మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Apr 02, 2020 , 23:08:42

అంతార్జాలంలో...

అంతార్జాలంలో...

కరోనా తాకిడికి యావత్‌ ప్రపంచం బందీ అయిపోయింది. విచిత్రమైన పరిస్థితుల్లో సుదీర్ఘ సెలవులు వచ్చాయి. బయటకు వెళ్లడానికి లేదు. విందులు, వినోదాలు, విహారాలు అన్నీ బంద్‌. అందరూ ఇంట్లోనే.. అన్నీ ఇంట్లోనే. ఈ సమయంలో పిల్లలకూ.. పెద్దలకూ.. అన్నింటికీ ఆసరాగా నిలుస్తున్నది అంతర్జాలం. విద్య అయినా.. వైద్యమైనా.. వినోదమైనా.. విహారమైనా... ఇంటర్నెట్‌లోనే. హాస్పిటల్‌కు వెళ్లలేనివారికి ఆన్‌లైన్‌ ద్వారానే వైద్యసేవలు లభిస్తున్నాయి.  విద్యా సంవత్సరం కోల్పోకుండా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు మొదలయ్యాయి. పోటీ పరీక్షల కోచింగ్‌ సైతం ఇంటర్నెట్‌ ద్వారానే. ఆటపాటలకు, వంటింటి రుచులకు కూడా...అంతర్జాలమే దిక్కు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా సెలవులను ఇంటర్నెట్‌ శాసిస్తున్నది. 

విద్య, వైద్యం, వినోదం, వ్యాయామం... ఒకటేమిటి?! ఆన్‌లైన్‌కు కాదేదీ అనర్హమన్నట్లుగా... కరోనా విసిరిన ‘వల’తో ఇప్పుడు ప్రపంచమే ఇంటర్నెట్‌లో చిక్కుకుపోయింది. ఏ పనికైనా ‘ఆన్‌లైన్‌' ఒక్కటే శరణ్యమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని రంగాలూ స్తంభించిపోయాయి. దీంతో మార్కెటింగ్‌కు ఆన్‌లైన్‌ అస్త్రంగా మారింది. ఇ-సేవలకు డిమాండ్‌ పెరిగింది. మారుమూల పల్లెల్లోనూ ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండటంతో... అష్టదిగ్బంధ సమయంలోనూ అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం చాలా సులువైంది. వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంస్థలు ప్రత్యేక యాప్‌లతో వినియోగదారులకు మరింత  చేరువవుతున్నాయి. 

ఇ-కచేరీలు...

వివిధ ప్రైవేటు దవాఖానలు ప్రత్యేక యాప్‌లతో ఉచితంగా ఆన్‌లైన్‌లోనే వైద్యుడిని సంప్రదించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. విద్య, వినోదం వంటి వాటిని కూడా అనేక సంస్థలు ప్రస్తుతానికి ఉచితమనో, ఒక రూపాయి చెల్లిస్తే చాలనో నామమాత్రపు ధరకే సేవలు మొదలుపెట్టాయి. ఇదంతా మార్కెటింగ్‌ టెక్నిక్‌లో భాగమే కావచ్చు. ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. వ్యాయామ కోచ్‌లు, యోగా గురువులు  ప్రత్యేక యాప్‌లు రూపొందించుకున్నారు. పదిమంది చొప్పున ఒక బ్యాచ్‌గా... ఆయా సమయాల్లో ఆన్‌లైన్‌లోనే యోగా, వ్యాయామ పాఠాలు చెప్తున్నారు. ముంబైలోని ఒక సాంస్కృతిక సంస్థ సంగీత, నృత్య ప్రదర్శనలను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. షో వివరాల్ని ముందుగానే ప్రకటిస్తారు. బుక్‌ చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఐడీలు ఇస్తారు. సమయానికి లాగిన్‌ అయిపోయి... ప్రదర్శనల్ని ఆస్వాదించవచ్చు.

వేడుకలకూ ...

పుట్టినరోజు వేడుకలు, కిట్టీ పార్టీల వంటివి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో వివాహాల వంటివి వాయిదా వేసుకోవడం సహజం. కానీ ఈ చిన్నపాటి వేడుకలను రద్దు చేసుకోవడం ఎందుకని... ఆన్‌లైన్‌లోకి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఇటు పక్క కేక్‌ కట్‌చేయగానే& అటుపక్క ఆన్‌లైన్‌లో ఉన్న వారంతా ‘హ్యాపీబర్త్‌డే’ అంటూ కేరింతలు కొడుతున్నారు. ఇక కిట్టీ పార్టీల్లో మహిళలంతా ఆన్‌లైన్‌లోకి వచ్చి ముచ్చట్లు చెప్పుకోవడమే కాదు, అంత్యాక్షరితో హాయిగా కాలం గడుపుతున్నారు. 

ఆన్‌లైన్‌లో పాఠాలు...

పదోతరగతి, ఇంటర్‌, వివిధ పోటీపరీక్షలకు సంబంధించిన కోచింగ్‌లు.. లాక్‌డౌన్‌లోనూ యథావిధిగా కొనసాగుతున్నాయి. విద్యార్థి ఇంట్లోనే కూర్చుని జూమ్‌ లైవ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. వ్యక్తిగత ఐడీ నంబర్లు కేటాయిస్తున్నందున సంబంధిత విద్యార్థులే లాగిన్‌ అవుతున్నారు. ముందుగా జూమ్‌ యాప్‌ను ప్లేస్టోర్‌/యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో జాయిన్‌ మీటింగ్‌పై క్లిక్‌ చేసి కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఐడీ నంబరుతో లాగిన్‌ కావాలి. తరగతి గదిలో మాదిరిగానే లెక్చరర్‌ బోధన ప్రారంభిస్తారు. ఒకేసారి 300-400 మంది విద్యార్థులకు  తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం బోధన మాత్రమే కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ మరింత పొడిగిస్తే ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ కోసం కూడా కొన్ని కాలేజీలు కసరత్తు చేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకైతే గణితం, సైన్స్‌, ఇంగ్లిషు.. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు గణితం, జీవ-జంతు శాస్ర్తాలతోపాటు రసాయన, భౌతికశాస్ర్తాలు బోధిస్తున్నారు. 

వైద్యసేవలు కూడా...

లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. అనేక దవాఖానలు ప్రత్యేక యాప్‌లు, టోల్‌ఫ్రీ నెంబర్లు రూపొందించుకొన్నాయి. అపోలో దవాఖాన http//nmc.sg/cSDvR4 టెలీ మెడిసిన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే 24 గంటల పాటు ఆన్‌లైన్‌ వైద్య సేవలు పొందవచ్చు. రోగి అవసరానికి అనుగుణంగా సలహాలు ఇస్తారు. లేదంటే, ముందస్తు అపాయింట్‌మెంట్‌ ద్వారా వైద్యుడు వీడియోకాల్‌లో అందుబాటులోకి వస్తారు. కిమ్స్‌ దవాఖానకు చెందిన 040-44885000 నంబర్‌కు  ఫోన్‌చేసి రోగులు తమ వివరాలిస్తే ఆన్‌లైన్‌లోనే సంబంధిత నిపుణులు వైద్య సలహాలిస్తారు. ఇందుకు రుసుము వసూలు చేస్తారు. 

యశోద దవాఖానలో.. 040-45674567 నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా కానీ www.yashodahospitals. com వెబ్‌సైట్‌ ద్వారా కానీ రోగులు తాము కోరుకున్న వైద్యుడి సేవల్ని పొందే అవకాశమున్నది. వైద్య సంప్రదింపులకు రుసుము ఉంటుంది. సన్‌షైన్‌ దవాఖానలో అయితే, 040-44550000 నంబర్‌కు ఫోన్‌చేసి అన్ని వివరాలిస్తే మన మొబైల్‌కు ఎం-ఫిన్‌ అనే హెల్ప్‌లైన్‌ లింకును పంపుతారు. దాన్ని క్లిక్‌ చేస్తే వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఈ సేవల్ని ఉచితంగా అందిస్తున్నామని హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి. ‘ఈ సమయంలో ఆన్‌లైన్‌ వైద్యసేవలు అందుబాటులోకి రావడం మంచి పరిణామం. వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యమైతే ఏమవుతుందోనని ఆందోళన పడిపోయే రోగులకు ఈ సేవల ద్వారా భరోసా లభిస్తుంది. విద్య, సాంస్కృతిక రంగాలనూ ఇవి ప్రభావితం చేయడం మంచి పరిణామమే’ అంటారు హైదరాబాద్‌లోని హస్తినాపురానికి చెందిన కోట్ల వేణుగోపాల్‌. కొసమెరుపు ఏమిటంటే... బాలీవుడ్‌ భామ మాధురీదీక్షిత్‌ కూడా  ఆన్‌లైన్‌లో డాన్స్‌ క్లాసులు ప్రారంభిస్తున్నారు. ఆసక్తి ఉంటే మీరూ చేరవచ్చు.

ఎన్నో మార్గాలు...
స్కైప్‌

ఎమ్‌ఎన్‌సీలలో పనిచేసేవారికి ఈ యాప్‌ సుపరిచితమే. ఫోన్‌, ల్యాప్‌టాప్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకేసారి 50మందికి వీడియో, ఆడియో కాల్స్‌ చేయొచ్చు.

గూగుల్‌ డ్యుయో

ఈ వీడియో కాలింగ్‌ సేవలు వినియోగించడానికి  ఫోన్‌ నంబరు ఉంటే చాలు. ఈ యాప్‌ని ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకేసారి పన్నెండు మందితో గ్రూప్‌ వీడియోకాల్స్‌ చేసుకోవచ్చు. పెద్ద కుటుంబాలకు, చిన్న ఆఫీసు మీటింగ్‌లకూ బాగా పనిచేస్తుంది.

గూగుల్‌ హ్యాంగవుట్స్‌

ఫోన్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌.. ఎక్కడైనా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాల్సిందల్లా జీ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌. అవతలివారికి కూడా జీమెయిల్‌ అకౌంట్‌ ఉండాలి. ఒకేసారి కనీసం పదిమందితో  వీడియోకాల్‌లో 

మాట్లాడొచ్చు.

ఫేస్‌టైమ్‌

ఆపిల్‌ ఫోన్‌ వాడేవాళ్లకి మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్‌ 12 విడుదల కాకముందు వరకు, ఒకరితోనే మాట్లాడుకొనే అవకాశం ఉండేది.  ఈ ఉచిత యాప్‌ ద్వారా ఇప్పుడు 32మందితో వీడియో కాల్‌లో 

కనెక్ట్‌ కావచ్చు.

టాకీ

ఈ యాప్‌ కోసం ప్రత్యేకించి సైన్‌అప్‌ అవ్వాల్సిన పన్లేదు. హోమ్‌ పేజీలో ఎంటరయితే చాలు. ఆడియో, వీడియో కాల్‌ సెట్టింగ్స్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బ్రౌజ్‌ బేస్డ్‌ చాట్‌. సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదు. దీని ద్వారా 15మందితో మాట్లాడొచ్చు. 


logo