శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 21, 2020 , 08:18:20

ఒక ఆశ.. నమ్మకం.. హెచ్చరిక

ఒక ఆశ.. నమ్మకం.. హెచ్చరిక

నిర్భయ దోషుల ఉరితో.. ప్రజల్లో  ధైర్యం ఏర్పడింది. పోరాడితే.. న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగింది. మనిషి మృగంగా మారితే .. సమాజంతో  ఛీత్కారమూ తప్పదని తెలిసిపోయింది. ఇకనైనా మారతారా? స్త్రీని పూజించే ఈ దేశాన్ని.. భయ భారతం కాకుండా..నిర్భయ భారతంగా మారుస్తారా? నువ్వు.. నేను.. మీరూ.. మనమూ..  అలుపులేని ఆశాదేవి ఒంటరి పోరాటం నుంచి ఓ పాఠం నేర్చుకుందాం. ‘నిర్భయ’కు న్యాయం చేసేందుకు ‘క్రిమినల్‌' మైండ్‌ల ఎత్తుకు పైఎత్తులను చిత్తు చేసిన న్యాయవాది సీమా సమృద్ధి నుంచి మరో పాఠం నేర్చుకుందాం. దేశంలోని ఆడబిడ్డలందరి కోసమూ పోరాడుతున్న  ఇలాంటి వారందరితో భాగస్వాములం అవుదాం. మృగాళ్లకు గుణపాఠం చెబుదాం. ఈ ఉరి ...నెరవేరిన ఒక ఆశ, పెరిగిన ఒక నమ్మకం, మృగాళ్లకో హెచ్చరిక. 

అలుపులేని ఒంటరి పోరాటం

ఆమెది ఏడేండ్ల నిరీక్షణ. ఇనేండ్లుగా ఏడ్చీ ఏడ్చీ బండరాయిలా మారినా ... న్యాయం జరుగుతుందనే ఆశతో ముందుకు సాగింది ఆశాదేవి జీవితం. నిజంగా ఆమె ధైర్యానికి మొక్కొచ్చు. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై పోరాడి గెలిచింది. అత్యంత దారుణ పరిస్థితుల్లో కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూసిన ఆ తల్లి నిజంగా రోజూ చస్తూ బతికిందనే చెప్పొచ్చు. ఆమె.. తన భర్త ... కాళ్లరిగేలా తిరిగారు. కేసు వాయిదా పడిన ప్రతీసారి నిస్సహాయుల్లా ఏడ్చారు. న్యాయం జరగదేమో అని భయపడ్డారు. అయినా తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. 2012 డిసెంబర్‌ 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు ‘ఇప్పుడే వసా’్త అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి.. సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్‌లో రక్తపు మడుగులో పడివున్న కూతురిని చూసి కుప్పకూలిపోయింది. దుఃఖం తన్నుకొస్తున్నా బాధను అదిమిపట్టుకొని ‘ఏమీ కాదులే’ అని తాను ధైర్యం తెచ్చుకొని కూతురుకీ ధైర్యం చెప్పింది. నిర్భయకు వైద్యం అందించిన డాక్టర్‌.. ‘20 ఏండ్ల సర్వీస్‌లో ఇలాంటి కేసు చూడలేదు’ అని చెప్పినప్పుడు.. కళ్లెదుటే కూతురు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు... చూసి తల్లడిల్లిపోయింది.


బతికించుకోవాలి అన్న బలమైన ఆకాంక్షతో 13 రోజులు బిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంది. కానీ డిసెంబర్‌ 29న తన ఆశ.. అడియాస అయింది. నిర్భయ ప్రాణాలు విడిచింది. ఇక , తనే పోరాటం ప్రారంభించింది. విచారణ పేరిట ‘మీ కుమార్తెకు అన్యాయం జరిగిన తీరును చెప్పండి’ అంటూ వేసిన ప్రశ్నలే వేస్తుంటే ‘అత్యాచారం ఒక్కసారే జరగదు. పదేపదే జరుగుతుంది. సమాజంలో.. ఇళ్లలో.. విచారణ సమయంలో జరుగుతూనే ఉంటుంది. ‘పదే పదే మేము మా కుమార్తెకు ఏం జరిగిందో ప్రతీచోటా నిరూపించాల్సి వచ్చేది’ అని ఏడుస్తూ చెప్పింది ఆశ. ఇంతకాలం బంధువుల ఇండ్లలో జరిగే కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. ఆమెక్కావాల్సింది ఈ కార్యక్రమాలు.. కార్యాలు కాదు. దోషులకు శిక్షపడాలి. ‘నా బిడ్డ చనిపోయినప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఎవడు బెదిరిస్తే బెదిరేది ఏముంది?’ అన్నారు. 

కేసు తరుచూ వాయిదా పడుతుంటే చూసి భరించలేక.. న్యాయం జరగదేమో అనే ఆందోళనతో పాఠియాలా కోర్టు సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చారు. దోషులతో బిగ్‌ ఫైట్‌ చేశారు. దోషుల్లో ఒకడు.. మానవహక్కుల ప్రకారం తనకు క్షమాభిక్ష పెట్టాలని వేడుకున్నప్పుడు.. ‘నా కూతురు పేగుల్ని బయటకు లాగినప్పుడు నీకు మానవ హక్కులు గుర్తుకురాలేదా?’ అంటూ కరాఖండిగా తన గొంతును వినిపిస్తూ.. ఎక్కడా పట్టు వదలకుండా ఆశతో ఆశయం కోసం అలుపు లేకుండా ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడింది. ఆశాదేవి సంతోషించారు. ‘మా అమ్మాయి ఇప్పుడు లేదు. తిరిగి రాదు కూడా. ఇది నా కుమార్తె కోసమే చేశాను. కానీ ఇప్పుడు తనలాంటి ఇంకెందరో కుమార్తెల నా పోరాటాన్ని కోసం కొనసాగిస్తాను’ అని తన పటిమను చాటిచెప్పారు. 


ఎత్తుగడలు చిత్తు చేస్తూ..

‘క్రిమినల్‌'మైండ్‌ 

V/S 

‘స్టూడెంట్‌' బ్రెయిన్‌


ఒకవైపు పేరుమోసిన క్రిమినల్‌ లాయర్‌ ఏపీ సింగ్‌. మరోవైపు అప్పుడే న్యాయవాద వృత్తిని ప్రారంభించిన సీమా సమృద్ధి కుష్వాహ. ఆ క్రిమినల్‌ లాయర్‌ అనుభవమంత లేదు ఆమె వయసు. వీరిద్దరూ వాదించింది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు. ఆయన వాదించిన వందల కేసుల్లో నిర్భయ ఒకటి కాగా.. ఆమెకు అదే తొలి కేసు. ఏపీ సింగ్‌ది రోజుకొక వాదన.. ప్రతి హియరింగుకొక కొత్త ఎత్తుగడ. ఎంతైనా పేరుమోసిన క్రిమినల్‌ లాయర్‌ కదా.. చట్టాల్లోని లొసుగులు, లోటుపాట్లను 24 యేండ్ల నుంచి ఔపోసన పట్టాడు. ఆ అనుభవాన్ని రంగరించి తన క్లయింట్లను రక్షించుకోవడానికి, ఉరిశిక్ష పడితే బతికించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లాడు. కింది కోర్టు నుంచి హైకోర్టుకు.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. సుప్రీం నుంచి రాష్ట్రపతి క్షమాభిక్షకు.. చివరకు అంతర్జాతీయ న్యాయస్థానానికి. 

అయినా అతని ఎత్తుగడలు చిత్తయ్యాయి. కారణం.. సీమా దగ్గర క్రిమినల్‌ లాయర్‌ మైండ్‌బ్లాంక్‌  చేసే ఆధారాలు ఉండటమే. కేసు హియరింగ్‌కు వచ్చిన ప్రతివాదనలోనూ ‘ఐ అబ్జక్ట్‌ మైలార్డ్‌' అంటూ అడ్డం తిరిగినా.. న్యాయదేవత కళ్లుగప్పే ప్రయత్నం చేసినా.. తన పదునైన బుర్రతో  ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేసింది సీమా. ఏపీ సింగ్‌ కింది కోర్టునుంచి అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా.. సీమా సమృద్ధి తన వృత్తికి గౌరవం ఇచ్చి సహనం వహించింది. ఎందుకంటే ‘చట్టం పరిధిలో ప్రతి ఒక్కరూ సమానమే. వెయ్యిమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనేది మన రాజ్యాంగ ప్రాథమిక సూత్రం. అందుకే  ఏడేండ్లు నిరీక్షించింది. నిర్భయ తల్లికి పోరాటంలో సహాయ సహకారాలు అందిస్తూ.. ఆత్మైస్థెర్యం నింపింది. చివరికి సుప్రీం కోర్టు సాక్షిగా విజయబావుటా ఎగురవేసింది సీమా.

నిందితుల తరఫున వాదిస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ క్రిమినల్‌ లాయర్‌ అజయ్‌ ప్రకాశ్‌ సింగ్‌ (ఏపీ సింగ్‌). ఈయన క్రిమినాలజీలోనే జూరీస్‌ డాక్టరేట్‌ పొందాడు. ఈ క్రమంలో తన ఆశయాన్ని పక్కనపెట్టి నిర్భయ కేసును వాదించేందుకు ముందుకొచ్చింది సీమా సమృద్ధి.

ఎవరీ సీమా సమృద్ధి?: ఢిల్లీకి చెందిన సీమా సమృద్ధి కుష్వాహ ఓ న్యాయవిద్యార్థిని. ఢిల్లీ యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఐఏఎస్‌ కావాలనేది ఆమె కల. దానిని సాధించుకోవడానికి ఒకవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమవుతున్నది. ఈ తరుణంలోనే నిర్భయ ఘటన జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాటియాల కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఈ కేసు రావడంతో.. వాదించేందుకు కొందరు సీనియర్‌ లాయర్లు సైతం జడిసిపోయారు. కారణం నిందితుల తరఫున వాదిస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ క్రిమినల్‌ లాయర్‌ అజయ్‌ ప్రకాశ్‌ సింగ్‌ (ఏపీ సింగ్‌). ఈయన క్రిమినాలజీలోనే జూరీస్‌ డాక్టరేట్‌ పొందాడు. 

ఈ క్రమంలో తన ఆశయాన్ని పక్కనపెట్టి నిర్భయ కేసును వాదించేందుకు ముందుకొచ్చింది సీమా సమృద్ధి. చదువుల్లో చురుకైన విద్యార్థినిగా పేరుతెచ్చుకున్న సీమా.. ఈ కేసులో తన గెలుపుకంటే మృగాళ్లకు బలైన ఓ ఆడబిడ్డను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అలా.. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సాంకేతికంగా, పక్కాగా సేకరించి 2014 జనవరి నుంచి నిర్భయ కేసును టేకప్‌ చేసింది. దీంతో తన అపోజిషన్‌ క్రిమినల్‌ లాయర్‌ ఎన్ని ఎత్తుగడులు వేసినా.. నిశ్చింతగా, ధైర్యంతో వ్యవహరించింది సీమా. అలా తొలి కేసులోనే విజయం సాధించింది. ‘నిర్భయజ్యోతి ట్రస్ట్‌'కు లీగల్‌ అడ్వైజర్‌గాను ఉంది.

సత్వర న్యాయం కావాలి

శిక్ష అమలు చేయడానికి ఇన్నేండ్లు పట్టింది. ఇటువంటి కేసుల్లో దోషులకు సత్వరమే శిక్షపడేలా చేయాలి. ఎన్నిరకాల చట్టాలు వచ్చినా ఇటువంటి అఘాయిత్యాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. చట్టాల్లో ఎటువంటి లొసుగులూ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. తక్కువ సమయంలో న్యాయం జరగాలి. దిశ కేసులో దోషులకు తక్కువ సమయంలోనే శిక్ష పడింది. అయినా అటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు సత్వరమే శిక్ష పడేలా చేయాలి. మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన పెంచాలి.

-జి. వరలక్ష్మి, హెవన్‌ హోమ్స్‌, సొసైటీ అధ్యక్షురాలు                                                                  

ఇదొక హెచ్చరికా సంకేతం

ప్రజల్లో ... మహిళలకు సరైన రక్షణ చట్టాలు లేవని, ఎంతటి హత్యలు జరుగుతున్నాకానీ మహిళలకు న్యాయం జరగడంలేదని ఒక అపోహ ఉండేది. అలాంటి ఆలోచన నుండి దూరం కావడానికి ఇదొక మంచి తీర్పు. మహిళల పట్ల ఎవరు చెడుగా ప్రవర్తించినా ఉరిశిక్ష తప్పదన్న సంకేతాలు దీనివల్ల ప్రజల్లోకి వెళతాయి. న్యాయస్థానాల మీదా చాలామందికి అవగాహన ఉండదు. దీంతో న్యాయం జరగడానికి ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి లీగల్‌గా అన్ని ప్రాసెస్‌లు పూర్తి కావాలంటే కొంతసమయం పడుతుంది. కాకపోతే సంవత్సరాల తరపడి జరగకుండా త్వరగా కేసులు పూర్తయితే మహిళల్లో మరింత ధైర్యం పెరుగుతుంది.

-వెగ్గళం మాధవి, అడ్వకేట్‌, బైంసా

నమ్మకం పెరిగింది!

కొంచెం ఆలస్యంగానైనా నిర్భయ నేరస్థులను ఉరితీయడంతో మన న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత బలపడింది. వారిని ఉరి తీయడంతోనే నిర్భయ తల్లిదండ్రుల బాధ తీరిపోదు.. అలాగని నిర్భయ తిరిగిరాదు. ఆడపిల్ల జోలికి వస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని తెలుసుకోవాలి. తప్పుడు ఆలోచన చేసేముందు కన్నతల్లిని, చెల్లిని, మన ఇంటి ఆడవాళ్లను గుర్తుకు తెచ్చుకుంటే.. తప్పు చేయలేరు. ఘటన జరిగిన నాటి నుంచి నేటివరకూ.. ఏడేండ్లకుపైగా ధైర్యంగా పోరాడిన వారందరికీ బిగ్‌ థ్యాంక్స్‌.. జైహింద్‌.

- రాశీఖన్నా, సినీనటి


logo