శనివారం 30 మే 2020
Zindagi - Mar 29, 2020 , 22:08:24

స్వచ్ఛంద సైన్యం

స్వచ్ఛంద సైన్యం

ఒకరిది మాట సాయం. ఒకరిది వైద్య సహకారం. ఒకరిది అన్నదానం. ఒకరిది రక్తదానం. కరోనా సంక్షోభ సమయంలో తమ వంతుగా సమాజానికి సాయం అందిస్తున్న స్వచ్ఛంద సేవకులు ఎంతోమంది. నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన సమయంలోనూ నలుదిక్కుల్లోని దిక్కులేనివారి గురించీ, వృద్ధుల గురించీ, అనారోగ్య పీడితుల గురించీ ఆలోచిస్తున్న ఆ సంస్కారవంతులకు నమస్కారాలతో..

బంజారాహిల్స్‌.

జీవీకే మాల్‌ దగ్గర.ఆ ఖరీదైన ప్రాంతం... దివాలా తీసిన కుబేరుడిలా వెలవెల బోతున్నది. చౌరస్తాలో ఓ పోలీసు పొద్దుటి నుంచీ విధుల్లో ఉన్నాడు. తాజ్‌ బంజారా వైపు నుంచి ఓ మహిళ స్పోర్ట్స్‌ సైకిల్‌ మీద వచ్చింది. ఆమె వెనకాలే డొక్కు సైకిలు మీద ఓ గార్డు. చేతిలో ఏవో పట్టుకొని వస్తున్నాడు.  విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ దగ్గరకు వెళ్లింది ఆమె. గార్డు చేతిలోని సంచి కానిస్టేబుల్‌కు అందించింది. అందులో.. వేడివేడి ఇడ్లీలు, చట్నీ,  వాటర్‌ బాటిల్‌, చిన్నపాటి శానిటైజర్‌, టిష్యు పేపర్లు ఉన్నాయి. పరిసరాల్లో ఉంటున్న సంపన్న కుటుంబీకురాలు ఆమె. ఉదయం నుంచీ నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసును చూసి ఆ యువతి మనసు కదిలిపోయింది. ఇంట్లో నుంచి బ్రేక్‌ ఫాస్ట్‌ తెచ్చి ఇచ్చింది. అతను మన కోసం పనిచేస్తున్నప్పుడు, మనం అతని గురించి ఆలోచించకపోతే... మానవత్వానికి అర్థమేం ఉంటుంది? 

నిజానికి ఈ సంక్షోభ సమయంలో మనకు కావాల్సింది ఇలాంటి స్వచ్ఛంద సేవకులే. ఆకలితో ఉన్నవారికి భోజనం, భయంతో తల్లడిల్లుతున్నవారికి

ధైర్యం, సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్థిక భరోసా  సేవ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఆ మహత్కార్యం ఓ వ్యక్తిగా చేయవచ్చు, ఓ సంస్థగానూ పూనుకోవచ్చు.

 కనీస బాధ్యత..

ఒకరికి అసాధ్యం. ఇద్దరికి కష్టం. ముగ్గురు, నలుగురు, పదిమంది, వందమంది  చేతులు కలిపితే ఏదైనా సాధించగలం. ఆ సమష్ఠి శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంది కేరళ. కరోనా వైరస్‌ ఒక్కసారిగా ప్రబలిపోవడంతో... ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అక్కడ. మరోవైపు శానిటైజర్ల కొరత తీవ్రమైంది. దీంతో సర్కారు వాలంటీర్ల సాయం తీసుకుంది. విద్యార్థులను, యువజన సంఘాలను రంగంలోకి దించింది. చకచకా పనులు జరిగిపోయాయి. దీంతో ఉత్పత్తి పెరిగింది. ఒక్క రోజులోనే వేలకొద్దీ శానిటైజర్‌ సీసాలను ఆసుపత్రులకు అందించింది. మాస్కుల తయారీకి కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. అంతలోనే ఇంకో సమస్య? గృహనిర్బంధం కారణంగా నాలుగు గోడలకే పరిమితమైన పేదల ఆకలి దప్పులు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం దగ్గర వనరులున్నాయి. కానీ మనుషుల్లేరు. ఉన్నా సరిపోరు. మళ్లీ స్వచ్ఛంద సేవకులే రంగంలోకి దిగారు. 

మాట సాయం

చాలా సందర్భాల్లో చిన్న సమాచారమే ఓ పెద్ద ఉత్పాతాన్ని నివారించడంలో సాయపడుతుంది. ‘సర్‌... అమీర్‌పేటలోని ఫలానా కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మా ఎదురింట్లో ఓ అబ్బాయి ఈమధ్యే యూకే నుంచి వచ్చాడు. నాకు తెలిసినంత వరకూ తను ఎలాంటి వైద్య పరీక్షలూ చేయించుకోలేదు. పొద్దున్నే దగ్గుతూ తుమ్ముతూ కనిపించాడు. నాకెందుకో భయంగా ఉంది’  అంటూ ఓ సామాన్యుడు హెల్ప్‌లైన్‌కు ఇచ్చిన సమాచారం పోలీసులకు చాలా ఉపయోగపడింది. ‘ఫలానా చోట మందులు బ్లాక్‌లో అమ్ముతున్నారు, ‘ఫలానా గల్లీలో ఏదో ధావత్‌ జరుగుతున్నది. వందమంది గుమిగూడారు’   ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రతి సమాచారం విలువైందే. కరోనా అనేది పురాణాల్లోని రక్తబీజుడనే రాక్షసుడి లాంటిది. ఒక రక్తపుబొట్టులోంచి వేయిమంది రాక్షసులు పుట్టుకొచ్చినట్టు... ఒక కరోనా రోగి మరింతమందిని అనారోగ్యం పాలు చేస్తాడు. 

‘ఏం ఫర్వాలేదు. సమస్య తీవ్రమైందే. కానీ స్వీయ క్రమశిక్షణతో మనం దాన్ని అధిగమించగలం. టేక్‌ కేర్‌' తరహా ప్రకటనలు వాట్సాప్‌లో చాలానే కనిపిస్తుంటాయి. కొన్ని నిజంగానే మనలో ధైర్యం నింపుతాయి. కానీ, మామూలు వ్యక్తులతో పోలిస్తే... నిపుణుల భరోసా వందరెట్లు శక్తిమంతమైంది. ముఖ్యంగా, వైద్యుల మాటలకైతే మంత్రమంత బలం ఉంటుంది. కాబట్టే, కొందరు సామాజిక బాధ్యత కలిగిన వైద్యులు... కరోనాపై అపోహల్ని తొలగిస్తూ ఆడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. అమెరికాలో కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెబుతూ... అక్కడ క్రిటికల్‌ కేర్‌ నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ అనిల్‌ విడుదల చేసిన ఆడియో చాలా ఆదరణ పొందింది. ‘నేను  గత పదేండ్లుగా ఐసీయూలో పని చేస్తున్నాను. ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు మూడు వారాలు మీరు బయటకు వెళ్లొద్దు. బయట నుంచి ఎవరినీ రానివ్వవద్దు. దగ్గు వంటి అనారోగ్య లక్షణాలుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి’ అంటూ అందులో స్పష్టమైన సూచనలు చేశారు అనిల్‌. ఇలాంటి సమయాల్లో మంచిని విస్తరించడం ఎంత అవసరమో, చెడును కట్టడి చేయడం, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడం అంతే ప్రధానం. కర్ణాటక ప్రభుత్వం ఆ బాధ్యతను ‘కరోనా వారియర్స్‌'కు అప్పగించింది. రాష్ట్ర సమాచార శాఖ రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలిసి మూడువేలమంది కరోనా యోధుల్ని సిద్ధం చేసింది. హరియాణా ప్రభుత్వం కూడా ‘కరోనా సంఘర్ష్‌ సేనాని‘ పేరుతో ఇలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టింది. 

సంఘాలుగా..

‘నాకో హెల్ప్‌  చెయ్యాలి నువ్వు. తెలుసుగా, అమ్మానాన్నా బెంగళూరులో ఒంటరిగా ఉన్నారు. నేనేమో ఇక్కడ యూఎస్‌లో. నాన్నకి అనారోగ్యం. మందులు అయిపోయాయి. బయటికి వెళ్లి తెచ్చుకోవడానికేమో ఇబ్బంది. ఇంతకు ముందు అయితే ఇరుగూ పొరుగూ సాయం చేసేవాళ్లు. ఇప్పుడు కాలింగ్‌బెల్‌ కొట్టినా తలుపు తీయడం లేదు. నువ్వే ఏదైనా చేయాలి’ అని ఓ ఫ్రెండ్‌ చేసిన అభ్యర్థన డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణురాలు మహితా నాగరాజ్‌ను ఆలోచింపజేసింది. అంతే, రాత్రికిరాత్రే.. కేర్‌మాంగర్స్‌ ఇండియా ప్రాణం పోసుకుంది. దాదాపు ఐదువేలమంది స్వచ్ఛంద సేవకులు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. వయోధికులు, ఏడాదిలోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్య పీడితులు.. తమకు ఏ అవసరం వచ్చినా ఈ బృందాన్ని సంప్రదించవచ్చు. అన్నివేళలా బయటికి రావడానికి  బెంగళూరు పోలీసులు వీరికి అనుమతి కూడా ఇచ్చారు. జొమాటో ఫీడింగ్‌, గూంజ్‌, మిలాప్‌, ఉదయ్‌ ఫౌండేషన్‌ తదితర సంస్థలు దేశ వ్యాప్తంగా.. మహానగరాల్లోని వలస కూలీల కడుపు నింపడానికి క్రౌడ్‌ ఫండింగ్‌ మార్గంలో నిధులు సేకరిస్తున్నాయి. యూఎన్వీ ఇండియా ఆధ్వర్యంలోని వీ-ఫోర్స్‌ కూడా కొవిడ్‌కు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వాలంటీర్లకు వేదికగా నిలుస్తున్నది.

ఇన్ని వేదికలు ఉన్నాయి. మనమూ ఏదో ఓ సంస్థతో కలిసి నడువవచ్చు. నేరుగా సేవ చేయడం ఒక మార్గం. సేవ చేస్తున్నవారికి సాయం అందించడం మరో మార్గం. ఏదో ఒకటి, ఎంతో కొంత.. సంక్షోభ సమయంలో అదే కొండంత!

సౌదీ అరేబియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులకు సెలవులు ప్రకటించాయి కంపెనీలు. ప్రస్తుతం వాళ్లు గదులకే పరిమితం అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ స్వచ్ఛంద సేవను అందిస్తున్న తెలంగాణకు చెందిన హెల్త్‌ కేర్‌ వర్కర్‌ విక్రమ్‌ తన అనుభవాలను ‘జిందగీ’తో పంచుకున్నారు. ‘రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో నేను పని చేస్తున్నాను. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దాదాపూ అన్ని షాపింగ్‌మాల్స్‌ను మూసేశారు. కొన్ని ఎమర్జెన్సీ విభాగాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ స్టాఫ్‌కు పర్మిట్‌ లెటర్లను జారీ చేసింది. నాకూ పర్మిట్‌ లెటర్‌ ఉంది. దీంతో, ఇక్కడున్న తెలంగాణ ప్రజల్లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా నేను వెళ్తాను. నావంతు సహకారం అందిస్తున్నాను. కరోనా కావచ్చన్న అనుమానం వస్తే పరీక్షల కోసం ఆసుపత్రుల్లో చేరుస్తున్నాను’ అంటారు జగిత్యాల జిల్లా వాసి విక్రమ్‌ పొలాస. 


మనం ఏం చేయవచ్చు..

  • పెంపుడు జంతువులు వీధుల్లో కనిపిస్తే చేరదీసి, వాటికి ఆహారం పెట్టవచ్చు.
  • అవసరమైన వారికి మందులు తెచ్చి ఇవ్వొచ్చు.
  • స్థానికంగా ఫుడ్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేయవచ్చు. లేదా ఫుడ్‌ బ్యాంక్‌కు భోజనం అందించవచ్చు.
  • ఈ ఆపత్కాలంలో రక్తదానం చాలా అవసరం. రెడ్‌ క్రాస్‌ సంస్థ అదే అభ్యర్థిస్తున్నది. రక్తాన్ని, ప్లేట్‌లెట్లను దానం చేయమని కోరుతున్నది.
  • నిరాశ్రయులైన వారికి సాయం చేయవచ్చు.
  • అత్యవసర విభాగాల సిబ్బందికి భోజనం అందించవచ్చు.
  • క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా కరోనాపై పోరాడుతున్న సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు.
  • దృష్టికి వచ్చిన ఫేక్‌న్యూస్‌ను ఖండించవచ్చు.
  • ఒంటరితనంతోనో, అనారోగ్య భయంతోనో ఆందోళన పడుతున్న ఆత్మీయులకు ఫోన్‌లో ధైర్యం చెప్పవచ్చు. 

-వినో..


logo