మంగళవారం 26 మే 2020
Zindagi - May 14, 2020 , 22:15:52

ఈ బియ్యమంటే..వ్యాధులకు భయం!

ఈ బియ్యమంటే..వ్యాధులకు భయం!

వడ్లు కాదు.. ఆ బియ్యమే మొలకలెత్తుతాయి. పొట్టు తీసేసినా జీవం తొణికిసలాడుతూనే ఉంటుంది. అలాంటి బియ్యాన్ని  ఆహారంగా తీసుకుంటే,  తినేవాడికి కడుపు నిండా పోషకాలు... పండించేవాడికి సంచుల నిండా సంపాదన. అదే, ఆ వరి విత్తనాల గొప్పదనం. ‘హ్రైబ్రీడ్‌' వచ్చాక ఐదు వేల రకాల దేశవాళీ విత్తనాలను మరిచిపోయాం.  అనారోగ్యాలకు దగ్గరయ్యాం. కరోనా నుంచి తప్పించుకోవాలంటే, పోషకాహార రూపంలో... కనిపించని  మాస్క్‌ను ధరించాల్సిందే. 

కరోనా వచ్చింది... కళ్లు తెరిపించింది. ఆరోగ్యంగా ఉండటమే అసలైన విజయమన్న స్పృహ కలిగించింది. ఇప్పుడు మన ముందు రెండు ప్రశ్నలు.. ఎక్కువ డబ్బు కావాలా..? ఎక్కువ ఆరోగ్యం కావాలా..?.  సంపాదన అనే మసక తెరలు తొలగిపోయాయి కాబట్టి, ఆరోగ్యాన్నే  ఎంచుకుంటాం.  ఆరోగ్యానికి పునాది ఆహారమే. మంచి ఆహారం రావాలంటే మంచి పంట కావాలి. రసాయనాలతో కల్తీ కాని స్వచ్ఛమైన అన్నం కావాలి.  దేశీ విత్తనాలతోనే అది సాధ్యమని అంటున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు విజయరామ్‌.  


నిస్సారం చేసే రసాయనాలు

తిండి కలిగితె కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌..! ఇప్పుడు మంచి తిండీ లేదు.. కండా లేదు. ఇదంతా హైబ్రీడ్‌ విత్తనాల చలవేనంటారు విజయరామ్‌. అదే, దేశీ విత్తనాలతో పంటలు పండిస్తే ఎరువులు వేయాల్సిన పన్లేదు. నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు. విద్యుత్తూ ఆదా అవుతుంది. రసాయనాల వాసనలేవీ ఉండవు కాబట్టి, స్వచ్ఛమైన ఆహారాన్ని తినగలుగుతాం. రెట్టింపు పోషకాలతో అనారోగ్యాలనూ తరిమికొట్టగలం. 50 కిలోల బస్తాను కూడా ఎత్తగలిగే బలం మనకు లేదంటే, తినే తిండిలో పోషకాలు ఏమేరకు ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. బీపీలు, షుగర్లు, స్థూలకాయం లాంటి సమస్యలు పెరగడానికి ‘హైబ్రీడ్‌ తిండే’ కారణం. తిరిగి మనం  ఆరోగ్యవంతులం కావాలంటే, దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయమే మార్గమంటారు విజయరామ్‌. 

 రెండు అమృతాలు.. ఒక బంగారు పంట

ఆవు, ఎద్దు - మన జీవనంలో ఓ భాగం. అభివృద్ధి పేరుతో ఎద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. సేద్యంలో ఎద్దులను వాడితే వాటి గిట్టలు మట్టి కణాలను కదుపుతాయి. ఫలితంగా నీరు సరిగ్గా ఇంకుతుంది. ట్రాక్టర్‌ ఆ మట్టిని తొక్కేయడం వల్ల అది కాంక్రీట్‌లా తయారవుతుంది. ఎరువులకు బదులు ఆవు పేడ  వేస్తే భూమి లోపలి నుంచి వానపాములు రంధ్రాలు చేసుకుంటూ పైకి వస్తాయి. అలా 70 రకాల సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకు అందిస్తాయి. ఆ పంట నుంచి పోషకాలు మనకూ అందుతాయి. 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 200 కిలోల బెల్లం, 200 కిలోల శనగపిండి, దోసెడు మట్టికి 200 లీటర్ల నీరు కలపాలి. 

దీన్నే జీవామృతం అంటాం. పంట కోసిన తరువాత ఒకసారి, కొత్తపంట వేయబోయే ముందు ఇంకోసారి చల్లాలి. నీరు లేకుండా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి మాత్రమే కలిపితే అది ఘనామృతం. ఈ రెండు అమృతాలతో సంపూర్ణ పోషకాలతో కూడిన పంటను తక్కువ ఖర్చుతో పండించవచ్చని చెబుతారు విజయరామ్‌. ఈయన  వికారాబాద్‌ కేంద్రంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.  హైదరాబాద్‌లో ‘ఎమరాల్డ్‌  స్వీట్స్‌' పేరుతో  రసాయనాల ఆనవాళ్లు లేని మిఠాయిలను అందిస్తున్నారు. వివరాలకు 040-27635867 నంబరులో సంప్రదించవచ్చు. 

10 శాతం నీటితో.. వరి పండిస్తా!

ఒకప్పుడు పద్దెనిమిది రకాల పంటలు పండించేవారు. వాటివల్ల పిల్లలకు పోషక విలువలు దొరికేవి.  దేశవాళీ బియ్యాన్ని మొలకెత్తించి, వేయించి, పొడిచేసి ఆవుపాలలో బెల్లం వేసి పిల్లలకు  పెడితే అంతకు మించిన పౌష్టికాహారం ఉండదు. వీటితో మరమరాలు, అటుకులు చేసుకుని తినడం వల్ల కూడా ఫైబర్‌ అందుతుంది. ఈ బియ్యం రవ్వకు పెసరపప్పు కలిపి తినిపిస్తే చాలా మంచిది. రైతులు ఈ విద్యలన్నీ నేర్చుకోవాలి. పంటలు పండించడమే కాదు, వాటికి అదనపు పోషక విలువలు జోడించి వాణిజ్య పరంగా కూడా లాభాలను గడించవచ్చు. రైతులకు స్వచ్ఛందంగా శిక్షణ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రసాయనాలతో ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రసాయనాలు వాడకుండా కేవలం 10 శాతం నీరు, 10 శాతం విద్యుత్తు మాత్రమే ఉపయోగించి బహురూపి 35 బస్తాలు, నవ్వార 25 బస్తాలు (బస్తాకు 72 కిలోలు) పండించవచ్చు. ఒక్క అవకాశం ఇస్తే పండించి చూపిస్తాం. 

దేశీ విత్తనాలు... ఆరోగ్య విలువలు

నివారణ్‌ నవ్వారా


మొలకలొచ్చే బియ్యం రకం ఇదే. చివరికి నూకల నుంచి కూడా మొలకలొస్తాయంటే ఎంత ప్రత్యేకమైందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ బియ్యంలో 0.5 శాతం ఫైబర్‌ ఉంటే, నవ్వారాలో 14.5 శాతం ఉంటుంది. మలబద్దకం, మోకాళ్ల నొప్పులు, షుగర్‌, స్థూలకాయం, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధుల్ని 45 రోజుల్లో నివారిస్తుంది. కాబట్టే, ‘నివారణ్‌' అన్న పేరొచ్చింది. 

మా పిైళ్లె సాంబ - అల్లుడు బియ్యం 


పెళ్లి సంబంధాలు చూడటానికి ముందు అబ్బాయికి ఈ బియ్యంతో భోజనం పెట్టి బలంగా తయారు చేస్తారు. పెండ్లి కూతురి తండ్రి ... అబ్బాయికి బలపరీక్ష పెడతాడు. ఒక బరువైన రాయిని  పైకి ఎత్తి, ముందుకు కాకుండా వెనుకవైపునకి దూరంగా విసరాలి. ఎవరెక్కువ దూరం విసిరితే వాళ్లే వరపరీక్షలో గెలుస్తారు. అతనికే పిల్లనిచ్చి పెండ్లి చేస్తారు. పరీక్షలో నెగ్గడం కోసమే  వరుడికి ఈ బియ్యాన్ని వండి పెట్టేవాళ్లు. ఇకపోతే పెళ్లి కూతురి దగ్గరికి పంపేటప్పుడు, పండగలప్పుడు అల్లుడికి ఈ బియ్యంతోనే ప్రత్యేకంగా వండి పెడతారు. అందుకే దీనికి ‘అల్లుడు బియ్యం’ అన్న పేరు వచ్చింది. మగవాళ్లలో పునరుత్పత్తి సమస్యలకు ఈ విత్తనం మంచి పరిష్కారం. చూపిస్తుంది. ఈ  అన్నం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. 

 కుల్లాక్కర్‌ రకం

నానబెట్టినా చాలు, 60 నుంచి 80 శాతం వరకు ఉడికినట్టుగా అయిపోతాయి. గర్భిణులకు పెడితే సాధారణ కాన్పు అవుతుంది. బాలింతలకు పాలు బాగా పడతాయి. సాధారణంగా కవల పిల్లలను కన్నవాళ్లకు పాలు సరిపోవు. అలాంటివాళ్లకు ఈ బియ్యం వండి పెట్టేవాళ్లు అప్పట్లో. 

మైసూరు మల్లిగె

ఈ విత్తనంలో 17 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. కర్ణాటకలో అన్న ప్రాసన తర్వాత చంటిపిల్లలకు ఈ అన్నమే పెడతారు. టీనేజ్‌కి వచ్చేవరకు నిత్యం మైసూరు మల్లిగె భోజనమే. 

బహురూపి

పేరుకు తగినట్టుగానే బహు సుగుణాలున్న బియ్యం ఇది. ఏ రసాయనాలూ వాడకుండా ఎకరానికి 35 బస్తాలు వస్తాయి. బస్తాకు 72 కిలోలు. ప్రకృతి వ్యవసాయంతో మొదటి సంవత్సరంలోనే ఈ దిగుబడిని సాధించవచ్చు. ఒకసారి ఓ రైతు శ్రీకృష్ణ దేవరాయలకు బహురూపి బియ్యంతో భోజనం పెడితే, దాని గురించి ఆయన తన ఆముక్త మాల్యదలో రాసుకున్నాడు. బహురూపితోపాటు బంగారు తీగలు అనే మరో రకం బియ్యం గురించి కూడా ఆ గ్రంథంలో ప్రస్తావించాడు. కుండలో వండిన అన్నం మూడు రోజులైనా పాడవదు. ఈ బియ్యం చీకట్లో ముత్యాల్లా కనిపిస్తాయి. 

కాలాబత్‌


వీటినే నల్లబియ్యం అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువ.  విటమిన్లు బి-6, బి-12, రాగి, ఇనుము అధికంగా ఉంటాయి. ఫైబర్‌ కూడా ఎక్కువే. ఈ బియ్యం క్యాన్సర్‌నూ నివారిస్తుంది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన అనుపమ్‌ పాల్‌ దేశీవిత్తనాలపై పరిశోధన చేస్తున్నారు.  కాలాబత్‌ రకాన్ని కూడా అధ్యయనం చేశారు. విత్తనం నాటిన 40 నుంచి 50 రోజుల తర్వాత, వరిపోసల్ని కోసుకుని శనగపిండిలో ముంచి, బజ్జీల్లా చేసుకుని తింటే క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని పాల్‌ అధ్యయనంలో తేలింది.

  •   విజయరామ్‌  
  • ప్రకృతి వ్యవసాయదారుడు, 
  • దేశీ విత్తనాల పరిశోధకుడు


logo