శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 18, 2020 , 22:42:52

ఈమె భయాన్ని జయించింది

ఈమె భయాన్ని జయించింది

2013 మార్చి, బాలానగర్‌, హైదరాబాద్‌ మధ్యాహ్నం కావొస్తున్నది. బాలానగర్‌లో ఎప్పటిలాగే పరిగెడుతున్న ట్రాఫిక్‌. ఓ వీధిలో నుంచి రోడ్డు మీదికి ఎక్కిందో బైక్‌. ఆ బైక్‌ వెనకాల కూర్చొనుంది 20 ఏండ్ల టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యవేణి. బైక్‌ నడుపుతున్నది ఆమె సోదరుడే. కొద్దిసేపట్లో, ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన టోర్నమెంట్‌కు వెళ్తున్నది సత్యవేణి. చిన్నప్పటి నుంచీ టెన్నిసే ప్రపంచంగా పెరిగిన యువతి ఆమె . స్పోర్ట్స్‌ కోటాలోనే కాలేజీ సీటు సాధించింది.  జాతీయ స్థాయిలో  15వ ర్యాంక్‌ కలిగిన  ప్లేయర్‌ కూడా. ఆమె ఆ రోజు ఎంతో ఆత్మవిశ్వాసంతో టెన్నిస్‌ పోటీలకు బయల్దేరింది. ఏ ప్రమాదమూ జరగకపోతే సమయానికి అక్కడికి చేరుకొనేదే. టోర్నమెంట్‌లో పాల్గొనేదే.. కానీ అలా జరగలేదు!

కొన్ని నెలల తర్వాత 

సత్యవేణి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు ఎల్బీ స్టేడియానికి వెళ్తున్నప్పుడు వేసుకున్న స్పోర్ట్స్‌ షూస్‌ ఆమె ఎదురుగా పడి ఉన్నాయి. విషాదం నిండిన ముఖం. సర్వస్వం కోల్పోయిన దు:ఖం. ఆమె ఎవరితో మాట్లాడడం లేదు. షూస్‌ వైపే చూస్తూ ఏడుస్తున్నది. మరుక్షణం ఆవేశంగా తీసి విసిరికొట్టింది. ముఖాన్ని దాచుకుంది. అరుస్తున్నది. తల్లి ఆమె దగ్గరకు వచ్చింది. ఎంత చెప్పినా సత్యవేణి వినిపించుకోవడం లేదు. రోజులు గడుస్తున్నాయి. సత్యవేణి గది నుంచి బయటకు రావడం లేదు. టెన్నీస్‌కు పూర్తిగా దూరమయ్యాననే తీవ్రమైన డిప్రెషన్‌తో తనను తాను నిర్బంధించుకుంది. బైక్‌ ప్రయాణం ఫోబియాగా మారిపోయిందామెకు. ఆ రోజు టెన్నిస్‌ టోర్నమెంట్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం  ఈ విషాదంలోకి నెట్టివేసింది.  ఆ ప్రమాదంలో సత్యవేణి మోకాలి ఎముకను కోల్పోయింది. కానీ టెన్నిస్‌ మీద ప్రేమను మాత్రం కాదు.. 


సర్జరీ తర్వాత సత్యవేణి మళ్లీ టెన్నిస్‌ కోర్టులో అడుగు పెట్టింది. ఎక్కువ రోజులు ఆటకు దూరం ఉండడంతో ఆమె ర్యాంక్‌ పడిపోయింది. అయినా పట్టుదలతో మళ్లీ మంచి ర్యాంకు సాధించింది.  ఐదారు నెలలు గడిచాయి. అంతా బాగుందనే అనుకుంది. కానీ మోకాలిలో నొప్పి మొదలైంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సర్జరీ వికటించిందని చెప్పారు. రెండో సర్జరీతో నయం అవుతందనీ.. కానీ జాగ్రత్తలు అవసరమన్నారు.  ఆ సర్జరీ తర్వాత కూడా  టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టింది. ఆయినా ఏదో ఫీలింగ్‌ వెంటాడింది. ‘ఈ సర్జరీతో ఆమె ఎక్కువ కాలం టెన్నిస్‌ ఆడలేదు. ఎప్పుడో ఒకసారి నొప్పి భరించలేక ముగింపు ఇవ్వాల్సిందే’ అని డాక్టర్లు చెప్పారు.  ఈ విషయం ఆమెను తీవ్రంగా బాధించింది. కొద్ది రోజుల్లోనే టెన్నిస్‌ నుంచి అతికష్టంగా తప్పుకుంది.   డిప్రెషన్‌కు గురైంది. ప్రమాదాన్ని తలుచుకుంటూ  బైక్‌ అంటేనే వణికిపోయే స్థాయికి వెళ్లింది. కానీ ఇప్పుడామె ప్రొఫెషనల్‌ బైక్‌ రైడర్‌, ట్రెయినర్‌, బైక్‌ పెయింటర్‌. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీతో కలిసి పని చేస్తున్నది. అవును! ‘ఆమె భయాన్ని జయించింది’..

సత్యవేణి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న సమయం. తల్లి తన బిడ్డను అలా ఎంతోకాలం చూస్తూ ఉండదలుచుకోలేదు. జీవితాన్ని గెలవాలంటే ముందు భయాన్ని జయించాలి.. సత్యవేణికి బైక్‌ అంటే భయం. దాన్ని పోగ్గొట్టాలని నిర్ణయించుకుంది తల్లి.  కూతురి కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండి కొనుక్కొచ్చింది. దాన్ని తీసుకెళ్లి నేర్పించాలన్నది ఆమె ఆలోచన. మొదట్లో సత్యవేణి సహకరించేది కాదు. ‘ఇంట్లోనుంచి వెళ్లిపో, బైక్‌ నేర్చుకుంటేనే ఇంటికి రా’ అని తల్లి కాస్త కటువుగానే చెప్పింది. దీంతో చేసేదేమీ లేక సోదరుని సాయంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నడపడం నేర్చుకుంది. కొద్ది రోజులకే రైడింగ్‌ మీద ఆసక్తి పెరిగింది. బైక్‌ అంటే భయం పోయింది. మళ్లీ సాధారణ మనిషి అయింది. అంతలోపే మనసు కళలవైపు లాగింది.  చిన్నప్పుడు  వేసిన పెయింటింగ్స్‌ గుర్తుకు వచ్చాయి. ఇంకేముంది బైక్‌, పెయింటింగ్స్‌ కలిపి కొట్టింది. ఓ వెలుగు రేఖ స్పష్టంగా కనిపించింది... సత్యవేణికి.


సత్యవేణి సోదరి సంగీత. యానిమేషన్‌లో నిపుణురాలు. ఆమె సాయంతో  పెయింటింగ్‌ ప్రారంభించింది. ముఖ్యంగా సంగీత  డిజైన్లను బైకు, హెల్మెట్స్‌ మీద త్రీడీ  సత్యవేణి పెయింటింగ్స్‌ వేసింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కొద్ది రోజుల్లోనే పాపులర్‌ అయ్యాయి. బైక్‌ ప్రేమికులు సత్యవేణిని సంప్రదించారు. అప్పుడే దీన్ని చిన్న వ్యాపారంగా మల్చుకోవాలనే ఆలోచన కలిగింది. Womeneoteric customs ప్రారంభించింది.  దేశవ్యాప్తంగా ఈ పెయింటింగ్స్‌ పాపులర్‌ అయ్యాయి.  ఆమె క్రియేటివిటీ  పెద్ద కంపెనీలకూ తాకింది. వరల్డ్‌ ఎగ్జిబిషన్లలో సత్యవేణి బైక్‌, హెల్మెట్‌ పెయింటింగ్స్‌ ప్రదర్శనకు నిలిచాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ   ఈమెను సంప్రదించింది. తమ బైక్స్‌పైనా ఈ పెయింటింగ్స్‌ వేయాలని కోరింది. ప్రస్తుతం ఆ పనిని కూడా సత్యవేణి చేస్తున్నది. ముఖ్యంగా లైవ్‌ పెయింటింగ్‌లో ఆమెది అందె వేసిన చేయి. ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడి వాతావరణాన్ని అచ్చంగా బైక్‌పై వేయడంలో ఆమెది అరుదైన శైలి. దేశంలోని పలు ప్రదేశాల నుంచి బైక్‌ ప్రియులు హెల్మెట్లను, పెట్రోల్‌ ట్యాంకులను సత్యవేణి చిరునామాకు కోరియర్‌ ద్వారా పంపుతారు. కస్టమర్‌ ఆలోచనకు తగ్గ పెయింటింగ్‌  వేస్తుంది. ఇప్పటి వరకూ సత్యవేణి మూడువందలకు పైగా హెల్మెట్స్‌, బైక్స్‌పై పెయింటింగ్స్‌ పూర్తి చేసింది.

ఆ రోజు ఏం జరిగింది?

సత్యవేణి   జీవితం మారిపోవడానికి కారణం ఓ రోడ్డు ప్రమాదం.   సోదరునితో కలిసి వెళ్తున్న బైక్‌ ప్రమాదానికి గురైంది. దీనికి ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణం. ఎవరో అతను. పూర్తిగా మద్యం తాగి స్కూటర్‌ను రోడ్డు మీద పార్క్‌ చేశాడు. దాని పక్కనే  తూలుతూ నిలబడ్డాడు. అటుగా బైక్‌మీద వస్తున్న  సత్యవేణి, సోదరుడు దాన్ని హఠాత్తుగా గమనించాడు. బైక్‌ను నియంత్రించడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. ఎదురుగా ఉన్న స్కూటర్‌ను ఢీ కొట్టి అదుపుతప్పింది వీళ్ల  బండి. సత్యవేణి మోకాలికి బలమైన దెబ్బ తగిలింది.  సమస్య శ్రస్తచికిత్స వరకూ వెళ్లింది. మద్యం తాగిన  ఆ వ్యక్తి రోడ్డు మీద లేకపోయినా, అతను స్కూటర్‌ను  నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టకపోయినా ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు. అనుకున్నట్టుగానే  సత్యవేణి  టెన్నిస్‌ టోర్నమెంట్‌కు హజరై ఉండేది.  పతకాల పంట పండించేది. అయినా ఏదైతేనేం.. ఆమె భయాన్ని జయించింది. కొత్త జీవితానికి దారులు వెతుక్కుంది.


ఎన్జీవో..

బైక్‌ పెయింటింగ్‌లో రాణిస్తున్న సత్యవేణి తనలాంటి అమ్మాయిలకు ఆసరాగా హస్కీ కేపర్స్‌ అనే ఎన్జీవో ప్రారంభించింది. దీనిద్వారా ఆడపిల్లలకు బైక్‌ నేర్పుతుంది. సెల్ఫ్‌ డిఫెన్స్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నది. ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్న వారికి, సొంత వ్యాపార ఆలోచనలతో ఉన్న వారికి  తమ ఎన్జీవో సాయం చేస్తుందని సత్యవేణి చెప్తున్నది. 

- వినోద్‌ మామిడాల


logo