బుధవారం 03 జూన్ 2020
Zindagi - Mar 31, 2020 , 22:17:27

ఫ్యామిలీ ‘ప్లానింగ్‌' కావాలిప్పుడు...

ఫ్యామిలీ ‘ప్లానింగ్‌' కావాలిప్పుడు...

ప్రేమలో ఉన్నప్పుడు అతడికి, ఆమెకు మధ్య గంటలు క్షణాల్లా, రోజులు నిమిషాల్లా దొర్లిపోతాయి. వారి ముచ్చట్ల ధాటికి నిజానికి కాలం కరిగిపోతుంది. ఒకరికోసం మరొకరు సమయం వెచ్చించాలని తహతహలాడతారు.  పెళ్లయి కొన్నాళ్ళయ్యాక...పరిస్థితి చాలా వరకు మారుతుంది. పరిణయానంతరం కూడా ప్రణయకాలపు మధురత్వాన్ని ఘడియ ఘడియకూ పునరావృతం చేసి వైవాహిక జీవితంలో సైతం ఆనందాన్ని అనునిత్యం జుర్రుకునే బుద్ధిజీవులు, అదృష్టవంతులు ఉన్నా...భార్యాభర్తలు కొంతకాలం పాటు రోజంతా  ఒకరి ముఖం మరొకరు చూస్తూ ఇంట్లోనే కూర్చోవాలంటే అంత సులువైన విషయం కాదు.  

- డాక్టర్‌ సూరావఝుల రాము


ఫర్‌ ఎ చేంజ్‌...బ్రహ్మచారిగా ఉన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుని భార్యకు, పిల్లలకు వండిపెడితే సరి. ఇదంతా... భార్య ఒత్తిడి మీద చేయకూడదు. స్వచ్ఛందంగా... ముందురోజు ప్రకటించి వండాలి. అదీ ప్రేమతో చేయాలి.

అమెరికాలో ఆరు వేలకుపైగా జంటలు పాల్గొన్న ఒక సర్వే ప్రకారం-జీవిత భాగస్వామితో తక్కువ సమయం గడపడం వారి సంసార జీవనంపై ప్రభావం చూపుతుందని తేలింది. అయితే, కానరాని ఏదో ఉపద్రవం కొంపముంచబోతున్నదన్న భయం, తల్లిదండ్రుల ఆరోగ్యాలపై బెంగ, కుటుంబ సభ్యుల క్షేమం కోసం తపన, జరగరానిది జరిగితే వారి భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న, గడప దాటవద్దన్న సర్కారు లక్ష్మణరేఖ, పాలు-సరుకులు-కూరలు-పళ్ళు సమృద్ధిగా సమకూర్చాలన్న బాధ్యత, ఉద్యోగపరమైన ఒత్తిడి, ఇంట్లో కూడా  ‘సోషల్‌ డిస్టెన్స్‌' అనే నిబంధన... వీటన్నింటి వల్ల కుటుంబ యజమాని/యజమానురాలు కుదేలు కాకమానరు. 

రోజుల తరబడి భార్యాభర్తలు ఇంట్లోనే గడిపితే వచ్చే సమస్యలు మామూలుగా ఉండవని చైనా అనుభవం నేర్పింది. కొవిడ్‌ కారణంగా కొన్నిరోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన ఆలూమగలు, చిన్న చిన్న విషయాలకు తగువులాడుకుని, మనస్పర్థలు పెంచుకుని తెగతెంపులదాకా వెళ్లారట. చైనాలో స్వీయ గృహనిర్బంధం తర్వాత విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు ప్రకటించారు. కలిసి ఉంటే కలదు సుఖం...అంటారు గానీ  మరీ ఎక్కువగా కలిసివుంటే జీవితం అంత వీజీగా ఉండదని వారం పదిరోజుల నుంచి ఇళ్లకే పరిమితమైన జంటలకు బోధపడి ఉండవచ్చు. సామాజిక మాధ్యమాల్లో దీని మీద కుళ్ళు జోకులు పేలుతున్నాయి. ‘ఇప్పుడే ఇట్లుంది... ఏప్రిల్‌ 15 దాకా బండెట్లా లాగించాల్రా...’ అని లోలోపల కుములుతున్న వాళ్ళూ లేకపోలేదట. ఇట్లాంటప్పుడు భార్య తప్పా, భర్త తప్పా అన్న సంగతి జోలికి పోకుండా...ఫుల్లుగా కలిసున్న రోజుల్లో మస్తు ఖుషీ గా ఉండటానికి అవసరమైన మందు ఒకటుంది. అదే...ఫ్యామిలీ ప్లానింగ్‌. అంటే ఆలుమగలు ఒక పథకం ప్రకారం జీవన యానాన్ని సుఖమయం చేసుకోవడం. అదెలాగంటే... 

 పరస్పర గౌరవభావం

 ఈ సంక్లిష్ట సమయంలో భార్యాభర్తలిద్దరూ ఎవరి ఒత్తిడిలో వారుంటారు. ఈ ఒత్తిడి మాట పట్టింపునకు, అది అలకకు, అది గొడవకు, అది కాస్తా ఘర్షణకు దారితీసి కొంపకొల్లేరయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అందుకే.. మనమీరోజు ఏం చేద్దాం... అన్న ప్లాన్‌ అవసరం. దాని ప్రకారం ఇద్దరూ చేసుకుంటూ పోతే సమస్యే లేదు. ఈ క్రమంలో... ఆఫీసులో బాగా కష్టపడే తాను...  ఇది సేదతీరే సమయమని పురుషులు అస్సలు భావించకూడదు, సహజసిద్ధపు ఆధిపత్యం కనపర్చకూడదు. అదే సమయంలో... ఇన్నాళ్లూ వండాను.. ఇప్పుడు తమరు ఖాళీయేగా... వండొచ్చుగా... అని భార్యా నిష్ఠూరమాడి రాద్ధాంతం చేయకూడదు. పరస్పరం మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. 

భర్తకు భలే అవకాశం

మన సమాజంలో ఉద్యోగా లు చేసే మహిళలు సైతం ఇంటి వంటావార్పు చూసుకుని, భర్తకు బాక్స్‌ ఇచ్చి... ఆఫీసుకు పోతారు. కాబట్టి, ఈ విరామ సమయాన్ని నిస్సందేహంగా భర్తలే చొరవ చూపి సద్వినియోగం చేసుకోవాలి. ఫర్‌ ఎ చేం జ్‌...బ్రహ్మచారిగా ఉన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుని భార్యకు, పిల్లలకు వండిపెడితే సరి. ఇదంతా... భార్య ఒత్తిడి మీద చేయకూడదు. స్వచ్ఛందంగా... ముందురోజు ప్రకటించి వండాలి. అదీ ప్రేమతో చేయాలి. అప్పుడు చూడండి... భార్యా పిల్లలు మీకు ఎంత గౌరవం ఇస్తారో! అలాగే... ఆమె చెప్పకుండానే ఇల్లు సర్దడం, బట్టలు మడత పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వం టివి మరింత తృప్తినిస్తాయి. కోవిడ్‌ భయంతో పనిపనుషు లు రావడం లేదు. ఈ సమయంలో గిన్నెలు తోమ డంలో తనకు స్వచ్ఛందంగా సహకరించడ మూ మంచిదే.. 

పాత విషయాలు తోడద్దు

మనిషికి ఉన్న పెద్ద జాడ్యం... ఒక తప్పు జరిగితే ఎదుటి వ్యక్తిని కార్నర్‌ చేసేందుకు... ఎప్పటివో పాత విషయాలు తోడటం. ఇది తరచూ భార్యాభర్తలు చేసే పెద్ద తప్పు. ఎప్పటి విషయాలో తిరగతోడి తిట్టడం ఒక చీప్‌ ఎత్తుగడ, మనుషులు చేయాల్సిన పనికాదు. ఇన్నిన్ని గంటలు మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవు కాబట్టి సహజంగానే మనసు ఆమె లేదా ఆయన గతంలో చేసిన తప్పుల మీదకు పోతుంది. అత్తింటి వారు ఎప్పుడో పెట్టని చీర గురించి ఆమె, చేయని మర్యాద గురించి ఆయన ఇప్పుడు తోడుకోవడం మూర్ఖత్వం. ప్రయత్నపూర్వకంగా ఈ రోగాన్ని నిరోధించండి. కొవిడ్‌గాడు ఖతం అయ్యే వరకూ పాత విషయాలు మరిచిపోండి. ఆ రోజు విషయాల మీదే దృష్టి పెట్టండి. 


టీవీ, ఫోన్‌ వాడకం

భార్యాభర్తలిద్దరూ ఇంట్లో ఉంటే టీవీలో ఏ చానల్‌ చూడాలన్న సమస్య వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి ఆలూమగల కామన్‌ ఫైటింగ్‌ పాయింట్‌. ఈ పోటీ మధ్యన రిమోటో, చివరకు టీవీనో కోపానికి బలై బద్దలవుతుంది. ఇంట్లో  మానసిక ప్రశాంతత కావాలంటే టీవీ విషయంలో పట్టువిడుపులు ముఖ్యం. ఎలాగూ... మొబైల్‌ ఫోన్‌ ఉంది కాబట్టి, దీన్ని ఒక సమస్యగా చూడకుండా ఆమెకు అవకాశం ఇస్తే సరి. అలాగే... ఫోన్‌లలో పిల్లలు ఆడుకోకుండా ఉండలేరు. ఇప్పుడు కంప్యూటర్‌ గేమ్స్‌తో పిల్లలు కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. దాన్ని సీరియస్‌గా తీసుకుని పిల్లలను దండించకండి... ప్రస్తుతానికి. రోజు గడవటానికి భార్యాభర్తలు ఆటలు, పాటలను సాధనంగా చేసుకోవచ్చు. 

మూడో మనిషి ముందు  వద్దు

భార్యాభర్తలన్నాక సమస్యను బట్టి నాలుగు మాటలనుకుని మర్నాడు సర్దుకుంటారు. అసలు సమస్య.. . మూడో మనిషి ప్రమేయం. ఇంట్లో అత్తమామలు, పిల్లల ముందు భాగస్వామిపై నోరు జారకండి. అదొక పెద్ద రూల్‌గా పెట్టుకోండి. అత్త అన్నందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు సమస్య వస్తుంది. వేరే వాళ్ళ ముందు జరిగే వాదులాటల వల్ల అహం దెబ్బతింటుంది. గోటితో పోయేది గొడ్డలి దాకా పోతుంది. చాలా చిన్న విషయం మహా పెద్దదవుతుంది. అగ్గికి ఆజ్యం పోసే దుర్గుణం ఉన్న కుటుంబ సభ్యుల ముందు ఇంకా జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు తిట్టుకుంటే...చాలా అసహ్యంగా ఉంటుంది.   అర్థం చేసుకోండి. 

తప్పులు వెతకొద్దు

ఒక మనిషితోనో, కొందరు మనుషులతోనో కొన్ని రోజులు సన్నిహితంగా ఉంటే వారిలో తప్పులు ఒకటొక్కటి కనిపించి, క్రమంగా పెద్దవిగా అనిపిస్తాయి. మనం తప్పులు ఏమాత్రం చేయనివారిలా... సుద్ధపూసల్లా... మాట్లాడి భాగస్వామిని విసిగిస్తాం. ఇది ప్రశాంతతను నాశనం చేస్తుంది. ముఖ్యంగా మగవారే ఈ విషయంలో దారుణంగా ప్రవర్తిస్తారు. భార్యను కుమ్మాలంటే.... ఇల్లు నీట్‌ గా ఉంచడంలేదన్న ఒక్క సాకుతో ఎన్నేసి మాటలైనా అంటారు. అలా అనే బదులు... మీరే సర్ది సవరించి చూపించడానికి ఇది మహత్తర అవకాశం. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు!  


ఈ విరామ సమయంలో ఇళ్లలో వివాదాలు రాకుండా చూసుకోవడం ఇద్దరి బాధ్యత. చైనా వాళ్ళ లాగా తెగే దాకా లాగి సంసారం గుల్ల చేసుకోకుండా భార్యాభర్తలు ఈ గడ్డుకాలాన్ని సమన్వయంతో సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ వివాహ వ్యవస్థ పటిష్ఠతను యావత్‌ ప్రపంచానికి చాటాలి. 

 ఎంతలేదన్నా.... గృహమే కదా స్వర్గసీమ!


logo