ఆదివారం 07 జూన్ 2020
Zindagi - Apr 08, 2020 , 21:47:35

ఇకనుంచైనా...

ఇకనుంచైనా...

యోగా చేయండి. ధ్యానం మానకండి. ఆసనాలు వేయండి. ఆయుర్వేదం మంచిదండి. అంటూ భారతీయతకు జైకొడుతున్నారు చైనీయులు.

కరోనాకు ఇంగ్లీష్‌ మెడిసిన్‌ ఇంకా ప్రత్యేకమైన మందులేవీ రాలేదు. కానీ భారతీయ వైద్య విధానాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచే దిశగా మంచి పరిష్కారాలను సూచిస్తున్నాయి. చైనా కూడా... లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత భారతీయ యోగా, ఆయుర్వేద సూత్రాలనే పాటించమని ప్రజలకు చెప్తున్నది. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. ఆ గాయం  విలువైన పాఠాన్ని నేర్పుతుంది. కరోనా సంక్షోభం నుంచి చైనా నేర్చుకున్న పాఠం పేరు... భారతీయత, భారతీయ వైద్యం. భారతీయ జీవన విధానం ఏ సమస్యను అయినా మూలాల నుంచి చూస్తుంది. వైరస్‌ మనమీద దాడి చేయకుండా ఉండాలంటే, మన జఠరాగ్నిని వృద్ధి చేసుకోవాలి. నాభి దగ్గర ఉండే మణిపూరక చక్రాన్ని చైతన్యం చేయాలి. ఇందుకు యోగ ప్రక్రియ, ప్రాణాయామ, ఆసనాలు, ముద్ర, ధ్యానం ...అన్నీ కలిపి సాధన చేయాలి.  

కపాల భాతి

ఇది ప్రాణాయామ కాదు, బ్రీతింగ్‌ టెక్నిక్‌. శరీరం లోపల శుభ్రం చేసే యోగ ప్రక్రియ. దీనివల్ల లోపలున్న మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఉన్న కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి కణం చైతన్యమంతం అవుతుంది.  యోగాను కపాల భాతితోనే మొదలుపెట్టాలి. కింద కూర్చోలేకుంటే కుర్చీలో అయినా చేయొచ్చు. కపాల భాతి చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. శ్వాసను గట్టిగా, బలంగా బయటికి వదలాలి. పీల్చుకునేటప్పుడు సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఒక సెకనుకు ఒక స్ట్రోక్‌ చొప్పున చేయాలి. ఇవి 30 నుంచి మొదలుపెట్టి వంద వరకూ సాధన చేయాలి. కపాలభాతి చేసేటప్పుడు గొంతు, ఛాతీ మీద ఒత్తిడి తేవద్దు. ముక్కు రంధ్రాలపై మాత్రమే ఒత్తిడి ఉండాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలర్జీలు, దగ్గు, జలుబు రావు. వైరస్‌ లోపలికి ప్రవేశించినా... బయటకు నెట్టేయబడుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. అయితే పీరియడ్స్‌లో ఉన్నవాళ్లు, గర్భిణులు, పొట్టలో హెర్నియా ఉన్నవాళ్లు, బీపీ, షుగర్‌ పేషెంట్లు దీన్ని చేయకూడదు. జలుబు ఉన్నా, ఫిట్స్‌ ఉన్నా చేయొద్దు. కపాల భాతి అయిన తర్వాత ఒక నిమిషం పాటు కళ్లు మూసుకుని మామూలు శ్వాస వదలాలి. 

 బస్త్రిక ప్రాణాయామ

దీన్ని మూడు దశల్లో చేయాలి. మొదట ఎడమ ముక్కు మూసి, కుడి ముక్కుతో శ్వాస వదలాలి. ఆ తరువాత కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కుతో వదలాలి. చివరగా రెండు ముక్కురంధ్రాలతో ఒకేసారి శ్వాసతీసుకుని వదలాలి. ఇవన్నీ 60 నుంచి 100 సార్లు చేయాలి. ఆ తరువాత ఓ నిమిషం పాటు కళ్లు మూసుకుని శ్వాస వదలాలి. 

అగ్నిసార 

ఈ క్రియను కూర్చుని లేదా నిలబడి చేయొచ్చు. వెన్ను నిటారుగా ఉండటం ముఖ్యం. దీనిలో శ్వాస నార్మల్‌గా పీల్చుకుని, వదిలేటప్పుడు మాత్రం బలంగా వదలాలి. మళ్లీ శ్వాస పీల్చుకోకుండా పొట్టను వీలైనంత సేపు కదిలిస్తూ ఉండాలి. తర్వాత మామూలుగా శ్వాస తీసుకుని రిలాక్స్‌ అవ్వాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. 

ముద్రలు

శ్రీలింగ ముద్ర - నిటారుగా కూర్చోవాలి. రెండు చేతుల్లోని... నాలుగు వేళ్లు ఒకదానితో ఒకటి కలపాలి. మగవాళ్లయితే కుడి బొటనవేలు, ఆడవాళ్లయితే ఎడమ బొటనవేలు పైకి ఉంచాలి. రెండు చేతులను పొట్టకు రెండుమూడు అంగుళాల దూరంలో ఉంచాలి. ఇలా పెట్టిన తరువాత కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉండాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి, అసలు రాకుండా ఉండటానికి  సహాయపడుతుంది.  శ్వాసముద్ర కూడా అంతే శక్తిమంతమైంది. చిటికెన వేలును బొటనవేలు మొదట్లో ఉంచాలి. ఉంగరం వేలు బొటనవేలి మధ్యలో, మధ్యవేలు బొటనవేలి చివరి భాగంలో ఉంచాలి. చూపుడు వేలు నిటారుగా ఉండాలి. ఇప్పుడు కూడా శ్వాస మీద ధ్యాసపెట్టి 3 - 5 నిమిషాలు ఉండాలి. ఊపిరి తీసుకునేటప్పుడు శక్తిని తీసుకుంటున్నట్టుగా, వదిలేటప్పుడు మలినాలను పంపిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. దీనివల్ల శ్వాస సమస్యలు, అలర్జీ, ఆస్తమా తగ్గుతాయి. 

భ్రామరీ ప్రాణాయామ

మానసిక ఒత్తిడికి ఇది మంచి పరిష్కారం. నిద్రకు ముందు  3 నిమిషాల పాటు చేయాలి. ముందుగా రెండు బొటనవేళ్లతో రెండు చెవులు మూయాలి. తరువాత చూపుడు వేళ్లను కనుబొమలకు పైన... చిటికెనవేలు, ఉంగరం వేలు, మధ్యవేళ్లను కనుకొలకుల దగ్గర ఆనించాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకుని ఊ... అంటూ తుమ్మెద ఝంకారంలా శబ్దం చేయాలి. ఈ కంపనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటిని గమనిస్తూ నెమ్మదిగా కళ్లు తెరవాలి. ఒక 30 సెకన్ల పాటు... ఊపిరి పీల్చుకుంటున్నప్పుడల్లా ఇలా చేస్తూ పోవాలి. 

-అరుణాదేవి 

-యోగా గురువు


వీటితో పాటుగా...

సూర్య నమస్కారాలు రోజూ కనీసం 6 సార్లు చేయాలి. ఉష్ర్టాసనం, భుజంగాసనం, మత్స్యాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సర్వాంగాసనం, నౌకాసనం, ధనురాసనం... లాంటివి కూడా వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. 

  • అరగంటకోసారి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఉదయాన్నే నువ్వుల నూనెతో నోరు పుక్కిలించి, వేడినీటితో నోరు కడుక్కోవాలి. 
  • గ్లాసు పాలలో పావు టీ స్పూన్‌ పసుపు వేసి, మరిగించి పిల్లలు, వృద్ధులకు ఇవ్వాలి. 
  • చిన్న శొంఠి, 5 నల్ల మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, నాలుగైదు తులసి ఆకులు, మూడు నాలుగు ఎండు ద్రాక్ష వేసిన గ్లాసు నీటిని మరిగించి... వడపోసిన తరువాత దానికి నిమ్మరసం, తేనె లేదా బెల్లం కలిపి తయారు చేసిన... హెర్బల్‌ టీని 40 రోజుల పాటు  తాగాలి. 
  • పొడిదగ్గు, గొంతునొప్పి ఉంటే పావు టీ స్పూన్‌ లవంగాల పొడికి టీ స్పూన్‌ తేనె కలిపి  సమస్య తగ్గేవరకు 3 పూటలా తీసుకోవాలి. 
  • రోజూ నువ్వుల నూనె లేదా ఆవునెయ్యి ఓ రెండు చుక్కలు... రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకోవచ్చు. పిల్లలకు కూడా వేయవచ్చు. 
  • రోజూ పుదీనా, పసుపు వేసిన నీటితో ఆవిరి పట్టాలి. 
  • జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లి, పసుపు మామూలు కన్నా ఎక్కువ వాడాలి. 


logo