ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 26, 2020 , 15:42:32

ఆస్ట్రేలియా జనాలకు పెండ్లి కష్టాలు

ఆస్ట్రేలియా జనాలకు పెండ్లి కష్టాలు

కరోనా భయం ప్రపంచాన్ని భూతంలా వెంటాడుతున్నది. ఎవ్వరూ ఏ పనీ చేసుకోలేక ఇంట్లోనే చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించటంతో ఎన్నెన్నో కలలతో పెండ్లకి సిద్ధమైన యువత నైరాశ్యంలో మునిగిపోతున్నారు. 

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవి బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనవి ఈ సమయంలో ఎవరైనా పెండ్లి చేసుకోవాలంటే ఆ కార్యక్రమంలో ఐదుగురికంటే ఎక్కువ పాల్గొనకూడదు. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురును కలుపుకొనే ఈ సంఖ్యను నిర్ణయించటంతో సొంత తల్లిదండ్రులు తప్ప ఇంకెవరూ పెండ్లికి హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. 

ఏడాది క్రితం నిర్ణయించుకున్న పెండ్లిళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. దాంతో ముహూర్తాలకు ముందే చాలామంది హడావిడిగా పెండ్లితంతును మమ అనిపిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ప్రముఖ పర్యావరణ టీవీ వ్యాఖ్యాత బిండి ఇర్విన్ తన పెండ్లి జరిగిన తీరుపై ఆవేదనతో ఓ ట్వీట్ చేశారు. ఈ మధురమైన రోజును జీవితాంతం గుర్తుంచుకొనేలా ఉత్సవం చేసుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నామని చివరకు క్వీన్స్‌లాండ్‌లోని ఆస్ట్రేలియా జూలో కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే హాజరైన వేడుకలో తన ప్రియురాలు చాండ్లర్ పావెల్‌ను పెండ్లిచేసుకున్నట్లు బుధవారం తెలిపాడు. బంధుమిత్రులందరినీ పిలిచే అవకాశం లేనందున పెండ్లి వేడుకను వీడియో లైవ్ ద్వారా అందరూ చూసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

మరోవైపు ఎవరైనా చనిపోతే అంతిమయాత్రలో పాల్గొనేవారి సంఖ్యపై కూడా ప్రభుత్వం పరిమితి విధించింది. 


logo