శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 22, 2020 , 22:59:16

తండ్రి చెప్పిన మాట విజయాల బాట

తండ్రి చెప్పిన మాట విజయాల బాట

‘విమియో’ న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఫ్రీ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం. 2004లో స్థాపించిన ఈ సంస్థ తొలి వీడియో షేరింగ్‌ సైట్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో లీడింగ్‌లో ఉన్న ఆన్‌లైన్‌ యాడ్‌ ఫ్రీ ప్లాట్‌ఫాంలలో విమియో ఒకటి. వ్యక్తులు లేదా చిన్న సంస్థలు వీడియోలను  దీనిద్వారా షేర్‌ చేసుకోవచ్చు. వీడియోల రూపకల్పన, పంపిణీ, చట్టబద్ధంగా తయారుచేయడంలో క్లౌడ్‌ ఆధారిత ప్లాట్‌ఫాంగా విమియో పనిచేస్తున్నది. అంతటి గుర్తింపు పొందిన ఆ సంస్థకు చిన్నవయసులోనే సీఈఓగా నియమితురాలైంది ‘అంజలిసూద్‌'. తక్కువ సమయంలోనే విమియోను ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థగా మార్చడంలో ఆమె కృషి ప్రశంసనీయం. తన పనితీరుతో ఫార్చ్యూన్‌ ‘అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్త’గా గుర్తింపు పొందిన భారత సంతతి అంజలీసూద్‌ ‘సక్సెస్‌మంత్ర’ ఇది.

అంజలీ సూద్‌.. చిన్నతనం నుంచి కూడా కంఫర్ట్‌ జోన్‌లో పెరిగింది. దానికి కారణం చిన్నతనంలో తను ఎవరితో మాట్లాడలన్నా మొహమాటపడేది.  సిగ్గుతో బిగుసుకు పోయేది. ఆమె తండ్రి మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ప్లాంటును నడిపేవారు. ఇప్పటికీ ఆ ప్లాంట్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. కూతురు ఎప్పటికైనా వ్యాపారస్తురాలిగా మారాలని ఆయనకుండేది. అందుకే ఆయన తరుచుగా ‘మనం వ్యాపారం చేస్తే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. దానివల్ల సమాజానికి ఎంతోకొంత మేలు చేసినవాళ్లమవుతాం’ అని చెప్పేవారు. కాని అంజలీ సిగ్గుతో నలుగురిలో కలవలేకపోతున్నదని ఆయన  గుర్తించాడు. ‘నీ కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటపడు. నేను ఇదే చేయగలను అని వేలాడటం మానేసి ఎలాంటి అనుభవం లేని పనిలో నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు కష్టపడు. అప్పుడే జీవితంలో ఎదుగుతావు’ అని చెప్పాడు. ఆ మాటలు ఆమెను ఆలోచింపజేశాయి.

కొత్త ప్రపంచంలోకి..

అంజలీ చిన్నప్పుడు మసాచూసెట్స్‌ బోర్డింగ్‌ స్కూల్లో చదివింది. ఆ వయసులోనే ఫిలిప్స్‌ అకాడమీ నుంచి స్కాలర్‌షిప్‌ అందుకుంది. 13 ఏండ్ల వయసులో తొలిసారి కొత్తప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒకరోజు మిచిగాన్‌లో రోడ్డుపక్కన ఉన్న ఒక బుక్‌స్టాల్‌లో ‘ద బెస్ట్‌ హైస్కూల్స్‌ ఇన్‌ అమెరికా’ అనే పుస్తకాన్ని చూసింది. వెంటనే కొని చదివింది. అప్పటి వరకు అన్నీ తను చదువుకున్న స్కూల్స్‌లాగే ఉంటాయని భావించిన ఆమెకు ఒక కొత్త ప్రపంచం కళ్లముందు కదలాడింది. ఆ పుస్తకంలో ఎన్నో కొత్త కొత్త కోర్సులతో కూడిన స్కూళ్ల వివరాలున్నాయి. ప్రపంచంలో ఇన్ని స్కూల్స్‌ ఉంటాయా? అనే ఆశ్చర్యంతో పాటు కంఫర్ట్‌జోన్‌ నుంచి ఫ్రీడం జోన్‌లోకి అడుగుపెట్టాలనుకునే తన ప్రయత్నానికి తొలి అడుగు పడింది. 

ఓటమి నుంచి గెలుపు

పుస్తకం కొని అంజలి ఊర్కోలేదు. 30 పాఠశాలలకు పైగా అప్లై చేసింది. ఒకరకంగా తనున్న ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యమే ఆమె అలా చేయడానికి కారణం. అలా యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో చేరింది. 14 ఏళ్ల వయసులో చదువుకోసం ఇల్లు వదిలి బయటకు వచ్చింది. అప్పటివరకు సౌఖ్యం తప్ప మరేది తెలియని ఆమె ఆ వయసులో ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవడం, చదవడం, తనకు తాను అన్ని పనులూ చేసుకోవడం చాలా కష్టమనిపించేది. దీంతో ఆమె  తొలి ఏడాది పరీక్షల్లో ఫెయిలైంది.  అయినా  ఏ మాత్రం కుంగిపోలేదు. అప్పుడే తన తండ్రి చెప్పిన ఫార్ములాను బాగా గుర్తు  చేసుకున్నది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలుపు బీజాలు నాటాలనుకున్నది. కఠోర సాధనచేసి తిరిగి పరీక్షల్లో విజయం సాధించింది. అలా తనకు తాను గీసుకున్న  కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడ్డది. ఆ తర్వాత హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూల్లో ఎంబీఏ చేసింది. 


మరో ప్రయోగం

ఎంబీఏ పూర్తికాగానే బ్యాంకర్‌గా పనిచేయడానికి 30కి పైగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది అంజలీ. కానీ, ఒక్కదాని నుంచి కూడా ఇంటర్వ్యూ అవకాశం రాలేదు. ఐనా కొన్ని బ్యాంక్‌లకు ఇంటర్వ్యూలకు వెళ్లింది. ‘ బ్యాంకింగ్‌ ఉద్యోగానికి పనికి రావు’ అని కొందరు కరాఖండిగా చెప్పారు. ఐనా ఆమె  ప్రయత్నాలను విరమించుకోలేదు. ‘తనకు తాను విధించుకున్న అ  పరిమితుల నుంచి మనిషి బయటపడాలి.  సరిహద్దులను చెరిపేసుకోవాలి’ అని తండ్రి చెప్పిన మాటను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంది. ఇదే చేస్తానని అక్కడే ఆగిపోలేదు. తన ప్రయత్నాలను విరమించలేదు. చివరకు ‘సాజెంట్‌ అడ్వయిజర్స్‌ అనే చిన్న సంస్థలో అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించింది. తొలి ఉద్యోగం కావడంతో నేర్చుకునేందుకు అవకాశం లభించింది. తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగం మానేసింది. ఆ తరువాత అమెజాన్‌, టైమ్‌ వార్నర్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేసింది.

విమియోలో అడుగుపెట్టి..

చిన్నతనంలో తండ్రి వ్యాపారం మూలంగా బాల్యంలోనే అంజలీకి వ్యాపారవేత్తకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వీడియోలను బదిలీ చేసుకునేందుకు వీలు కల్పించే వెబ్‌సైట్‌ విమియోలో మార్కెటింగ్‌ విభాగాధిపతిగా 2014లో చేరింది సూద్‌. వీడియోల రూపకల్పన, పంపిణీ, చట్టబద్ధంగా తయారుచేయడంలో క్లౌడ్‌ ఆధారిత ప్లాట్‌ఫాంగా ఆ సంస్థను తీర్చిదిద్దింది. క్రమంగా అవకాశాలను వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. 34 ఏళ్ల వయసులోనే (2017లో) కంపెనీకి సీఈవో అయ్యింది. ఈ మూడేళ్లలో ఆమె అసాధారణ విజయాలు సాధించింది.  వ్యక్తులతో పాటు చిన్న, మధ్యస్థాయి సంస్థలను తన కంపెనీలో ఖాతాదార్లుగా మార్చుకుంటున్నది సూద్‌. ఆమె తెచ్చిన విప్లవాత్మక మార్పులతో కంపెనీ షేర్ల ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఫార్చ్యూన్‌ నివేదికలో అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తగా 14వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘ద హాలీవుడ్‌ రిపోర్టర్స్‌' 2017 ద నెక్ట్స్‌ జెన్‌ లిస్ట్‌లో అంజలీకి స్థానం దక్కింది.

మనమే సృష్టించుకోవాలి

‘అవకాశాలనేవి మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే సృష్టించుకోవాలి. మనకంటూ ఓ జోన్‌ను ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటానంటే ఎప్పటికీ ఎదగలేం. మనల్ని ఎవరో నడిపించాలని ఎదురుచూడకుండా మన రహదారిని మనం నిర్మించుకుంటేనే నాయకులుగా ఎదగగలుగుతాం’ తన తండ్రి చెప్పిన జీవితసత్యాన్ని రోజుకొకసారైన గుర్తు చేసుకుంటానంటున్నది అంజలీసూద్‌. 


logo