గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Apr 12, 2020 , 22:45:14

కరోనాపై.. పోలీస్‌ సైరన్‌

కరోనాపై.. పోలీస్‌ సైరన్‌

అతడో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. అందులోనూ ట్రాఫిక్‌ వింగ్‌. తీరిక ఉంటుందా? కానీ.. అతడు చేసుకుంటున్నాడు. ఏదో.. కాలక్షేపం కోసం కాదు. కరోనా రక్కసి నుంచి సామాన్యుడిని కాపాడటం కోసం.  పాటతో..మాటతో.. కరోనా సందేశమిస్తున్నాడు.  ఇంతకూ ఎవరాయన? 

అంజపల్లి నాగమల్లు ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. సామాజిక బాధ్యత కలిగిన పోలీసుగా ఇతడు కరోనా మహమ్మారి పట్ల మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి.. ఆ వైరస్‌ ఎంత ప్రమాదకరమైంది.. లాక్‌డౌన్‌కు అంతరాయం కలిగించొద్దంటే ఏం చేయాలి?.. తదితర విషయాల మీద సోషల్‌ మీడియాలో అవగాహన కల్పిస్తూ వీడియోలు పెడుతున్నాడు. 

 కరోనాపై పాట 

తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మార్చి 4వ తేదీన నమోదైంది. అప్పటికి ప్రజలకు కరోనా గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రపంచ దేశాలకు కరోనా ఎలా విస్తరిస్తుందో పరిశీలిస్తున్న వ్యక్తిగా నాగమల్లు మార్చి 5వ తేదీనే కరోనా గురించి అవగాహన కల్పిస్తూ పాట రాసి..రికార్డ్‌ చేసి వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ‘భయపడవద్దు.. భద్రత పాటిద్దాం. కలిసికట్టుగా కరోనాను అరికట్టేద్దాం’ అనే ఆ పాట  వైరల్‌గా మారింది.   

 ఆన్‌రోడ్‌ అవేర్‌నెస్‌ 

లాక్‌డౌన్‌ లేకముందు.. కరోనా చాపకింద నీరులా పాకుతూ వచ్చింది. అప్పుడు మన చేతిలో ఉన్న అస్త్రం ఒక్కటే.. శుభ్రత. చేతులే ఆయుధాలుగా కరోనాతో శాంతియుత పోరాటం ఎలా చేయాలో నాగమల్లు ఆలోచించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను వేదికగా ఎంచుకుని వాహన చోదకులకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజేసి తన బాధ్యతను చాటిచెప్పారు.   కరోనా తీవ్రత గురించి ఎక్కువమందికి తెలిసేలా ‘ఒగ్గుకథ’ను రికార్డ్‌చేసి యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. దాంతోపాటు మరో కరోనా పాటను కూడా తీసుకొచ్చారు. 

 ట్రెయిన్డ్‌ ఆన్‌ కరోనా 

నాగమల్లును మొదట్నుంచి  ప్రోత్సహిస్తున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌.. కరోనాపై  పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చో అతడితో చర్చించారు. సీపీ ఆదేశాల మేరకు నాగమల్లు ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌'లో శిక్షణ తీసుకున్నారు. ట్రెయినింగ్‌ తర్వాత తన కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. 

 1000 మందికి భోజనం

రోజూ డ్యూటీ చేస్తూనే కరోనాపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు నాగమల్లు. లాక్‌డౌన్‌ వల్ల పేదవారికి.. ఫుట్‌పాత్‌లపై ఉండేవారికి ఆహార సమస్య ఏర్పడుతున్నది. అనాథల్ని ఆకలిబాధ నుంచి తప్పించడానికి తన సొంత ఖర్చుతో సుమారు 1000 మందికి  భోజన ఏర్పాట్లు చేశారు.  

కళాబృంద సందేశం 

ఒక్క కరోనా సందర్భంగానే కాదు.. నాగమల్లు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన నాటినుంచే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఒక కళాబృందాన్ని ఏర్పాటుచేసి సామాజిక అంశాలపట్ల ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

కమిషనర్‌ ప్రోత్సాహం

 మాది సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం శిల్పకుంట్ల గ్రామం. 2008లో ఎస్సైగా ఉద్యోగంలో చేరా. ఒకసారి నల్లగొండలో మూఢనమ్మకాలతో ఒక మహిళను కాల్చి చంపిన ఘటన జరిగింది. ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు నేను నడుముకు కొక్కేలు వేసుకొని టాటా సుమోను లాగాను. అప్పుడు మహేశ్‌ భగవత్‌ గారు నల్లగొండ ఎస్పీ. నా గురించి అప్పట్నుంచీ తెలుసు కాబట్టి నన్ను సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. 

-నాగమల్లు 


logo