బుధవారం 03 జూన్ 2020
Zindagi - Apr 03, 2020 , 22:22:51

హెల్ప్‌ లైన్లు!

హెల్ప్‌ లైన్లు!

అత్యవసర సమయంలో ఆదుకున్న వాళ్లే దేవుళ్లు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో దేవుడి ప్రతిరూపాలుగా నిలుస్తున్నది ఇద్దరే... వైద్య సిబ్బంది, పోలీసులు. ఇద్దర్లోనూ పోలీసుల పరిధి మరింత విస్తృతం. కష్టాల్లో చిక్కుకున్నామంటూ సమాచారం అందించిన మరుక్షణమే బాధితుల దగ్గరికి చేరుకుంటున్నారు. అవసరమైతే పోలీసు వాహనాల్లోనే దవాఖానలకు తరలిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. 100 వంటి హెల్ప్‌లైన్లూ, స్థానిక పోలీసు అధికారుల వాట్సప్‌ నంబర్లూ కష్టకాలంలో  అండగా నిలుస్తున్నాయి.  

తెల్లవారు జాము.2 గంటల సమయం.

కాలీఖబర్‌ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలైంది. బంధువులు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించారు. ఎంతకీ రాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో విషయాన్ని ఫోన్‌ ద్వారా మీర్‌చౌక్‌ పోలీసుల దృష్టికి తెచ్చారు. వెంటనే అప్రమత్తమైన పెట్రోకార్‌-2 సిబ్బంది ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆమె తమ్ముడు శశి మాట్లాడుతూ... ‘సార్‌, అత్యవసర పరిస్థితి... అందులోనూ అర్ధరాత్రి. ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు దేవుళ్లలా వచ్చి ఆదుకున్నారు. ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం పాప పుట్టింది. అక్క, పాప ఆరోగ్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది..మనకోసం ఇంత చేస్తున్న పోలీసులకు మన వంతుగా సహకరించాలి’ అంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. 

రేఖ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. హబ్సిగూడలో ఉంటారు. ఆమె భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్‌  అవసరం. ప్రాణావసర మందులు వాడుతున్నారు. దగ్గరలో ఉన్న మెడికల్‌ షాపుల్లో ఆ ఔషధాలు దొరకలేదు. పెద్ద దుకాణాలు ఇంటికి చాలాదూరం. రవాణా సౌకర్యం కూడా లేదు. ఆటోలూ క్యాబ్‌లూ బంద్‌. ఏం చేయాలో తోచలేదు రేఖకు. మెసేజీ రూపంలో తన సమస్యను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌  దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ఆ ఉన్నతాధికారి ... రాచకొండ ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ మనోహర్‌ను అప్రమత్తం చేశారు. ఆయన సూచన మేరకు ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసులు పదిహేను నిమిషాల్లోనే రేఖ ఇంటికి చేరుకున్నారు.  పోలీస్‌ వాహనంలో రేఖను  తీసుకెళ్లి, అవసరం అయిన మందులు ఇప్పించి, సురక్షితంగా తిరిగి ఇంటి వద్ద వదిలిపెట్టారు. ‘నా భర్తకు రోజూ డయాలసిస్‌ చేయాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ప్రతి నెలా అవసరమైన మందులను సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క బాక్స్‌ 15 కిలోలు ఉంటుంది. ఇలా... 20 డబ్బాలు తెచ్చుకోవాలి.  సాధారణంగా అయితే క్యాబ్‌లో వెళ్లి తెచ్చుకుంటాను. లాక్‌డౌన్‌ ఉండటంతో క్యాబ్‌లు లేవు.. తెలిసిన వాళ్ల సాయం అడిగినా, ఎవరూ ముందుకు రాలేదు. ఏదో ఓ అబద్ధం చెప్పి తప్పించుకున్నారు.  పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేస్తారన్న భయం. నిజమే, ఎవరి ఆలోచనలు వారివి. కానీ నన్నెవరు ఆదుకుంటారు? ఆపత్కాలంలో పోలీసులు సాయం చేశారు. తెలంగాణ పోలీసు శాఖకు ఎంతో రుణపడి ఉంటాను..’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు రేఖ.  

మందులేని మాయరోగం...ఎయిడ్సో, క్యాన్సరో కాదు.ఆకలి. దరిద్రుడి ఆకలి!అందులోనూ... దుకాణాలూ కార్ఖానాలూ మూసుకుపోయిన పరిస్థితుల్లో కష్టాన్నే నమ్ముకుని బతికే పేదలకు పిడికెడు మెతుకులు దొరకడం కూడా గగనమైపోయింది. ఈ పరిస్థితుల్లో కొందరు దాతలు మేమున్నామంటూ ముందుకొస్తున్నా... అన్నార్తుల సమాచారం తెలుసుకోవడం కష్టం అవుతున్నది. దీంతో వండిన అన్నమంతా వృథాగా పోతున్నది. అవసరమైన వాళ్లకు అందడం లేదు. కర్ఫ్యూ వాతావరణంలో ఆహార పదార్థాల రవాణా కూడా పెద్ద సమస్యే. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి డీజీపీ ఆఫీసులో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 9490617523 నంబరుతో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. అన్న దాతలకూ అన్నార్తులకూ ఇదో వేదిక. దీనివల్ల ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుతుంది. సాయం చేసినవారికి సంతృప్తి దక్కుతుంది.

‘నా పేరు జయరాజ్‌. 

బేగంపేటలోని శ్యామ్‌లాల్‌ ప్రాంతంలో ఉంటాను. ప్రైవేటు ఉద్యోగిని. అకస్మాత్తుగా చాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. స్నేహితులు అంబులెన్స్‌కు కాల్‌ చేశారు. వాహనాలు అందుబాటులో లేవనీ, రావడానికి కనీసం అరగంట పడుతుందని చెప్పారు. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. ఐదు నిమిషాల్లోనే పోలీసు జీపు మా ఇంటి ముందు ఆగింది. వాళ్లే నన్ను పసిబిడ్డలా చేతుల్లో ఎత్తుకుని కారు వరకు తీసుకెళ్లారు.  కిమ్స్‌లో చేర్పించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కోలుకోగలిగాను. కష్టకాలంలో నన్ను బతికించిన తెలంగాణ పోలీసులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’... అని చెబుతున్నప్పుడు జయరాజ్‌ కళ్లలో ఎనలేని కృతజ్ఞతా భావం.  

‘సార్‌! మా కాలనీలో ఒకరు ఈమధ్యే ఢిల్లీకి వెళ్లొచ్చారు’‘ఫారిన్‌ నుంచి వచ్చినా తప్పించుకుని తిరుగుతున్నాడు మా బంధువుల పిల్లగాడు. మాకు భయంగా ఉంది’‘మా కాలనీ నిండా చెత్త. అసలే వాతావరణం బాగాలేదు’... ఒకటి కాదు, రెండు కాదు, రోజూ వేలకొద్దీ ఫోన్‌కాల్స్‌. సలహాలూ సూచనలూ ఫిర్యాదులూ, కీలక సమాచారాలూ... ప్రతిదాన్నీ అతిముఖ్యమైన కాల్‌గానే భావిస్తారు  హెల్ప్‌లైన్‌ సిబ్బంది.  100కు మూడు రోజుల్లోనే ఆరున్నర లక్షల కాల్స్‌ వెల్లువెత్తినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ మధ్య ప్రకటించారు. పోలీసు వ్యవస్థ మీదా, ప్రభుత్వం మీదా ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదో నిదర్శనం. ఆ  మూడు అంకెలు... సామాన్యుడికి నాలుగు దిక్కులు అవుతున్నాయి. ఒక్కఫోన్‌కాల్‌ నిండు జీవితానికి భరోసా ఇస్తున్నది.హెల్ప్‌లైన్‌..లైఫ్‌లైన్‌గా మారుతున్నది.

-నాగోజు సత్యనారాయణ 


logo