శనివారం 30 మే 2020
Zindagi - Mar 31, 2020 , 22:12:21

ప్రేమగా చూసుకోండి..

 ప్రేమగా చూసుకోండి..

కరోనా వైరస్‌ పెంపుడు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందనే అనుమానం జంతు ప్రేమికులను కలవరపెడుతున్నది. కానీ ఆ విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. కుక్కలు, పిల్లుల ద్వారా కరోనా వ్యాప్తి చెందినట్టు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది.  ‘వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌' ప్రకారం... అమెరికాకు చెందిన  రోగ నిరోధక, నియంత్రణా కేంద్రం పెంపుడు జంతువుల నుంచి కొవిడ్‌ -19 మనుషులకు ఎలా సంక్రమిస్తుందనే దానిపై పరిశోధన చేసింది. లోతైన అధ్యయనం తర్వాత, పెంపుడు జంతువులు ఈ వైరస్‌ను వ్యాప్తి చేయడం లేదని నిర్ధారించింది కూడా. దీంతో పాటు, హాంకాంగ్‌ జంతు-సంక్షేమ ఆథారిటీ... పెంపుడు జంతువుల యజమానులకు కొన్ని సూచనలు చేసింది. మూగజీవుల విషయంలో కూడా పరిశుభ్రత  పాటించాలని గుర్తు చేసింది. వాటిని ముద్దు పెట్టుకోకుండా ఉండటం మంచిదని సూచించింది. భయాలతోనో, అపోహలతోనో ఎట్టి పరిస్థితుల్లోనూ యజమానులు  పెంపుడు జంతువులను వీధిపాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

భయం వద్దు

పెంపుడు జంతువుల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఇప్పటి వరకూ నిరూపితం కాలేదు.  కానీ చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. తమ కుక్కలను, పిల్లులను తీసుకెళ్లాలని కోరుతున్నారు. మరి కొందరు వీధుల్లో విడిచిపెడుతున్నారని  కూడా తెలిసింది. కానీ ఇలా చేయడం సరికాదు. పెంపుడు జంతువుల ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు.  వాటి పట్ల దయతో వ్యవహరించాలని ప్రజలను కోరుతున్నాం.  ఇలాంటి భయాందోళన విషయంలో ప్రభుత్వం తరఫున సరైన సూచనలు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరాం. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. 

-ప్రవళిక ఫౌండర్‌, కాంపాసినేట్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ , హైదరాబాద్‌


logo