శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 15, 2020 , 22:44:47

‘మనసున్న హైదరాబాదీ’ రచన

‘మనసున్న హైదరాబాదీ’ రచన

హైదరాబాద్‌.. సర్వమత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ఓ నిదర్శనం. అందుకే ఇదొక మినీ ఇండియా. ఇక్కడ అన్ని ప్రాంతాల వ్యక్తులకు ఆశ్రయం ఉంటుంది. మనసుపెట్టి వెతకాలే కానీ.. టన్నుల కొద్దీ మంచితనం కూడా దొరుకుతుంది. అందుకే మనది గ్రేట్‌ హైదరాబాద్‌.అలాంటి మన భాగ్యనగరంలో సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అయిన కొంతమంది జీవిత కథలను ఓ పుస్తకంగా మలిచింది తుమ్మల రచనా చౌదరి.

హైదరాబాద్‌ మహానగరంలో ఆదర్శవంతమైన జీవిత కథలకు కొదువేలేదు. ఇక్కడ ఎవ్వరిని కదిపినా.. వారి నుంచి ఒక్కోకథను వెలికితీయవచ్చు. అలాంటి ప్రయత్నమే చేసింది హైదరాబాద్‌కు చెందిన తుమ్మల రచనా చౌదరి. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ అయిన వ్యక్తులు.. కొందరి జీవితగాథలను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' పేరుతో ఓ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రచన. ఈ పుస్తకంలో నాటి తెలంగాణ ఉద్యమం నుంచి.. యుద్ధంలో భర్తను కోల్పోయిన తర్వాత ఇటీవల ఆర్మీలో అధికారిణిగా చేరిన సైనికురాలి వరకూ 40 స్ఫూర్తివంతమైన గాథలున్నాయి. 2019 అక్టోబర్‌లో కార్యరూపం దాల్చిన ఆలోచన.. 2020లో పుస్తకరూపంలోకి వచ్చింది.


100 కాపీలు మాత్రమే...

ఇంతమంచి కాన్పెప్ట్‌తో ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' పుస్తకాన్ని వెలువరించిన రచన.. కేవలం వంద కాపీలు మాత్రమే ముద్రించింది. ఎందుకంటే ఈ పుస్తకం సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఉండాలనేది ఆమె కోరిక. అందుకోసమే వంద పుస్తకాలను మాత్రమే ముద్రించారు. అవి కూడా చాలా ప్రముఖమైన 100మంది వ్యక్తులకు మాత్రమే అందజేస్తున్నది రచన. ఈ పుస్తకానికి విలువైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నది రచనా తుమ్మల. ఇటీవల ఓ సందర్భంలో తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌కు ఈ పుస్తకాన్ని అందించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకూ అందించారు. నిజమైన ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌'ను వెతికేందుకు ఐదుగురు సభ్యుల బృందం నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించింది. 40 కథల కోసం అబిడ్స్‌ నుంచి బంజారాహిల్స్‌ వరకు, ఏఎస్‌రావు నగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ప్రతి వీధిని జల్లెడ పట్టారు.


త్వరలో చెన్నై హ్యూమన్స్‌.. 

హైదరాబాద్‌ హ్యూమన్స్‌ అందించిన స్ఫూర్తితో ఇప్పటికే  ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ చెన్నై’ పుస్తకాన్ని రచించే పనిలో నిమగ్నమమైంది రచనా బృందం. ఆ తర్వాత ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ గోవా’ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ ఢిల్లీ’ పేరుతో కూడా పుస్తకాలు విడుదల చేయనున్నట్లు చెబుతున్నది రచన. అక్కడ కూడా సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అయిన వ్యక్తుల జీవిత గాథలకు పుస్తకరూపం ఇవ్వనున్నారు రచనా బృందం. హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పుస్తకంలో ఒకటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ పేజీ కాగా.. మరొకటి రంగులతో నిండిన పేజీ. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వారి గతజీవితం.. కలర్‌పేజీలో వారి విజయ ప్రస్థానం ఉండేలా డిజైన్‌ చేశారు రచనా బృందం.


మరికొన్ని కార్యక్రమాలు..

వచ్చేనెలలో హైదరాబాద్‌ వేదికగా మరికొన్ని ఉత్తేజకరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది రచన. వాటిల్లో ఒకటి ‘పొయెట్రీ నైట్‌'. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని కవితా సృజనాత్మకతను వెలికితీయాలనేది ఆమె ఉద్దేశం. ఇక్కడ అలాంటి ప్రతిభకు కొదువలేదు. కానీ రచయితలకు సరైన వేదిక దొరకడం లేదు. అలాంటి వారి ప్రతిభను వెలికితీసేందుకు పొయెట్రీనైట్‌ను ఏర్పాటు చేయనున్నది రచన. తాజాగా ఫిల్మ్‌నగర్‌లోని అరమోలాలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ‘స్టాండప్‌ కామెడీ నైట్‌'ను కూడా నిర్వహించాలని తలచింది రచనా. ఇలా హైదరాబాద్‌లోని విభిన్న కళలు, చరిత్ర, వారసత్వాన్ని తనవంతుగా ప్రపంచానికి తెలియజేయాలని పరితపిస్తున్నది రచనా చౌదరి. 


logo