శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 15, 2020 , 22:46:16

ఒక్కోమెట్టు ఎదిగి సీఈవోగా ఒదిగి

ఒక్కోమెట్టు ఎదిగి సీఈవోగా ఒదిగి

అమెరికాలోని దిగ్గజ కంపెనీలకు పలువురు భారతీయులు రథసారథులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ- అమెరికన్‌ సోనియా సింగాల్‌ అమెరికాలో అతిపెద్ద క్లాత్‌ రిటైలర్‌ సంస్థ ‘గ్యాప్‌ ఇంక్‌'కు కొత్త సీఈవోగా నియమితులయ్యారు. వలస వచ్చిన కుటుంబాల నుంచి మహిళలు సీఈవో స్థాయికి ఎదగడం అరుదు.

ఊరు కాని ఊరు వెళితేనే అదో కష్టం. రాష్ట్రం కాని రాష్ట్రంలో కుదురుకోవడమే కష్టం. అక్కడితో ఆగకుండా.. అంతకంతకూ ఎదగడం..అక్కడున్న పోటీని అధిగమించి.. అందరిలో తాను ప్రత్యేకంగా నిలవడం అషామాషీ వ్యవహారం కాదు. ఇవే పెద్ద సమస్యలనుకుంటే.. దేశం కాని దేశం వెళ్లడం.. అక్కడ తన సత్తా చూపడం.. ప్రపంచవ్యాప్తంగా ఉండే పోటీని తట్టుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవడం చాలా కష్టమే కాక.. క్లిష్టమైంది కూడా. తాజాగా అలాంటి గెలుపునే సొంతం చేసుకున్నారు భారత మూలాలు ఉన్న సోనియా సింగాల్‌. 49 ఏళ్ల ఈ మహిళ ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ ‘గ్యాప్‌ ఇంక్‌'కి మహిళా సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్నది ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గ్యాప్‌ ఇంక్‌'. దీని సీఈవోనే సోనియా సింగాల్‌. పలు అంతర్జాతీయ సంస్థలలో పనిచేసిన అనుభవం ఉన్న సోనియా ‘సక్సెస్‌మంత్ర’ ఇది.


భారత్‌లో పుట్టి అమెరికాకు వెళ్లి

ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. అందులోనూ వలస వచ్చిన కుటుంబాల నుంచి మహిళలు సీఈవో స్థాయికి ఎదగడం అరుదు. భారత్‌లో పుట్టిన సోనియా కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సోనియా కెట్టరింగ్‌ వర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్స్‌ఫోర్డ్‌ వర్సిటీ నుంచి మాస్టర్స్‌ ఇన్‌ మానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ చేశారు.


ఇంద్రనూయి తర్వాత 

పెప్సీకో సీఈవో ఇంద్ర నూయీ తర్వాత అంతటి ఘనతను సోనియా సాధించారు. ఒకరకంగా భారత సంతతి అమెరికన్‌ మహిళల్లోనే అత్యున్నత హోదా సాధించిన మహిళగా సోనియా సింగాల్‌ నిలిచారు. ఇంద్రనూయి తర్వాత.. ఆమెను గుర్తుకు తెచ్చే ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఫార్చూన్‌ 500 కంపెనీలుగా పిలిచే అగ్రసంస్థల్లో ‘గాప్‌ ఇంక్‌' ఒకటి. ఈ సంస్థ ప్రస్తుతం186వ స్థానంలో ఉండడం విశేషం. బ్రాండింగ్‌ దుస్తులను తయారు చేసే ఆ కంపెనీ ఆదాయం ఏడాదికి 18 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. అమెరికాతో సహా పలు దేశాల్లో 3727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో మొత్తంగా 1.35 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


అంతకుముందు

సింగాల్‌ 2004లో గ్యాప్‌ ఇంక్‌లో చేరడానికి ముందు అనేక ఫార్చ్యూన్‌- 500 కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వీటిలో మైక్రో సిస్టమ్స్‌, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీలు ఉన్నాయి. అక్కడ సుమారు 15 ఏళ్లపాటు ఆమె పనిచేశారు. గాప్‌ ఇంక్‌లోని ఓల్‌ నేవీ సీఈవోగా, గ్యాప్‌ ఇంక్‌ యూరప్‌ ఎండీగా కూడా ఉన్నారు. పలు సంస్థల్లో పనిచేసిన సోనియా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ.. ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఆమె సన్‌ మైక్రోసిస్టమ్స్‌, ఫోర్డ్‌ మోటార్‌లో ఆమె ఉత్పత్తి రూపకల్పన, నాణ్యత, తయారీ ఇంజినీరింగ్‌ పాత్రలు పోషించింది.


మహిళలు తక్కువే

ఫార్చ్యూన్‌- 500 కంపెనీల్లో మహిళల సంఖ్య 33కు చేరినప్పటికీ, వీరిలో 6 శాతం మాత్రమే మహిళా సీఈవోలు. వీరిలో జనరల్‌ మోటర్స్‌ సీఈవో మేరీ బార్రా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఐబీఎం చీఫ్‌ గిన్ని రోమెట్టి కొద్దిరోజుల క్రితం తన బాధ్యతల నుంచి తప్పుకుని ఇండో అమెరికాన్‌ అరవింద్‌ కృష్ణకు పగ్గాలు అప్పగించారు. అడోబ్‌, వీవర్క్‌, మాస్టర్‌ కార్డ్‌, మైక్రాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి గ్లోబల్‌ కంపెనీలకు భారతీయ సంతతికి చెందిన రెండు డజన్ల మంది సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి 5 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే ఈ కంపెనీలకు సీఈవోలుగా ఉన్న వారిలో పురుషులే ఎక్కువ. తాజాగా సోనియా సింగాల్‌ నియామకం ద్వారా తోటి మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకంగా మారారు. స్త్రీ, పురుషుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ మార్పుల నుంచి ప్రపంచం ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది.  


సోనియా పూర్వపు వ్యవస్థాపక సభ్యుడైన తాత్కాలిక చీఫ్‌ రాబర్ట్‌ ఫిషర్‌ స్థానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆయన కంపెనీ బోర్డు ఛైర్మన్‌ పదవి నుండి కూడా తప్పుకొన్నారు. ఆమెకు ఈ ఉద్యోగానికి వార్షిక మూల వేతనం 3 1.3 మిలియన్లు అందుకోనున్నది. సోనియా నియామకం మార్చి 23 నుండి అమలులోకి వస్తుంది. సీఈఓగా నియమితులైన తర్వాత ఆమె మాట్లాడుతూ, ‘ఈ సంస్థ గొప్ప వారసత్వాన్ని పెంపొందించడం భవిష్యత్తులో విజయవంతంగా పోటీ పడటానికి మా వ్యాపారం, కార్యకలాపాలను మార్చడంలో మా 130,000 మంది ఉద్యోగులను నడిపించడం గౌరవంగా ఉంది’ అన్నారు. ఆమె గాప్‌లో చేరడం ద్వారా దేశంలోని యూత్‌కు.. ఐకాన్‌గా నిలుస్తారనడంలో సందేహం లేదు.


సామర్థ్యానికి ప్రాధాన్యం

‘మా బ్రాండ్ల పట్ల మిలియన్ల మంది కస్టమర్లు కలిగి ఉన్న ప్రేమను బలోపేతం చేయడంపై దృష్టి సారించి, మా పోర్ట్‌పోలియో సామర్థ్యాన్ని, మా సైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయోజనాలన్నింటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. దానికోసం మేము చొరవలు, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇస్తాం’ అని అంటారు సోనియా. 


logo