బుధవారం 03 జూన్ 2020
Zindagi - Apr 04, 2020 , 22:23:08

ఊరికి మొనగాళ్లు

ఊరికి మొనగాళ్లు

ఒక అక్క పంపు భుజానికెత్తుకుంది.. ఒక అన్న ఊరంతా బ్లీచింగ్‌ చల్లాడు.. ఒక చెల్లి ఆటోలో మైకు పట్టి ప్రచారం చేసింది.. ఒక తమ్ముడు మాస్కులు పంచాడు.. వీరంతా మన సర్పంచ్‌లు.. కరోనా మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు    అడుగేసిన ప్రజా సేనాపతులు. సేవకులు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు కొందరు సర్పంచ్‌లు ఊరికి కథానాయకులయ్యారు. ప్రజలతో ‘మా ఊరి మొనగాళ్లు’అనిపించుకున్నారు.  

గ్రామం : ముక్రా (కే), ఇచ్చోడ (మం),ఆదిలాబాద్‌ జిల్లా


సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌ భార్యాభర్తలు. గ్రామంలో మొత్తం 166 కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికీ కావాల్సిన నిత్యావసర సరుకులను వీడీసీ ఆధ్వర్యంలో వారానికి మూడుసార్లు ఉచితంగా అందజేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా రోజూ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. గడపదాటి బయటకి వచ్చినవారికి రూ. వెయ్యి జరిమానా వేస్తున్నారు. అత్యవసర పనులుంటే తామే వాహనం సమకూర్చి బయటకు తీసుకెళ్తున్నారు. రేషన్‌షాప్‌ వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. రోజుకు వంద కుటుంబాలకు మాత్రమే రేషన్‌ బియ్యాన్ని ఇస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా మురుగు కాలువల్లో మందు పిచికారీ చేస్తున్నారు.

గ్రామం : రామన్నపేట రామన్నపేట (మం), యాదాద్రి  భువనగిరి జిల్లా


రామన్నపేట మేజర్‌ గ్రామ పంచాయతీ. సర్పంచ్‌ గోదాసు శిరీష. ప్రభుత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పాటు శిరీష తానుగా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. ఆటోలో మైకు పెట్టి స్వయంగా గ్రామస్తులకు జాగ్రత్తలు చెబుతున్నది. కరోనా నుంచి రక్షణ కోసం శానిటైజర్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌లను అందజేసింది. 10 వేల రూపాయలను సీఎం సహాయనిధికి ఇచ్చింది. గ్రామంలోని వలస కార్మికుల కుటుంబాలను కలిసి ప్రభుత్వ సాయం అందేలా చూస్తున్నది. 

గ్రామం : మనోహరాబాద్‌ , మనోహరాబాద్‌ (మం), మెదక్‌ జిల్లా 


రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి (స్థానిక సర్పంచ్‌) ట్రాక్టర్‌కు మైక్‌ పెట్టి రోజూ ఊరంతా తిప్పుతున్నాడు. మైకులో ‘గ్రామంలో పరిశుభ్రత పాటించాలి. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా కొనసాగించాలి’ అని ప్రచారం చేస్తున్నాడు. సొంత ఖర్చుతో ఇంటింటికీ మాస్కులు అందజేశాడు. స్వయంగా రసాయన మందును వీధుల్లో పిచికారీ చేస్తున్నాడు. 

గ్రామం : ఖానాపురం ,అనంతగిరి (మం), సూర్యాపేట జిల్లా


సర్పంచ్‌ జొన్నలగడ్డ శ్రీనివాసరావు సొంత ఖర్చులతో గ్రామాన్ని కాపాడుకుంటున్నాడు. గ్రామంలో 410 ఇండ్లు ఉండగా ఇంటింటికీ ఒక శానిటైజర్‌ ఉచితంగా పంచాడు. వైద్య సిబ్బందితో కలిసి వెళ్లి వైరస్‌ గురించి అవగాహన కల్పిస్తున్నాడు. గ్రామంలో సుమారు 1600 మందికి మాస్కులను కుట్టించి ఇచ్చాడు. కరోనా నియంత్రణ జాగ్రత్తలపై వాల్‌ పోస్టర్లు ప్రింట్‌ చేయించి ప్రతి ఇంటికీ అంటించాడు. ఆటోకు మైక్‌ బిగించి గ్రామ వీధుల్లో తిప్పుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేయిస్త్తున్నాడు. ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా ఇళ్ల వద్దకే కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయిస్తున్నాడు. గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు, అంగన్‌వాడీలు, పీఏసీఎస్‌లకు శానిటైజర్లతోపాటు హ్యాండ్‌వాష్‌ బాటిళ్లను ఇచ్చాడు. 

గ్రామం :  వెంకటేశ్వర్లపల్లి,రేగొండ (మం), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 


సర్పంచ్‌ చిగురుమామిడి రజితతో కొందరు మహిళలు చేతులు కలిపారు. రజిత భుజానికి చేతిపంపు వేసుకుని ఊరంతా రసాయనాలను పిచికారీ చేస్తుంటే, ఇతర మహిళలు బ్లీచింగ్‌ చల్లుతున్నారు. తాగునీటిని క్లోరినేషన్‌ చేస్తున్నారు. 25 ఏండ్ల రజిత గ్రామం కోసం ఇదంతా చేస్తుండటంతో ‘మా మంచి సర్పంచ్‌' అని గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. గ్రామం మీదుగా పక్క జిల్లా ములుగుకు వెళ్లే రహదారి ఉంది. దీంతో గ్రామం మీదుగా వెళ్లే ప్రయాణికులు గ్రామంలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

గ్రామం : టేక్మాల్‌ ,టేక్మాల్‌ (మం), మెదక్‌ జిల్లా 


టేక్మాల్‌ మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ సుప్రజాభాస్కర్‌. 22 ఏండ్లకే సర్పంచ్‌ అయ్యింది. కరోనా నేపథ్యంలో ఊరి నలువైపుల రోడ్లను మూసేసింది. అత్యవసర వాహనాలు తప్ప వేటినీ అనుమతించడం లేదు. వార్డుసభ్యులకు మరో ఇద్దరిని కలిపి ప్రతి వార్డుకూ కమిటీ వేసింది సుప్రజ. తమ వార్డును కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత వారిదే. గ్రామంలోకి కొత్తవారు వస్తే వైద్య సిబ్బందిని పిలిపించి పరీక్షలు చేయిస్తున్నది. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత కోసం తానే శానిటైజేషన్‌ చేస్తున్నది.

గ్రామం : బొంతపల్లి, అనంతారం, గుమ్మడిదల (మం), సంగారెడ్డి జిల్లా