ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 21, 2020 , 22:36:46

కన్న కడుపు కాలితే.. కదిలొస్త్తరు కొడకా!

కన్న కడుపు కాలితే.. కదిలొస్త్తరు కొడకా!

చిన్నతనంలో పిల్లలు తప్పు చేస్తే మందలిస్తాం. చదువుకునే వయసులో పొరపాట్లు చేస్తే ఒక దెబ్బతో దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తాం. మరి పేగు తెంచుకుని పుట్టిన కొడుకు.. తాను తండ్రిగా మారిన వయసులోనూ కన్నవారిని నిరాదరణకు గురిచేస్తే? 

ఏమని దండిస్తాం? సమాజంలో ఇదో వైరస్‌లా వ్యాపిస్తుండటంతో వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం?

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామ వృద్ధులు దీనికో పరిష్కారం కనుగొన్నారు. ‘మౌనమే’ అస్త్రంగా.. కఠినంగా మారిన పిల్లల మనసులను మారుస్తున్నారు. బతిమిలాడటం ఉండదు. వాదనలు ఉండవు. చట్టాలు.. శిక్షలు అంటూ హెచ్చరికలకూ స్థానమే లేదు. కేవలం ఆ ఇంటి చుట్టూ మౌన దీక్ష చేస్తారు. పేగు పంచిన తల్లిదండ్రులను అక్కున చేర్చుకొని.. అన్నం పెట్టేదాకా ఆ వృద్ధులు పచ్చి మంచినీళ్లు తాగరు. గంటలు.. రోజులు.. అలాగే కూర్చొని కఠిన పాషాన హృదయాలను కూడా కరిగిస్తున్నారు. బతికిననాడు బాసటగా... పోయిననాడు ఊరటగా తోటి వృద్ధులకు అండగా నిలుస్తున్న ఈ సంఘం జనహృదయాల జేజేలు అందుకుంటున్నది. 

మౌన పోరాటం: 25 ఏండ్ల కిందట 14 మందితో ఈ సంఘం ఏర్పాటైంది. గ్రామంలో 60 ఏండ్ల పైబడిన వారంతా ఆ సంఘంలో సభ్యులు. ఒకరికి ఒకరు అండగా ఉండేందుకు ఏర్పాటై క్రమక్రమంగా వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా కన్నవారిని పట్టించుకోకుండా.. పట్టెడన్నం పెట్టకుండా అతి కర్కశంగా వ్యవహరిస్తున్న కొడుకులు.. కూతుళ్లపై మౌన పోరాటం సాగిస్తున్నది. తమ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి కేసుల సమాచారం రాగానే సభ్యులంతా ఆ ఇంటికెళ్లి మౌనదీక్ష చేస్తారు. ఆ ఇంట్లోని వాళ్లు తమ తప్పును అంగీకరించి కన్నవారిని లోపలికి పిలిచి చేరదీసేవరకు ఈ మౌన పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. వారి సంఖ్య 14 మంది సభ్యుల నుంచి ఇప్పుడు 55 మంది సభ్యులకు పెరిగింది. 

అంత్యక్రియలకు ఆసరా : 25 సంవత్సరాల కిందట కోనాపూర్‌లో కన్న పిల్లల చేత నిరాదరణకు గురైన వారే సంఘం ఏర్పాటు చేశారు. వారి చైతన్యమే ఉద్యమం దిశగా అడుగులు వేసింది. వారి మౌన పోరాటాన్ని.. పట్టుదలను చూసి పిల్లలు వాదించడం పక్కనబెట్టి ఆదరించడం నేర్చుకున్నారు. మనిషి ఎంత కాలం జీవించడమనేది ముఖ్యం కాదు. పోయిన నాడు పాడె మోసేందుకు ఆ నలుగురిని సంపాదించుకోవాలంటారు. అందుకే ఈ సంఘం ఏ వృద్ధుడు చనిపోయినా ఆ నలుగురు బాసటగా నిలుస్తున్నారు. సంఘ సభ్యులంతా ప్రతి నెలా రూ. 10 పొదుపు చేసుకుంటారు. ప్రతీ నెలా సమావేశం నిర్వహించుకొని ఆ మొత్తాన్ని ఏయే సామాజిక అంశాలకు ఖర్చు చేయాలో చర్చించుకుంటారు. తమలో ఎవరైనా చనిపోతే దాంట్లో నుంచే అంత్యక్రియలకు ఖర్చు చేస్తారు. 

ఆసరా ఫించన్లతో భరోసా: కేవలం వారి సమస్యలకే కాదు. ఊరిని పరిరక్షించేందుకు కూడా ముందుంటున్నారు. అధికారులు కూడా గ్రామ ప్రణాళికలో వృద్ధుల సలహాలను తీసుకుంటున్నారు. ఈ సంఘం కార్యకలాపాలు విస్తరించి తాజాగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడలో ఇంకో సంఘం ఏర్పాటు చేశారు. వృద్ధుల సంఘాల కార్యకలాపాలను పరిశీలించిన ఐకేపీ ప్రత్యేక దృష్టిసారించింది. వృద్ధుల సంఘానికి అండగా నిలవాలని ఆర్థిక చేయూతనందిస్తూ చిరు వ్యాపారాలు పెట్టించాలని యోచిస్తున్నారు. దీనికి తోడు వృద్ధాప్య ఫించన్ల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుండటంతో ఆర్థికంగా మనోైస్థెర్యం వచ్చిందంటున్నారు సభ్యులు. అందుకే ప్రతీ ఆర్నెళ్లకోసారి దావత్‌ కూడా చేసుకుంటున్నారు. 

మంచీచెడ్డా మాట్లాడుకుంటం: ఆశన్న 

నెలకోసారి... రెండు నెలలకోసారి కచ్చితంగా అందరం పంచాయతీ దగ్గర కల్సుకుంటాం. సాధకబాధకాలు చెప్పుకుంటం. ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు చెప్పితే ముందు ఒకసారి వాళ్లకు చెప్పుతం. మారకుంటే అందరం పోయి అక్కడే కూర్చుంటం. తల్లిదండ్రులకు తిండి పెడ్తలేరనే ముచ్చట తెలిస్తే బాధనిపిస్తది. 

మేమే పరిష్కరించుకుంటం: ప్రతాపరెడ్డి 

మాకంటే చాలా ముందు సంఘం ఏర్పాటుచేశారు. చేతకాని సమయంలో బువ్వ పెట్టకుంటే మేం అంతా కలిసి వాళ్ల ఇంటి ముందు కూసుంటం. అంతే కానీ ఎలాంటి గొడవకు దిగం. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. 


- తంగళ్లపల్లి సంపత్‌


logo