడు రాక్షసుడు. అంతే!  ఆ దెబ్బతో వణుకుతూ అక్కడ్నుంచి పారిపోయాడు.  రాత్రికి  ఆ ముగ్గురు స్నేహితులు అక్కడే హాయిగా నిద్రపోయి, తెల్లవారు

జామునే బయలుదేరి పక్క ఊరికి చేరుకున్నారు. 


నీతి : తెలివి ఉంటే ఏ పనినైనా తేలికగా సాధించవచ్చు. 


logo