బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Mar 28, 2020 , 22:13:19

మలేరియా ఉన్న దేశాలను కరోనా ఏం చేయలేదా?

మలేరియా ఉన్న దేశాలను కరోనా ఏం చేయలేదా?

ఇండియా, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌ లాంటి ఉష్ణమండల దేశాల్లో మలేరియా ఎక్కువ కాబట్టి , మనకు కరోనాను ఎదుర్కొనే నిరోధకశక్తి ఉందని అంటున్నారు. ఇది నిజమేనా? మనకి కరోనా వల్ల పెద్దగా ప్రమాదం లేదా?

- కిరణ్‌, హైదరాబాద్‌

గణాంకాలను బట్టి అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో కరోనా వ్యాధి ప్రబలుతున్నట్టుగా చూస్తున్నాం. ముందుగా ఆ దేశాలు ఈ వ్యాధిని సీరియస్‌గా పట్టించుకోకపోవడం వల్ల, ఇప్పుడు కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరి ఉద్ధృతం అయిందని నిపుణులు అంటున్నారు. అందుకే మన ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యగా లాక్‌ డౌన్‌ చేశారు. ఇలా చేయకుంటే, అందరూ బయటికి వచ్చి వైరస్‌కి ఎక్స్‌పోజ్‌ అయి, కమ్యూనిటీ వ్యాప్తి అయితే మన దేశం తట్టుకోవడం కష్టం. 

అయితే మలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందే ఉష్ణమండల దేశాల్లో కరోనా వైరస్‌కు నిరోధకత ఉందని ఒక వాదన ఉంది. దీనికి కారణం... మలేరియా వ్యాప్తి లేని దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందనీ చిన్నవయసువారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, చనిపోతున్నారనీ చెప్తున్నారు. కాని మనదేశంలో వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు, ఇతరత్రా వ్యాధులు, కాంప్లికేషన్లు ఉన్నవాళ్లలో మాత్రమే జబ్బు తీవ్రంగా ఉంటున్నది.

 మరణించినవాళ్లలో అలాంటి వారు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగానే... పైన చెప్పిన ప్రతిపాదన ఉంది. తరతరాలుగా మలేరియాకు ప్రభావితం కావడం వల్ల మన జన్యువులు మార్పులు చెంది, ఇప్పుడు కరోనా లాంటి వైరస్‌లను తట్టుకునే నిరోధకతను మనలో పెంపొందించి ఉండొచ్చని ప్రతిపాదిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణం అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలనలు మాత్రమే. వీటిపై ఇంకా అధ్యయనాలు  జరుగలేదు. రుజువులు లేవు. కాబట్టి మనకు ప్రమాదం లేదులే అని, అప్రమత్తంగా ఉండకపోతే కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకునే ఆస్కారం ఉంది. అందుకే ఇంటినుంచి బయటికి రాకుండా, జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.  లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తేనే మనం ప్రమాదం నుంచి బయటపడుతాం. అలాగని భయాందోళనలతో మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు. అసత్య ప్రచారాలను నమ్మి భయపడొద్దు. ఆ ప్రతిపాదనలు నిజమైతే మనకన్నా అదృష్టవంతులు లేరు. 

డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌

హైదరాబాద్‌


logo