శనివారం 06 జూన్ 2020
Zindagi - May 16, 2020 , 22:45:49

సామాన్య మహిళలే...రియల్‌ స్టార్స్‌!

సామాన్య మహిళలే...రియల్‌ స్టార్స్‌!

కిరీటం పెట్టుకుంటే దేవత, సింహాసనం మీద కూర్చుంటే రాజమాత, కన్నీళ్లు ఒలికిస్తే సామాన్య గృహిణి, కాస్త తెల్లరంగు జుత్తుకు అద్దుకుంటే అతిశయంతో మిడిసిపడే అత్తమ్మ - మంచిమంచి పాత్రలన్నీ రమ్యకృష్ణని వెతుక్కుంటూ వస్తాయేమో అనుకుంటాడు సామాన్య ప్రేక్షకుడు. నిజానికి, సినిమా పరిశ్రమకు ఆమె ఒక నటనా అక్షయపాత్ర! కాబట్టే, దర్శకులు డేట్స్‌ కోసం కాచుకుని కూర్చుంటారు, ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటారు. వెండితెర నుంచి వెబ్‌తెర వరకూ విస్తరించిన రమ్యకృష్ణ బుల్లితెరను కూడా పాలించనున్నారు. ఆమె ప్రధాన పాత్రధారిగా వచ్చిన ’క్వీన్‌' అనే వెబ్‌సిరీస్‌ను జీటీవీ ప్రసారం చేయనున్నది. ఈ సందర్భంగా ఆ పవర్‌ఫుల్‌స్టార్‌తో ముచ్చట్లు...

క్వీన్‌లో శక్తి శేషాద్రి పాత్ర కోసం ఎలాంటి హోమ్‌వర్క్‌ చేశారు?

ఈ పాత్ర అనే కాదు.. ఏ పాత్రకూ ప్రత్యేకమైన హోమ్‌వర్క్‌ చేసింది లేదు. స్క్రిప్ట్‌ గురించి చెప్పినప్పుడు.. ఆ సీన్స్‌ని బట్టి మీరు రియాక్ట్‌ అవ్వండి చాలు అన్నారు గౌతమ్‌గారు.  నేను అదే చేశాను. అలా వర్కవుట్‌ అయింది.

వెబ్‌సిరీస్‌లో నటిస్తానని అనుకున్నారా? 

వెండితెరకి, వెబ్‌సిరీస్‌కి పెద్ద తేడా లేదు. నటులు అనేవారు ఎక్కడైనా నటించాల్సిందే. అది ఏ మాధ్యమం అనేది ముఖ్యం కాదు. డిఫరెంట్‌ రోల్‌ వస్తే  ఎక్కడ చేయడానికైనా నేను సిద్ధం. మంచి అవకాశం అయితే వెబ్‌సిరీస్‌లలో అయినా నటిస్తాను.

క్వీన్‌ సీరియల్‌గా రాబోతుందని విన్నప్పుడు ఏం అనిపించింది?

ఇది వెబ్‌సిరీస్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌. పైగా క్వారంటైన్‌ సమయంలో సీరియల్‌గా రాబోతున్నది. మరింత మందికి రీచ్‌ అవుతుంది. ఒక వెబ్‌సిరీస్‌ను జీ తెలుగువారు సీరియల్‌గా తీసుకుని వస్తున్నారంటేనే, మంచి ఆదరణ ఉందనే కదా అర్థం.

 ‘నా హృదయానికి దగ్గరైన పాత్ర’ అని ట్వీట్‌ చేశారు. ఎందుకలా అనిపించింది?

నాకు మొదటి నుంచీ శక్తిమంతులైన మహిళల పాత్రలంటే ఇష్టం. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నిబ్బరంగా నిలబడే ఆడవాళ్లను నేను అభిమానిస్తా. వాళ్లు సామాన్యులైనా సరే. నా దృష్టిలో వాళ్లే రియల్‌ స్టార్స్‌. శక్తి శేషాద్రి క్యారెక్టర్‌ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. సంతోషంగానూ ఉంది. నేను అంత పవర్‌ఫుల్‌గా కనిపించడం కూడా నాకు నచ్చింది. అరుదుగా మాత్రమే ఇలాంటి రోల్స్‌ వస్తుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. 

 రాజమాత, క్వీన్‌, మహారాణి ... అంటే రమ్యకృష్ణే అనుకుంటున్నారు, ఎందుకు?

(నవ్వుతూ..) అది నా ఐడియా కాదు. అలా జరిగిపోయింది. దర్శకులకు అనిపించింది. ప్రేక్షకులు ఆదరించారు. ఇదంతా నేను చేసుకున్న అదృష్టం. 

సెకండ్‌ పార్ట్‌లో మీ పాత్ర గురించి చెప్పగలరా?

 పవర్‌ఫుల్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఇప్పటివరకు స్క్రిప్ట్‌ చేతికి రాలేదు. కానీ తొలిభాగం కంటే సెకండ్‌ పార్ట్‌ మరింత సక్సెస్‌ అవుతుందని వందశాతం నమ్ముతున్నా. కరోనా గొడవలన్నీ అయిపోయి.. లాక్‌డౌన్‌ పూర్తి అయ్యాక షూటింగ్‌ మొదలు అవుతుంది. అప్పటివరకు ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో పాల్గొంటానా అని ఎదురుచూస్తూ ఉంటాను.

మీ అబ్బాయి రుత్విక్‌ సినిమాల్లోకి వస్తాడా?

తను ఇంకా చదువుకుంటున్నాడు. కెరీర్‌ గురించి మాట్లాడే వయసు కాదు. తన ఆసక్తి ఏమిటో స్పష్టంగా తెలియదు. నా అభిప్రాయాల్ని తన మీద రుద్దడం నాకు ఇష్టం లేదు.

‘రంగమార్తాండ’తో కృష్ణవంశీ ‘బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌' అని అంటున్నారు. మీరేమంటారు?

అదంతా తెలియదు కానీ, ఆయన రాక్‌ చేస్తారంతే! చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్ర చేస్తున్నా అందులో. ఆయన తీసే విధానం, కథ అన్నీ బాగా కుదిరాయి. నేను ప్రేమించే సినిమాల లిస్ట్‌లో ఇదీ చేరబోతున్నది అని కచ్చితంగా చెప్పగలను.

గత ఏడాది రియాలిటీ షోకి హోస్ట్‌ చేశారు. మరిన్ని షోలు చేసే ఆలోచన ఉందా?

తెలియదు. నాగార్జున గారి కోసం ఆ ప్రోగ్రామ్‌ చేశాను. ఆ షోకీ, నాకూ మంచి పేరు వచ్చింది. అంతకంటే ముఖ్యమైంది ఏమిటంటే.. నాగార్జున గారి పేరు చెడగొట్టకుండా చేయాలనుకున్నా. ఒక చాలెంజ్‌గా తీసుకొని చేశా. మళ్లీ చేస్తానా, లేదా?  అన్నది ఆలోచించలేదు.

ఇప్పుడంతా బయోపిక్‌ల కాలం నడుస్తున్నది. ఇందులో మీరు ఫలానా రాజకీయ నాయకురాలి పోలికల్లో ..

నేను అలా ఏం ఆలోచించను. క్వీన్‌ అనేది ఒక కల్పిత గాథ. చాలామంది ఒకరితో  నన్ను పోల్చుతున్నారు. అలా పోల్చడం సరికాదు. 


అప్పటికీ, ఇప్పటికీ మీ గ్లామర్‌లో ఏ మార్పూ రాలేదు. దీని వెనుక రహస్యం?

(నవ్వుతూ..) అందరూ అలా అనుకుంటున్నారు కానీ, ఏఏ మార్పులు వస్తున్నాయో నాకు మాత్రమే తెలుస్తున్నది.కాకపోతే, మీరంతా అలా  అంటుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అదే నన్ను ఉత్సాహంగా ఉంచుతున్నది.

కృష్ణవంశీ గారు ఒకసారి, ‘రమ్య నాకు మొగుడు’ అన్నారు. మరి మీరేమంటారు?

ఎవరికి ఎవరు మొగుడైతే ఏమిటి? (నవ్వుతూ..) ఆయన సరదాగా అలా అనుంటారు. కొన్నిసార్లు ఆయన భార్య, నేను భర్త కావచ్చు. పాత్రలు మార్చుకోవచ్చు. అయినా భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే అన్యోన్యత ఉంది. మేం ఇదే నమ్ముతాం.

లాక్‌డౌన్‌ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు?

ఇలాంటి పరిస్థితి బాధాకరమే. అందరూ చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. కాకపోతే మనల్ని మనం తరచి చూసుకోవడానికి ఇది సరైన సమయం. కరోనా వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే బాధ తప్ప.. ఒకందుకు మంచే జరిగిందని నా అభిప్రాయం. ఇప్పటివరకు బిజీబిజీగా జీవితాలు గడిపేశాం. ఇకనుంచైనా కుటుంబ విలువను అర్థం చేసుకుని బతకాలి. లాక్‌డౌన్‌ కాలాన్ని నేనైతే  పాజిటివ్‌ ఆలోచనలతో వెళ్లదీస్తున్నా. ఇంటి పనులు చేస్తూ గడిపేస్తున్నా. త్వరలో ఈ పరిస్థితి నుంచి మనమంతా బయటపడాలని ఆశిస్తున్నా. బీ సేఫ్‌.


logo