శనివారం 06 జూన్ 2020
Zindagi - May 17, 2020 , 22:48:37

ఒకటే దారి..సైకిల్‌ సవారీ!

ఒకటే దారి..సైకిల్‌ సవారీ!

కరోనాతో మారిన జీవన శైలి..విదేశాల్లో సైకిళ్లకు భలే గిరాకీ..భౌతిక దూరానికి సరైన పరిష్కారం..ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు...ప్రత్యేక ట్రాక్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు..యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాలలో క్రేజ్‌..మన దగ్గరా సైక్లింగ్‌ పెరగాలంటున్న నిపుణులు.

సైకిల్‌కు మనిషితో ఎంతో అనుబంధం ఉంది. ప్రజా రవాణా పెద్దగా అందుబాటులో లేనికాలంలో దూర ప్రయాణాలకు సైకిలే దిక్కు. శారీరక వ్యాయామం, ఉచిత ప్రయాణం.. రెండూ సాధ్యమయ్యేవి. మోటార్‌ సైకిల్‌ దెబ్బకు సైకిల్‌ చక్రం విరిగి పోయింది. ముచ్చటైన వాహనం మూలన పడింది. దీంతో శరీరానికి వ్యాయామం తగ్గింది. ఇంధన రూపంలో జేబుకు చిల్లు పెరిగింది. అయితే కరోనా పుణ్యమాని సైకిల్‌కు పునర్వైభవం వచ్చేలా కనిపిస్తున్నది. కొవిడ్‌ విజృంభణ కారణంగా విదేశాల్లో సైకిల్‌ క్రేజ్‌ పుంజుకుంటున్నది. ప్రజా రవాణాలో భౌతిక దూరానికి ఆస్కారం లేకపోవడంతో  సైకిల్‌కు సై అంటున్నారు.

మారుతున్న ప్రయాణపు అలవాట్లు

కొవిడ్‌-19  ప్రయాణపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉండటంతో ప్రభుత్వాలు ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపి వేశాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఉద్యోగస్తులు బయట అడుగు పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో చాలా మంది సైకిల్‌ మీద గమ్యాన్ని చేరుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిమిత దూరాలకు  సైకిలు బండిని  ఎంచుకుంటున్నారు.   కొవిడ్‌ తర్వాత చాలా దేశాల ప్రజలు సొంత కార్లలో ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటికే భారీ ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాలకు ఇది మరింత సమస్యగా మారే అవకాశం ఉంది. కాలుష్యమూ ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు, సైకిల్‌ వాడకాన్ని  ప్రభుత్వాలు  ప్రోత్సహిస్తున్నాయి. 

ఉత్పత్తికి మించి డిమాండ్‌

పలు దేశాల్లో ‘సైకిల్‌ టు వర్క్‌" నినాదాన్ని అందుకోవడంతో అందరి చూపూ సైకిళ్లమీద పడుతున్నది. కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. యూకేలో దాదాపు 200 శాతం వరకు ఆర్డర్లు అధికం అయినట్టు అమ్మకం దారులు చెబుతున్నారు. సైకిల్‌ స్టోర్లకు కొనుగోలుదారుల తాకిడి పెరుగుతున్నది. ఇంకేముంది, ఉత్పత్తిని పెంచారు. సాధారణ రోజుల్లో ఒక్కో స్టోర్‌లో వారానికి 20-30 సైకిళ్ల విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం 50 దాకా అమ్ముడుపోతున్నాయి. మరికొందరు, మూలనపడిన సైకిళ్ల దుమ్ము దులుపుతున్నారు. పాత సైకిళ్లను మరమ్మతులకు గ్యారేజీలకు తీసుకువెళ్తున్నారు. విడి భాగాలనూ కొనుగోలు చేస్తున్నారు. కేబుల్స్‌కు, టైర్లకు డిమాండ్‌ పెరుగుతున్నది. బ్రిటన్‌లో తయారు చేసిన సైకిళ్లన్నీ దాదాపుగా అమ్ముడు పోగా, మరొక 20వేలకు ఆర్డర్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ సైకిల్‌ ట్రేడర్స్‌ ప్రకటించింది. దీంతో, తయారీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నది. 


వివిధ దేశాల్లో ..

యూరప్‌ వ్యాప్తంగా సైక్లింగ్‌ సరికొత్త ట్రెండ్‌గా మారింది. నిత్య ప్రయాణానికి సైకిల్‌ను వినియోగిస్తున్నారు. బార్సిలోనాలో సైకిల్‌ పాత్‌లను పెంచారు. బెర్లిన్‌లో 22 కిలోమీటర్లను, బ్రసెల్స్‌లో 40 కిలోమీటర్లను అదనంగా సైకిల్‌ పాత్‌గా తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌ భారీ నిధులతో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. యూరప్‌లోనే అత్యధికంగా కార్లను వినియోగించే ఇటలీ కూడా సైకిల్‌ దారి పట్టింది. రోమ్‌లో 150 కిలోమీటర్ల సైకిల్‌ పాత్‌ను ఏర్పాటు చేసింది. యూకేలో రవాణా అనేది అత్యంత కాలుష్యమయం. ఓ పరిశోధన ప్రకారం, 58శాతం కారు ప్రయాణాలు 5 కిలోమీటర్ల పరిధిలో జరిగేవే. సొంత వాహనాల వల్ల నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇది మరింత ఎక్కువ కాకుండా, ఇంకొంత భౌతిక దూరం పాటించేలా యూకేలో ‘సైకిల్‌ టు వర్క్‌' కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. సహజంగానే సైక్లింగ్‌ను ప్రేమించే డెన్మార్క్‌ వినియోగాన్ని మరింత పెంచింది. ఇటలీ, కొలంబియా దేశాల్లో సైకిల్‌ లైన్లను పెంచుతున్నారు. అమెరికాలోనూ సైకిళ్లకు డిమాండ్‌ ఎక్కువగానే ఉన్నది. కెనడాలో ఆన్‌లైన్‌ ద్వారా సైకిళ్ల కొనుగోళ్లు ఎక్కువ అయినట్టు తెలుస్తున్నది. జర్మనీలో సైకిల్‌ లైన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి సైకిల్‌బండికి రాజయోగం పట్టింది.

మన దేశంలోనూ  పెరగాలి.. 

వీధి చివర దుకాణానికి వెళ్లాలన్నా బండి తీస్తాం మనం. దీనివల్ల శరీరానికి కనీస వ్యాయామం కూడా లేకుండా పోతున్నది. కరోనా కాలంలో  బస్సులోనో, మెట్రోలోనో సమూహంగా ప్రయాణం చేయడం కంటే, సైకిళ్లను వినియోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంతో పాటు ఖర్చూ కలిసి వస్తుంది. భౌతిక దూరం పాటించడమూ  సాధ్యం అవుతుంది. ఇదే సమయంలో వాహనాల సంఖ్య తగ్గి ట్రాఫిక్‌ దార్లోకి వస్తుంది. కాలుష్యం తగ్గుతుంది. సైకిల్‌ వాడకం గ్రామాల్లోనూ తగ్గిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  ఇప్పటి వరకూ మాస్కులతో, శానిటైజర్లతో కరోనాతో యుద్ధం చేశాం. ఈసారి, సైకిళ్లతోనూ పోరు మొదలు పెడదాం. 

చాలా ఉపయోగాలు..

  • సైక్లింగ్‌ చేస్తున్నపుడు శరీరంలోని అన్ని ప్రధాన కండరాలనూ ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని మించిన వ్యాయామం లేదంటారు.
  • ఎముకల్లో  దృఢత్వాన్ని పెంచుతుంది. కీళ్లపై ఒత్తిడిని నివారిస్తుంది. ఎముకలను పగుళ్ల నుంచి కాపాడుతుంది. 
  • జీవక్రియ రేటును వృద్ధి చేస్తుంది. ఊబకాయ  సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. 
  • గుండె కండరాలను బలపరుస్తుంది.  అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది. 
  • మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 
  • శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. 
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
  • రోజూ సైక్లింగ్‌ చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 
  • రోజూ 30 నిమిషాల సైక్లింగ్‌ చేసేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40శాతం తక్కువ. 


logo