ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 24, 2020 , 22:18:08

‘కరోనా ఉగాది’ చేసుకోండిలా..

‘కరోనా ఉగాది’  చేసుకోండిలా..

పండగ అంటే అందరూ కలిసి చేసుకునే సంబరం. కరోనా నేపథ్యంలో... మిగతావారికి ఎంత దూరంగా ఉండి చేసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. అందుకే  కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండాలంటే,  ఉగాది నాడు ఈ జాగ్రత్తలు పాటించండని సూచిస్తున్నారు...

  • తోరణాలు, మామిడి కాయల లాంటివన్నీ నీటి ధార కింద శుభ్రంగా కడగాలి. వేడినీటిలో వేసి తీస్తే మరీ మంచిది. కూరగాయలను ఉప్పునీటితో కడగాలి. 
  • బయటికి వెళ్లేటప్పుడు మాస్కు వేసుకోవడం మరవొద్దు. బయటి నుంచి వస్తువులను కొని, ఇంటికి తెచ్చిన వ్యక్తి లోపలికి రాగానే ముందు వెంటనే స్నానం చేయాలి. ఆ వ్యక్తి దుస్తులను కూడా వేడినీటిలో నానబెట్టి, శుభ్రం చేయాలి. బయటినుంచి తెచ్చిన బ్యాగును ఇంట్లో ఉంచకూడదు. బట్టతో చేసిన బ్యాగు అయితే వేడినీటితో శుభ్రం చేయాలి. 
  • వస్తువులు పట్టుకునే చేతితోనే సాధారణంగా ముక్కు, నోరు, కన్ను ముట్టుకుంటుంటాం. అలా రొటీన్‌గా వాడే చేయి కాకుండా వేరే చేత్తో వస్తువులు ముట్టుకోవాలి.
  • సాధారణంగా ఏ పండుగ అయినా ఇంట్లో చేసుకున్న పిండివంటలు మన ఇరుగు పొరుగు వాళ్లకు పంచుతుంటాం. ఉగాది పచ్చడి కూడా రుచి చూపిస్తుంటాం. అలాంటివేవీ చేయకూడదు. 
  • ఉగాది పండగ అంటే పంచాంగ శ్రవణం తప్పనిసరి. ఇందుకోసం అందరూ ఒక్కచోట చేరుతారు. కానీ ఈసారి ఆ కార్యక్రమం రద్దు చేసుకోండి. ఏ టీవీలోనో, రేడియోలోనో చెప్పే పంచాంగం వినడమో, లేదా ఇంట్లోనే పంచాంగం చదువుకోవడమో ఉత్తమం.
  • మన ఆచారాల్లో ప్రస్తావించేది.... అనేక రకాల యాంటి మైక్రోబియల్‌ పదార్థాలే. వాటిలో బెస్ట్‌ యాంటివైరల్‌ వేప. అందుకే మామిడి తోరణాలే కాదు.. వేప ఆకులను కూడా గుమ్మాలకు వేలాడదీయండి. వేప ప్రాధాన్యం ఈరోజుతో మొదలైతే ఆషాఢం దాకా ఉంటుంది. కాబట్టి  ఆగస్టులో వచ్చే బోనాల వరకూ ఇలా వేప ఆకుల తోరణాలను కట్టుకోండి. వేప ఆకుల గాలి కూడా యాంటి సెప్టిక్‌గా పనిచేస్తుంది. 
  • ఐసిఎంఆర్‌, సిసిఆర్‌ఎస్‌ఇ, ఆయుష్‌ సంస్థల సూచనల ప్రకారం ... అల్లం, వెల్లుల్లి, జీలకర్ర లాంటివి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. కాబట్టి పండగ నాడు చేసుకునే వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడుకోండి. 


logo