ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 26, 2020 , 22:35:07

కరోనా సెలవుల్లో..అమ్మే టీచరమ్మ!

కరోనా సెలవుల్లో..అమ్మే టీచరమ్మ!

పొద్దున్నే వెళ్లిపోయి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరే భర్త; కాలేజీ, స్కూలు,ట్యూషన్లు, డాన్స్‌ క్లాసులు... అంటూ పరుగులు పెట్టే పిల్లలు; అటు ఇల్లు, ఇటు ఆఫీసు- రెండు ప్రపంచాల్నీ సమన్వయం చేసుకునే ఇల్లాలు!నిన్న మొన్నటి వరకూ ప్రతి మధ్యతరగతి కాలనీలోనూ కనిపించిన దృశ్యం.కానీ, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా...   విద్యాసంస్థలకూ తాళాలు పడ్డాయి. కనీసం పక్షం రోజులు భర్త, పిల్లలు కళ్లముందే ఉంటారు.అమ్మ... టీచరమ్మ అవతారం ఎత్తడానికి ఇదే అనువైన సమయం.  

నిన్నమొన్నటి సంగతి వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు. మొగుడికి బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించి, లంచ్‌బాక్సు సర్ది, ఓ కప్పు కాఫీ ఇచ్చి... చిరునవ్వుతో సాగనంపితే సరిపోయేది. ఇప్పుడట్లా కాదు. పొద్దున్నే కాఫీ, ఓ గంట తర్వాత టీ, స్నానానికి ముందు ఇంకో కప్పు కాఫీ... ఆలస్యం చేయకుండా సమర్పించుకోవాలి. ఇంక, పిల్లల డిమాండ్లు పిల్లలవి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ కొత్తగా ఉండాలి, లంచ్‌ రెస్టారెంట్‌ భోజనంలా అదిరిపోవాలి, సాయంత్రానికి స్నాక్స్‌ సిద్ధం చేయాలి! గంటగంటకూ ‘శానిటైజర్‌'తో చేతులు శుభ్రం చేసుకున్నారా? అంటూ అందర్నీ హెచ్చరిస్తూ ఉండాలి. దుకాణం తెరిచే సమయానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. నిండుకుంటున్న కూరగాయల సంగతి  ఆలోచించాలి. 

పనిమనిషి కూడా ఈ పదిహేనురోజులూ రానని చెప్పేసి ఉంటుంది కాబట్టి, అంట్ల పని అదనం. ఆ ఒత్తిడితోనే చిత్తయిపోతుంటే... బండబండ అక్షరాల్లో బ్రేకింగ్‌ న్యూస్‌ ఒకటి. క్రికెట్‌ స్కోరు చెప్పినట్టు... పెరిగిపోతున్న కరోనా రోగుల వివరాలు. కజిన్స్‌ గ్రూప్‌లోనో, అపార్ట్‌మెంట్‌  లేడీస్‌ గ్రూప్‌లోనో పోస్టు చేసే తలాతోకాలేని తప్పుడు వార్తలు... బీపీ పెంచేస్తుంటాయి. ఏ అంతర్జాతీయ సంస్థవాళ్లో రంగంలోకి దిగి లెక్కతీస్తే మాత్రం,  కరోనా కారణంగా  తీవ్ర ఒత్తిడికి గురవుతున్నవారి జాబితాలో ప్రధానమంత్రి తర్వాత స్థానంలో ప్రధానంగా గృహిణే ఉంటుంది. ఇన్ని బాధ్యతల మధ్య కూడా... ఇంటిపట్టున ఉన్న పిల్లలకు ఏవైనా నాలుగు మంచి అలవాట్లు నేర్పించాలన్న ఆరాటం అమ్మది. నిజమే. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఏ తల్లి అయినా ఎందుకు  వదులుకోవాలి?

వంటింటి పాఠాలు...

పాలు కాయడం ఎలా? పుచ్చు వంకాయలు ఏరిపారేయడం ఎలా? ద్రాక్ష పండ్లు శుభ్రంగా కడగడంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటి? బత్తాయి రసం తీయడంలో మెలకువలు?... అన్నీ చిన్నచిన్న విషయాలే. కానీ, ఈ తరానికి వచ్చేసరికి బ్రహ్మ విద్యల్లా అనిపిస్తాయి. అయినా... నేర్పించడానికైనా, నేర్చుకోడానికైనా ఎవరికి మాత్రం సమయం ఉంటున్నది? ఏ కారణంతో అయితేనేం, ఇప్పటికి కుదిరింది. కాబట్టి, అమ్మ పంతులమ్మ అవతారం ఎత్తాల్సిందే. అవసరమైతే బెత్తం పట్టాల్సిందే. పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకుని నేర్పించాల్సిందంతా నేర్పించాల్సిందే. మొదట్లో టీవీలో మంచి సినిమా వస్తున్నదనో, అమెజాన్‌లో స్టాండప్‌ కామెడీ చూస్తున్నామనో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా వదలకండి. ఓపిగ్గా దారికి తెచ్చుకోండి. నేర్చుకునే క్రమంలో చిన్నచిన్న తప్పులు చేసినా క్షమించేయండి. ఒకటిరెండు ప్రశంసలూ కురిపించండి.  అప్పుడప్పుడూ వంటలోనూ భాగస్వాముల్ని చేయండి.  అదే సమయంలో వాళ్లకి ఏ దినుసులో ఏఏ పోషకాలు ఉన్నాయో, అవి మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో..  వివరంగా చెప్పండి. దీనివల్ల పిల్లలకు కొన్ని వంటకాల పట్ల అయిష్టత తొలగిపోతుంది. 

కాకరకాయ అయినా  కాదనకుండా తినేస్తారు. 

అందరికీ భరోసా

జిమ్‌లు బంద్‌. యోగా సెంటర్లు బంద్‌. వాకింగ్‌లూ జాగింగ్‌లూ బందే. అయితేనేం, ఇంటిని జిమ్‌గా మార్చుకోవచ్చు, టెర్రస్‌ను యోగా సెంటర్‌గా తీర్చిదిద్దుకోవచ్చు. పిల్లలకు ఓ నాలుగు ఆసనాలు నేర్పించవచ్చు. అవసరమైతే యూట్యూబ్‌ సాయం తీసుకోవచ్చు. స్కిప్పింగ్‌ లాంటివి చేయించవచ్చు. దీనివల్ల రోజులకొద్దీ ఇంట్లోనే ఉండటం వల్ల పేరుకుపోయే అదనపు కెలోరీలు కరిగిపోతాయి. మకరాసనంలో మర్కటంలా ఫోజులిచ్చే బాబు, పాతిక గుంజీలకే ‘నా వల్ల కాదు బాబోయ్‌' అని చేతులెత్తేసే పాప, పొట్ట కనిపించకుండా మేనేజ్‌ చేయాలని ప్రయత్నించే భర్త .. ఆ కాంబినేషన్‌లో మంచి కామెడీ క్రియేట్‌ అవుతుంది. హాయిగా నవ్వుకోవచ్చు. సాయంత్రాలు చెస్‌, క్యారెమ్స్‌లాంటి ఇండోర్‌గేమ్స్‌నూ ప్రోత్సహించవచ్చు.  అన్నింటికీ మించి వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. ఓపిగ్గా వాళ్ల మాటలు వినండి. సందేహాలు తీర్చండి. భయాలు పారదోలండి. నేనున్నా.. అనే భరోసా ఇవ్వండి. 

తప్పదు ఇవ్వాల్సిందే...

ఆరునూరైనా సరే& పిల్లల్ని సెల్‌ఫోన్లకూ ట్యాబ్‌లకూ దూరంగా ఉంచాలన్న కఠిన నిర్ణయం మంచిది కాదు. మనతరం కళ్లతో నవతరాన్ని చూడటం సరైన పద్ధతీ కాదు. టెక్నాలజీతో కలిసి పెరుగుతున్న జెనరేషన్‌ ఇది. కాకపోతే, ఆన్‌లైన్‌లో వాళ్లు ఎంత సురక్షితంగా ఉన్నారనే విషయంలో ఒక కన్నేసి ఉంచడం మంచిది. కుటుంబానికంతా కలిపి ఫ్యామిలీ ఇ-మెయిల్‌ సృష్టించుకోండి. పిల్లలు ఏ వెబ్‌సైట్‌లోనో లాగిన్‌ కావడానికి దాన్నే ఉపయోగించుకునేలా చూడండి. సిస్టమ్‌లో ‘గూగుల్‌ సేఫ్‌ సెర్చ్‌'ను యాక్టివేట్‌ చేయండి. మీ గాడ్జెట్‌లో ‘ఇన్‌ యాప్‌ పర్చేజ్‌' ఆప్షన్‌ను తీసేయండి. అమ్మో, నాన్నో ఆ పరిసరాలకు వెళ్లగానే ఎవరో తరుముతున్నట్టు సిస్టమ్‌ను క్లోజ్‌ చేస్తున్నారంటే...   ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. అప్పటికే చిన్నచిన్న పొరపాట్లు జరిగిపోయి ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయండి.    ఎన్ని ఆటలు ఆడుకున్నా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని ఇంటిపనులు నేర్చుకున్నా.. చదువు తర్వాతే ఏదైనా? పెద్ద పరీక్షలు పూర్తికాని విద్యార్థులు... చదువుసంధ్యలకూ తగినంత సమయం కేటాయించాల్సిందే. ఆ మేరకు అమ్మ ఒత్తిడి చేయాల్సిందే. అదే సమయంలో అమ్మ... తన ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. లేనిపోని ఒత్తిళ్లకు గురికాకూడదు. అనవసరమైన ఆందోళనలతో మనసు ఖరాబు చేసుకోకూడదు. అందర్నీ సంతోషపెట్టే క్రమంలో తాను ఇబ్బంది పడకూడదు. అమ్మా  ఆరోగ్యం జాగ్రత్త!


శుభ్రంగా

ప్రతిసారీ అమ్మే ఎందుకు ఇల్లు దులపాలి. నాన్నే ఎందుకు కిటికీలు, ఫ్యాన్లు తుడవాలి. కరోనా సెలవుల్లో ఆ బాధ్యతలో కొంత పిల్లలకూ అప్పగించవచ్చు. తమ పుస్తకాలు, బట్టలు తామే సర్దుకునేలా ప్రోత్సహించవచ్చు. మొక్కలకు నీళ్లు పోయించవచ్చు. ఇన్నిన్ని పనులు ఒకేసారి చేయిస్తే  అలసిపోతారు. కాబట్టి రోజూ కొంతకొంత పరిచయం చేయవచ్చు. ఇద్దరో ముగ్గురో ఉంటే శ్రమవిభజనా చేయవచ్చు. అదీ వయసుకు తగిన బాధ్యతే అయి ఉండాలి. శక్తికి మించిన భారం వద్దేవద్దు. పెరడు ఉంటే సంతోషమే. లేకపోతే మాత్రం.. కుండీల్లో ఏ ధనియాలో, టమోటా విత్తనాలో నాటించండి. అవి మొలకెత్తి మొక్కలుగా మారుతున్న తీరు పిల్లలకు అద్భుతంగా అనిపిస్తుంది. దీనివల్ల పచ్చదనం పట్ల ప్రేమ పెరుగుతుంది. భవిష్యత్తులో పర్యావరణానికి హాని కలిగించే పనులేవీ చేయరు. 


logo