శనివారం 06 జూన్ 2020
Zindagi - May 16, 2020 , 18:31:54

తెలంగాణకు కేసీఆర్‌ మాట ఓ లక్ష్మణ రేఖ

తెలంగాణకు కేసీఆర్‌ మాట ఓ లక్ష్మణ రేఖ

అతనో సాధారణ చిత్రకారుడు. కుంచె కదిలితేనే గాని కడుపు నిండే పరిస్థితి లేదు. ఒక చిన్నపాటి ప్రైవేటు స్కూల్‌లో చిత్రలేఖనంపై పాఠాలు చెప్పుకునే ఒక డ్రాయింగ్‌ మాస్టారు. ప్రస్తుతం, స్కూలు లేదు.. చేతి నిండా పనీ లేదు. ఇలాంటి సమయంలోనూ లంగర్‌హౌజ్‌ - హైదర్‌షా కోట్‌కు చెందిన చిత్రకారుడు మహేశ్వరం నరహరి సామాన్య ప్రజల జాగరూకత గురించి ఆలోచించి.. వారిని చైతన్యపరిచి, ప్రాణాంతకమైన మహమ్మారి నుంచి రక్షణ కల్పించే దిశగా పయనించారు. 

ఈ నెల పదిహేను రోజుల విపత్కర కాలంలో కరోనా మహమ్మారిపై నరహరి 101 చిత్రాలను గీసి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, తదితర ఆన్‌లైన్‌ మాధ్యమాలే వేదికగా చేసుకొని వందలాది మంది ప్రజలకు ప్రాణాంతకమైన రక్కసి నుంచి రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. మింగేస్తున్న కరోనా వైరస్‌ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. మన భారతాన్ని పదిలపర్చుకొని అక్కున చేర్చుకొని సురక్షితంగా ఉంచుకోవాలనే చిత్రం ఎంతో మందిని ఆకర్షిస్తుంది.  


 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా సోకకుండా రాష్ట్రం చుట్టూ లక్ష్మణ రేఖ గీస్తూ, ప్రజలందరికీ కేసీఆర్‌ గొడుగు పడుతున్నట్టు చిత్రకారుడు అద్భుతంగా గీశారు. కేసీఆరే.. తెలంగాణ.. తెలంగాణ అంటేనే కేసీఆర్‌ అన్నట్టు మరో చిత్రం, కేసీఆర్‌ మాటలు, సూక్తులు ఒక్క తెలంగాణాకే కాకుండా యావత్‌ ప్రపంచానికే ఒక కోటగోడ లాంటివన్నట్టు ఇంకో చిత్రాన్ని గీశారు. కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు ఎంతో ఉన్నతమైనవి, ఉత్తమమైనవని నరహరి తన కుంచె ద్వారా చాటించారు. తెలంగాణ పటమంతా కేసీఆరే అన్నట్టుగా.. కేసీఆర్‌ను చూస్తే కరోనా భయభ్రాంతులకు గురవ్వాల్సిందేనని, కేసీఆర్‌ మాట వేద మంత్రమన్నట్టుగా ఒక చిత్రాన్ని అద్భుతంగా గీశారు. కేసీఆర్‌ను చూస్తేనే కరోనా పరార్‌ / కరోనా కలుపు మొక్క తొలగిస్తున్నట్టుగా కేసీఆర్‌ చర్యలు పటిష్టమైనవిగా మరో చిత్రాన్ని ఆహ్లాదకరంగా మలిచారు. కొద్ది రోజుల కింద కేసీఆర్‌ 66వ జన్మ దినోత్సవం సందర్భంగా 6 అడుగుల 6 అంగుళాల కేసీఆర్‌ చిత్రపటాన్ని తన నోటితో వేశారు. కేసీఆర్‌పై అభిమానంతో తన ఒంటిపై తానే కేసీఆర్‌ చిత్రపటాన్ని గీసుకొని రంగులద్ది ఒక ప్రత్యేక కళా ఖండంగా మలిచారు. 

       

 పోలీసులు, వైద్యాధికారులు, పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి కరోనా రక్కసిపై ఓ యుద్ధం చేస్తోందని నరహరి తన చిత్రాలలో ద్వారా చెప్పారు. ప్రజలు వీటిని అలక్ష్యం చేయరాదని, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కలిగే ఇబ్బందులను సైతం ఆయన ఆవిష్కరించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రజల్లో రోజు రోజుకీ భయం పెరిగిపోతోంది. ఆ భయాన్ని పోగొట్టేందుకు పోలీసులు, వైద్యులు, పారిశుధ్య విభాగం అధికారులు అహర్నిషలు శ్రమిస్తున్నారని, వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, కళాకారులు ప్రపంచమనే పల్లకీని మోసుకుపోయే బోయీలు వర్ణిస్తూ అద్భుత చిత్ర రాజాన్ని ఆవిష్కరించారు.


logo