మంగళవారం 26 మే 2020
Zindagi - May 11, 2020 , 22:58:51

నర్సులారా వందనం!

నర్సులారా వందనం!

ఏ బంధముందని నర్సులు సేవ చేస్తున్నారు? ఏమొస్తుందని కరోనాతో పోరాడుతున్నారు? ఎవరి కోసం మందులేని రోగం నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు? మన కోసమే కదా? కానీ.. మనం వాళ్లకేమైనా ఇస్తున్నామా?  నేడు, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అయినా వారి సేవల్ని ఒకసారి తలచుకుందాం. 

నర్సు వృత్తి ఉన్నతమైంది. రోగి ఏ స్థితిలో ఉన్నా సేవలు చేయాల్సిందే. ఒక్కోసారి కుటుంబ సభ్యులు కూడా రోగుల్ని చూసి భయపడుతుంటారు.. చీత్కరించుకుంటారు. కానీ ఏ భయానికీ .. చీత్కారానికీ తావులేని బాధ్యతగల వృత్తి నర్సింగ్‌. రోగి ఆసుపత్రిలో చేరింది మొదలు..  కోలుకొని తిరిగి వెళ్లేవరకు అందించే మానవీయ సేవల వల్లే  నర్సులను ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ వారసులుగా పేర్కొంటారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ దగ్గరుండి సేవలు చేసింది. లాంతరు పట్టుకొని తిరుగుతూ వైద్యం అందించింది. అందుకే ఆమెను లేడీ విత్‌ ల్యాంప్‌ అని కీర్తించారు. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించుకుని రోగులకు సేవలందించేలా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన నైటింగేల్‌ జయంతి... మే 12న. 


మన బాధ్యత: తెల్లని వస్త్రం.. నీలం రంగు అంచు.. చూడగానే అమ్మ గుర్తొచ్చే రూపం. మానవతకు మారు పేరుగా నిలుస్తూ.. మనసు నిండా సేవా తత్పరతను నింపుకున్న వ్యక్తి నర్సు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో నర్సులే ప్రజారోగ్య సంరక్షకులు. నర్సుల సేవల్ని గుర్తించడం.. గౌరవించుకోవడం సమాజం బాధ్యత. అందులోనూ కరోనా సమయంలో... కన్నబిడ్డలకూ కుటుంబ సభ్యులకూ దూరంగా, రోగులే ప్రపంచంగా సేవలు అందిస్తున్నారు నర్సులు. గాంధీ హాస్పిటల్‌లోని  కరోనా ట్రీట్‌మెంట్‌ సెంటర్‌లో వందలాది నర్సులు సేవ చేస్తున్నారు. కోలుకునేదాకా రోగులను దగ్గరుండి చూసుకొంటున్నారు. మహానగరంలోనే కాదు, మారుమూల గూడేల్లోనూ నర్సమ్మలు అమ్మల్లా జనాన్ని కాపాడుతున్నారు. ‘మా వృత్తి చాలా బాధ్యతాయుతమైంది. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడవెల్లి పీహెచ్‌సీలో ఏఎన్‌ఎమ్‌గా చేస్తా. అంతా కోయవాళ్లే. వాగులు.. వంకలు. రోడ్డు మార్గం లేదు. రోజూ ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్తుంటా. గూడెం గూడెమూ తిరిగి ప్రజలను కాపాడుతున్నా’ అంటారు రాధాబాయి అనే నైటింగేల్‌ వారసురాలు. 


logo