మంగళవారం 26 మే 2020
Zindagi - May 16, 2020 , 22:45:52

యూట్యూబ్‌ ఆదాయంతో అనాథలకు సాయం

యూట్యూబ్‌ ఆదాయంతో అనాథలకు సాయం

చెన్నయ్‌కి చెందిన శరవణన్‌, రంజిత అన్నాచెల్లెళ్లు. శరవణన్‌ విజువల్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రంజిత ఫ్యాషన్‌ డిజైనర్‌. చిన్నప్పుడు వాళ్లమ్మ పొద్దున్నే కుట్టుపనికి వెళ్లేది. దీంతో పిల్లలే వంట చేసుకొనేవారు. అలా వంటల మీద ఆసక్తి పెరిగింది. ఆ వంటల్ని యూట్యూబ్‌లో పెట్టడం ప్రారంభించారు. వాటిలో  ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నారు. ‘మినియేచర్‌ కుకింగ్‌ షో’ పేరుతో 2018లో చానెల్‌ని మొదలుపెట్టారు. ఇప్పటికి లక్షమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. 134 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు.  మినియేచర్ల కోసం  బొమ్మల షాపుల్లో వెతుకుతారట. చిన్న చిన్న మట్టి పాత్రల్లో కూడా వంట చేయడం మొదలు పెట్టారు. చిట్టిపొట్టి టేబుళ్లు, కుర్చీల సెటప్‌ కోసం ఆర్నెల్లు శ్రమించారట. ఏకంగా ఒక పల్లెవాతావరణాన్ని సృష్టించాడు శరవణన్‌. వంటలు రంజిత చేస్తే వీడియో మేకింగ్‌, ఎడిటింగ్‌ పనులు శరవణన్‌ చూసుకుంటాడు. అంత చిన్న పాత్రల్లో, అది కూడా తినేలాగా చేయడం కత్తిమీద సామే అంటున్నది రంజిత.  ఈ చానెల్‌ ద్వారా వచ్చిన డబ్బును అనాథల కోసం ఖర్చు  చేస్తున్నారు. తాజాగా చికెన్‌ బిర్యానీ వండించి 200మంది అనాథలకు పెట్టారు. ఇప్పటి నుంచి వీడియో తీసిన రోజున కచ్చితంగా ముగ్గురు లేదా నలుగురికి కడుపు నిండా తిండి పెట్టాలని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ అయిపోయాక దేశమంతా తిరిగి సంప్రదాయ వంటకాలను మినియేచర్‌ కుకింగ్‌ ద్వారా పరిచయం చేస్తారట.logo