మంగళవారం 26 మే 2020
Zindagi - May 09, 2020 , 22:41:36

వలసకూలీలకు అన్నపూర్ణమ్మ!

వలసకూలీలకు అన్నపూర్ణమ్మ!

ఆమెదీ ఎల్లీఎల్లని జీవితమే. ఏ పూటకాపూట గడిచే సంసారమే. కానీ.. వలసకూలీలు తల్లడిల్లితే తట్టుకోలేకపోయింది. కూడబెట్టుకొన్న పైసా పైసా పేదోళ్ల ఆకలి తీర్చేందుకు ఖర్చు చేస్తున్నది.  రోజుకు రెండుపూటలా అంబలి.. వారానికి సరిపోయే కూరగాయలూ బియ్యం పంచుతూ మానవత్వం చాటుకుంటున్నది. సాయం చేయడానికి లక్షాధికారే కానవసరం లేదు. కావాల్సింది మనసు. ఒక అమ్మ ఇదే నిరూపిస్తున్నది. 

అదొక అడవి. చుట్టూ పొలాలు.. మధ్యలో మల్లారం తండా ఇటుక బట్టీలు. ఎర్రటెండ. నడినెత్తిల సూర్యుడు సెగలు కక్కుతున్నడు. గాలి లేక ఏ చెట్టు కొమ్మా విసురత లేదు. ఇంతలో ఒక్కటే పిల్లల కేకలు. అర్ధగంట అయింది.. గంట అయింది.. రెండు గంటలు అయింది. అట్లనే ఏడుస్తున్నారు. ఏమైందో ఏమో?అని చుట్టుపక్కల పొలాల వాళ్లు కంగారు పడ్డారు. బట్టీల దగ్గరికి పోయి చూస్తే గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లలు.. వాళ్లను ఆపేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు. ఏదో సముదాయించి.. అందరూ వెళ్లిపోయారు. 

జయవ్వ మానవత్వం 

ఒక అమ్మ మనసు మాత్రం తల్లడిల్లింది. బట్టీల వద్దకు వెళ్లింది. ఆ పిల్లలు ఏడుస్తున్నది ఆకలితోనే అని తెలుసుకున్నది.ఆ అమ్మే పోతరాజు జయవ్వ. అక్కడ పదిహేను కుటుంబాలు ఉంటున్నాయి. పిల్లాజెల్ల్లాతో కలిసి యాభైమంది వరకూ ఉన్నారు. వాళ్లంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు. ఏళ్ల తరబడి ఇక్కడే బట్టీల్లో పనిచేస్తూ బతుకీడుస్తున్నారు. జయవ్వ.. వాళ్లింటాయన పోశయ్యతో ఆలోచన చేసింది. పనిలేక.. తిండిలేక తల్లడిల్లుతున్న బట్టీ కూలీల కడుపు నింపాలని నిర్ణయించుకున్నది. రోజూ రెండు పూటల తైదంబలి.. వారానికి కూరగాయలు.. బియ్యం.. పప్పులు.. చింతపండు పంచుతున్నది. 

రేషన్‌ బియ్యం వాళ్లకే 

జయవ్వ కుటుంబానిది కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం లింగంపల్లి కుర్దు. ఊర్లో గుట్టకింద మూడెకరాల పొలం ఉంది. ఏడుపుట్ల ఎల్లకాలం బాయి కాడ పనిచేస్తేనే తిండిమందం దొరుకుతుంది. ఇటుకబట్టీల దగ్గరకు వెళ్లిన జయవ్వ అందర్నీ పిలిపించి వాళ్లకేం కావాలో అడిగింది. ఎండాకాలంలో అంబలి అయితేనే బాగుంటుందని చెప్పడంతో రోజూ రెండు పూటలా అంబలి పోస్తున్నది. అంతేకాదు, ఈ రెండు నెలల నుంచి తనకు వచ్చిన రేషన్‌ బియ్యం.. సరుకులు కూడా వాళ్లకే ఇస్తున్నది. 

వారానికి కూరగాయలు 

రోజూ మోపెడ్‌ మీద అంబలి డబ్బాలు కట్టుకొని మల్లారం తండాకు పోతున్నది. వాళ్లతో కూర్చొని ఆపతి సంపతి మాట్లాడి మనోబలం  ఇస్తున్నది. అంబలి కాకుండా వారినికి ఒకసారి అన్ని రకాల కూరగాయలు.. అందిస్తున్నది జయవ్వ. తనది పెద్ద సాయమేమీ కాకపోయి ఉండొచ్చు. కానీ స్థోమతకు మించిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నది. ఈ ఆపత్కాలంలో లక్షల రూపాయలే కాదు.. వందల రూపాయలు కూడా  ఆకలి తీరుస్తాయని నిరూపిస్తున్నది. 

మహారాష్ట్ర పోలేక.. 

మల్లారం తండాలో ఇటుక బట్టీల దగ్గర పనిచేసే కూలీలంతా మహారాష్ట్రకు చెందినవాళ్లే. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్తున్నారు. కానీ మల్లారం తండా నుంచి మాత్రం ఎవరూ కదలడం లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్లకు సొంతిండ్లు లేవు. అక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి అన్నమాట. ఏడైనా ఇలాగే ఉండాలి కదా అని ఒకపూట తిని.. ఇంకోపూట ఉపాసం ఉండయినా సరే ఇక్కడే ఉందామని ఆగిపోయారు. ఇప్పుడిప్పుడు పనులు కూడా స్టార్ట్‌ అవుతున్నాయి. జయవ్వ తమకు చల్లటి అంబలి పోసిందనీ.. ఆ అమ్మ కడుపు చల్లగా ఉండాలనీ కూలీలు దేవుడ్ని మొక్కుకుంటున్నారు. 


logo