మంగళవారం 26 మే 2020
Zindagi - May 14, 2020 , 22:15:51

ప్రేమ ‘మందిరం’

ప్రేమ ‘మందిరం’

ఎదిరించి నిలబడితే ప్రతి సమస్యా పరిష్కారం అవుతుందని దృఢంగా నమ్మింది ఆ మహిళ. చిన్ననాటి నుంచి పోరాడిన సమస్యలపైనే పెద్దయ్యాకా యుద్ధం చేసింది. తనతోపాటు ఐదువేల మందిని విజయ తీరాలకు చేర్చింది. అసోంకు చెందిన ఆ అమ్మ పేరు మందిర.

చిన్న వయసులోనే పెండ్లి.. గుండెజబ్బులున్న భర్త. దీంతో పాఠశాల వయసు నుంచే సమస్యలతో మందిర పోరాటం మొదలైంది. భర్త జలవనరుల శాఖలో ఇంజినీర్‌. పెండ్లయిన కొత్తలోనే అనారోగ్యంతో దవాఖాన పాలయ్యాడు. కదల్లేని పరిస్థితుల్లో వీల్‌చైర్‌కే పరిమితయ్యాడు. దీంతో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నది మందిర. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఇంటిని తాకట్టు పెట్టారు అత్తమామలు. అద్దె ఇంట్లో ఉంటూ.. కుట్లూ అల్లికలతో నాలుగురాళ్లు సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. 

భర్తకు సేవ చేయడానికి ప్రత్యేకంగా నర్సింగ్‌లో శిక్షణ తీసుకున్నది. కొంతకాలం బొకేలు తయారు చేసింది. క్యాబ్‌లు నడిపింది. బ్యాంకు రుణం తీసుకుని కారు యజమాని అయ్యింది. తన భర్తకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రభుత్వ గృహం కోసం కలెక్టర్‌తో పోరాడింది. మొత్తానికి ఓ ఇంటిని కేటాయించాడు కలెక్టర్‌. 2001లో భర్త మరణం తర్వాత ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ‘సత్సారీ’ పేర ఎన్జీఓను స్థాపించింది. దీని ద్వారా మహిళా సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. వారికి చుక్కానిగా మారింది మందిర. ఉపాధి, శిక్షణకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తున్నది.  2010 నాటికి ఆ ఎన్జీఓలో 10వేలకు పైగా సభ్యులు చేరారు. 


తర్వాత ‘మందిరా సొల్యూషన్స్‌' పేరుతో బాల బాలికలు, వృద్ధులకు ఆశ్రయం కల్పించి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చింది. అస్సామీ సంస్కృతిని దేశానికి పరిచయం చేసింది. పాటలు రాసి, డాన్స్‌ కూడా కంపోజ్‌ చేసింది.  అరవైకి  పైగా సాంస్కృతిక సంస్థలు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికల ద్వారా అసోం గిరిజన కళలను, విభిన్న నృత్యాలను ప్రపంచం ముందు ఉంచింది మందిర. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మంది మహిళలకు ఉపాధి చూపిస్తున్నది. ప్రస్తుతం అసోంలోని సోనాపూర్‌ జిల్లా ప్రజారోగ్య కేంద్రంలో హెడ్‌ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నది మందిర. అంతేకాకుండా లింగ సమానత్వం, లైంగిక వేధింపులు, వరకట్నం తదితర సమస్యలపైనా పోరాడుతున్నది. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన వాణిని బలంగా విపిస్తున్నది ఈ సామాజిక యోధురాలు. దాదాపు పదివేల జీవితాలు ఆమెపై ఆధారపడ్డాయి. అంతా అమ్మా అనే పిలుస్తారు. 


logo