ఆదివారం 24 మే 2020
Zindagi - Mar 26, 2020 , 22:29:29

ఇవి తినండి... ఇమ్యూనిటీ పొందండి

ఇవి తినండి... ఇమ్యూనిటీ పొందండి

కరోనా దాడితో ఇప్పుడు అందరి దృష్టీ ఆహారం మీద పడింది. వేడి నీళ్లు తాగమని ఒకరు... అల్లం, వెల్లుల్లి తినమని మరొకరు.. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇంతకీ మన వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఏం తినాలి..?  

వ్యాధినిరోధక శక్తి ఒక్కరోజులో వచ్చేది కాదు. చాలామంది వేడి నీళ్లు పదినిమిషాలకోసారి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు. ఇది నిజం కాదు.  పసుపు, వెల్లుల్లి, అల్లం వంటివి ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధకశక్తి అధికం అవుతుందనీ అంటున్నారు. వీటివల్ల లాభాలున్నాయి. కానీ ఒక్కసారిగా ఏదో మ్యాజిక్‌ జరిగిపోదు. వీటితో పాటు సమతులాహారం కూడా ముఖ్యమే. సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంతో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. 


విటమిన్ ‌A

కంటి చూపునకే కాదు.. ఇన్‌ఫెక్షన్లతో పోరాడగలిగే సామర్థ్యాన్ని పెంచే విటమిన్‌ ఇది. కాబట్టి  కరోనా సీజన్‌లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం. కోడిగుడ్డు సొన, ఆకుకూరలు, క్యారెట్లు, పసుపు రంగులో ఉండే ఆరెంజ్‌లు, గుమ్మడి, బీట్‌రూట్‌లలో విటమిన్‌-ఎ లభిస్తుంది. 


విటమిన్‌ B

బి కాంప్లెక్స్‌లోని బి6, బి9, బి12  ఇమ్యూనిటీ పెంచడంలో ముందుంటాయి.  వ్యాధినిరోధక కణాలను ఇవి చైతన్యవంతం చేస్తాయి. చికెన్‌, చేపలు, చిక్కుళ్లు, బఠాని, శనగలు, బొబ్బర్లు, అలసందలు. గుమ్మడి, సన్‌ఫ్లవర్‌ లాంటి గింజలు, పాలు, కోడిగుడ్లలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. 


విటమిన్ C

శరీరంలోని హానికర పదార్థాలను, డ్యామేజి అయిన కణాలను విటమిన్‌ సి తొలగిస్తుంది. శరీరంలో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ వల్ల జీవక్రియ కుంటుపడి, తద్వారా ఇమ్యునిటీ ప్రభావితం అవుతుంది. విటమిన్‌ సి ఈ ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. నిమ్మ, నారింజ, బెర్రీస్‌ లాంటి పండ్లలో విటమిన్‌ సి దొరుకుతుంది. 


విటమిన్ D

సూర్యకాంతిలో కావాల్సినంత విటమిన్‌ డి దొరుకుతుంది. ఇమ్యూనిటీని పెంచడంలో ఇది పరోక్షంగా సహాయపడుతుంది. కాబట్టి డి విటమిన్‌ లోపం రాకుండా చూసుకోవాలి. కోడిగుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగుల ద్వారా కూడా విటమిన్‌ డి పొందవచ్చు. 


విటమిన్ E

యాంటి ఆక్సిడెంట్స్‌లో పెద్దపీట ఇ విటమిన్‌దే. గింజలు, వెజిటబుల్‌ ఆయిల్స్‌లలో ఇది ఎక్కువ. 


ఇనుము

 సాధారణ ఆరోగ్యానికే కాకుండా వ్యాధినిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇనుము అవసరం. రక్తాన్ని అభివృద్ధి చేసే ఇనుము వ్యాధి నిరోధక కణాల వృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఆకుకూరలు, బెల్లం, తేనె, గింజలు, కోడిగుడ్డు సొన, కాలేయం లాంటి వాటిలో ఇనుము పుష్కలం. 


వ్యాయామం

 శారీరక ఫిట్‌నెస్‌ పెంచడానికే కాదు... వ్యాయామం ఇమ్యూనిటీ బూస్టర్‌ కూడా. రెగ్యులర్‌గా కసరత్తు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 


ఇవి వద్దు

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారమే కాదు.. ఉన్న ఇమ్యూనిటీని తగ్గించే ఆహారం కూడా ఉంది. ఇప్పటివరకూ మనం అలవాటు పడిన జంక్‌ ఫుడ్‌, ఎక్కువ షుగర్స్‌ ఉన్న ఆహార పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు మనకు సహజంగా ఉన్న రోగ నిరోధక శక్తిని అణచివేస్తాయి. అందుకే వీటిని తీసుకోవద్దు. పొగ, ఆల్కహాల్‌ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. 


ఎంత మంచి ఆహారం తిన్నా, ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా జీవనశైలి సరిగ్గా లేకుంటే వ్యర్థమే. సమతులా హారం తీసుకోవడంతో పాటు సమయానికి తినడం, నిద్రపోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అవసరం. 


డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

డైటీషియన్‌

హైదరాబాద్‌

9849995950


logo