ఆదివారం 24 మే 2020
Zindagi - Mar 24, 2020 , 09:56:43

అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా..అయినా?

అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా..అయినా?

మన దేశంలో కరోనా ప్రభావం కనిపించిన తొలినాళ్లలోనే అహ్మదాబాద్‌కు చెందిన ఒక యువతికి కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది. మొదట్లో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న అతి కొద్దిమందిలో ఆమె ఒకరు. తనకు ఆ వ్యాధి సంక్రమించిన నేపథ్యాన్ని అందరితోనూ పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో హాస్పిటల్‌ బెడ్‌ మీద నుంచే తన కథను మనసుకు హత్తుకునేలా వివరించింది... 

 ‘2020 నూతన సంవత్సరం ఒక అందమైన జ్ఙాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశ్యంతో నార్తరన్‌ లైట్స్‌ చూడటానికి ఫిన్లాండ్‌ వెళ్లాలనుకున్నాను. జనవరి 15 నుండే వుహాన్‌లో కరోనా వైరస్‌ ప్రబలుతున్న విషయం ఆ సమయానికే నాకు తెలిసింది. ప్రపంచం ఓ విపత్కర స్థితిలో ఉందని అర్థమైంది. కానీ  కరోనా నన్నేమీ చేయదని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ సమస్య గురించి సంపూర్ణ అవగాహన ఉంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. కాబట్టే, నాకేం కాదన్న నమ్మకంతో మార్చిలో ఫిన్లాండ్‌కు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాను.

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేప్పుడు ఎన్‌-99 మాస్క్‌ ధరించాను. వందసార్లు నా చేతులను శుభ్రం చేసుకున్నాను.  వీలైనంత ఎక్కువసార్లు నా సీటును కూడా శుభ్రం చేశాను. ఫ్లైట్‌లో 90- 95% మంది ప్రయాణికులు ఎలాంటి మాస్కులు ధరించకపోవడం నాకు విచిత్రంగా అనిపించింది. సెక్యూరిటీ  చెకింగ్‌లు, పాస్‌పోర్ట్‌ చెకింగ్‌ల సమయంలో మాస్క్‌ను తాకకుండా చూసుకున్నాను. ఆకలిదప్పులు తీర్చుకోవడానికి నేరుగా చేతులను ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డాను. నేను నా ప్రయాణం ప్రారంభించిన సమయానికి 10 కంటే తక్కువ కేసులే ఉన్నాయి.  ఇండియాకు తిరిగి వచ్చేనాటికి మాత్రం కొవిడ్‌-19 ఓ మహమ్మారిగా మారింది. అప్పటికి మన దేశంలో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. 

ఆ ఎడబాటు తర్వాత కూడా... నేను నా  కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకోలేదు. ఉద్వేగాల్ని పక్కనపెట్టి చాలా దూరంగా ఉన్నాను. శానిటైజర్‌ను నా సంచులపై స్ప్రే చేశాను. అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకుని... బ్యాగేజీని బాత్రూంలో ఉంచాను. ఎందుకో, మార్చి 14న నాకు కొంచెం జ్వరంగా అనిపించింది. దీంతో  గదిలో ఒంటరిగానే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం, అమ్మానాన్నలు నా జ్వరం గురించి జనరల్‌ ఫిజీషియన్‌తో మాట్లాడారు. అయితే నేను ఫిన్లాండ్‌లోని -15 డిగ్రీల వాతావరణం నుంచి హఠాత్తుగా +25కి రావడం వల్ల జ్వరం వచ్చి ఉంటుందనే ఉద్దేశ్యంతో, ఫ్లూ చికిత్సలో భాగంగా  కొద్దిరోజులు యాంటీ బయాటిక్స్‌ తీసుకోవాలని సలహా ఇచ్చాడు వైద్యుడు.

 నా గది బయట ఒక చిన్న టేబుల్‌ ఉంటుంది. ఇంట్లో వాళ్లు నాకు అవసరమైన వస్తువులను అప్పగించడానికి అది ఉపయోగపడేది.  బాత్రూమ్‌ సింక్‌లోని నా పాత్రలను సబ్బుతోపాటు వేడి నీటితో శుభ్రంగా కడిగేదాన్ని. నేను వాడిన పాత్రలను ఇంట్లోకి పంపే ముందు... తలుపులు తెరిచి మరోసారి చేతులు కడుక్కునేదాన్ని. పాత్రలను తీసుకెళ్ళి బయట టేబుల్‌పై ఉంచేదాన్ని. ఆ పాత్రలను అమ్మ  తిరిగి కడిగేది.  (ఐసొలేషన్‌) స్వీయ రక్షణలో ఒంటరిగా ఉన్నన్ని రోజులూ నేను అనుసరించిన విధానం ఇది. అంతేకాదు, నేను వాడిన బట్టలను డెటాల్‌తో, వేడి నీటిలో శుభ్రం చేసేదాన్ని. ప్రతిసారీ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బకెట్‌ హ్యాండిల్‌ను డెటాల్‌ నీటితో శుభ్రం చేయడం... మరచిపోయేదాన్ని కాదు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో మా ఫ్యామిలీ డాక్టర్‌ క్లినిక్‌కు పిలిచారు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లాను.  

క్లినిక్‌లో కాలుపెట్టేముందు N99 మాస్క్‌ ధరించాను. అందరికీ దూరంగా కూర్చున్నాను. అది చూసిన హాస్పిటల్‌ బృందం, డాక్టర్‌... నన్ను కలవడానికి ముందు తామూ ముసుగులు ధరించారు. వారు అలా చేసినందుకు సంతోషపడ్డాను. ముందు జాగ్రత్త ఎవరికైనా మంచిదేగా! నా వ్యాధి లక్షణాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయనీ... నేనింకా జ్వరంతోనే ఉన్నాననీ& అలాగే నాకు తేలికపాటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ ఉందనీ డాక్టర్‌ నిర్ధారించారు. తను రాసిన మందులు వాడాలని సూచించారు. 

ఆ తర్వాత నేను ఇంటికి తిరిగి వెళ్ళాను, నా కారును ఎండలో ఉంచాను. దీనివల్ల కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని నా ఆలోచన. ఇంట్లోకి వెళ్లడానికి కూడా లిఫ్ట్‌ ఉపయోగించలేదు. తలుపు తెరిచి ఉందో లేదో తెలుసుకోడానికి అమ్మను పిలిచాను. తలుపులు తాకకుండానే లోపలికి వెళ్లాను. నేరుగా నా గదిలోకి వెళ్లిపోయాను. ఆ రెండు రోజులు జ్వరం ఉంది. దగ్గు లేదు. శ్వాసపరమైన సమస్యా లేదు. 


నేను ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో... ఓ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. దాన్ని అందుకోవడానికి కూడా వెళ్ళలేదు. నిజానికి ఆ విజయం కోసం మేం 6 సంవత్సరాలు కష్టపడ్డాం. ఫిన్లాండ్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత నా టీమ్‌ను కలవడానికి సైతం వెళ్ళలేదు. నన్ను నేను పూర్తిగా ఐసొలేట్‌ చేసుకున్నాను. ముందుజాగ్రత్త అనేది కష్టాల నుండి కాపాడుతుందని నేను నమ్ముతాను. అదే సమయంలో ఎవరూ మానసికంగా కూడా ఒత్తిడికి గురికాకూడదు. కాబట్టే, నేను చాలా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ వచ్చాను.  

కొన్నిరోజులకు జ్వరం దాదాపుగా తగ్గి పోయింది. ఇతర లక్షణాలు కూడా మాయం అయినట్టు అనిపించింది. అయినా ఇంకా కొంతకాలం ఐసొలేషన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. మార్చి 16న మళ్లీ దగ్గు వచ్చింది. ఛాతీలో కొద్దిగా బిగుతుగా అనిపించింది. ఆ లక్షణాలు కూడా చాలా సాధారణంగా ఉన్నాయి. అయినా నేను డాక్టర్‌కు కాల్‌ చేశాను. ఆమె వెంటనే ఆసుపత్రికి వచ్చి కలవమని చెప్పారు. మళ్ళీ ఒంటరిగానే వెళ్ళాను. ఆమె నా ఛాతీని పరీక్షించారు. నాకు శ్వాసలో కొంత సమస్య ఉందని చెప్పారు. నేను వెంటనే కొవిడ్‌-19 లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో ఇంకోసారి పరీక్షించమని అడిగాను. నా మట్టుకునేను తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కుటుంబం గురించే చాలా భయపడ్డాను.  నా వల్ల వారికి ఎలాంటి వ్యాధులూ రాకూడదనుకున్నాను. దేవుడ్ని కూడా ప్రార్థించాను. అయినా ఎక్కడో ఏదో అనుమానం. గత 8 రోజులుగా నిర్బంధంలో ఉండటం వల్ల వ్యాధి లక్షణాలూ బయటికి కనిపించకపోయినా& నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అర్థమైంది. రోజులు లెక్కబెడుతూ కాలం గడిపాను. నా బాధ అంతా కుటుంబం గురించే.

ఇది చాలా పెద్ద పోస్ట్‌. మీ అందరికీ నా కథ ఆసక్తిగా అనిపిస్తే మరో సందర్భంలో పంచుకుంటాను. మీరో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులైనా సరే జాగ్రత్తగా ఉండండి. కరోనా చాలా రిస్క్‌తో కూడుకున్నదని గుర్తుంచుకోండి. పొరపాటున మీకు కరోనా వచ్చినా భయపడిపోవాల్సిన పన్లేదు. మనకు ఎంతోమంది నిపుణులైన వైద్యులు ఉన్నారు. వారు తగిన చికిత్స చేస్తారు. అంతర్జాతీయంగా చూస్తే... మన దగ్గర కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువే. చాలావరకు నివారించవచ్చు. ఈ సంక్షోభ సమయంలో మీ ప్రార్థనలు, శుభాకాంక్షలు, సందేశాలు, ప్రేమలు నాకు కావాలి. నా గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు.


logo