ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 13, 2020 , 23:21:56

అంతిమ సేవల్లో ఆమె

అంతిమ సేవల్లో ఆమె

‘ఆడవాళ్లు దహన సంస్కారాలు చేస్తారా? సిగ్గు లేదా? ఇంకా బతికే ఉన్నావ్‌? కట్టుబాట్లు, నిబంధనలు, అన్నీ గంగలో కలిసినయ్‌. ఇంకా బతికి లాభమేంటి? ఈ క్షణం నుంచే మీ కుటుంబాన్ని సంఘం నుంచి బహిష్కరిస్తున్నాం’ అంటూ కులపెద్దల తీర్మానం. ఆ తర్వాత కొన్ని రోజులు బాధ పడ్డారామె. కానీ బాధపడుతూ కూర్చుంటే వచ్చేదేం లేదని తెలుసుకున్నారు! అంతకు మించి సేవ చేయాలకున్నారు. ఏండ్లు గడిచాయి. ఎవరైతే తిట్టారో వారే ప్రస్తుతం ఆమెను ప్రశంసిస్తున్నారు.

అది 2018. గాంధీ దవాఖాన. ఓ మహిళ గేటు వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది. అది అక్కడ సాధారణం.. అందరూ చూస్తున్నారు. వెళ్లిపోతున్నారు. కానీ ఒకామె మాత్రం దగ్గరకెళ్లి ఏడుస్తున్న మహిళను పలుకరించారు. ‘చనిపోయింది నా కూతురు. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఎక్కడికిపోవాల్నో, ఎవరిని సాయమడుగాల్నో తెల్వదు’ అని ఏడుస్తూ జవాబిచ్చిందా మాతృమూర్తి. ఆ తర్వాత చనిపోయింది హెచ్‌ఐవీ పేషెంట్‌ అని తెలుసుకున్నారామె. అయితేనేం ఆమే సగటు మనిషే కదా అంటూ.. దగ్గరుండి దహన సంస్కారాల్ని పూర్తి చేశారు. ఆమే పూర్ణశాంతి.


అనాథ శవాలున్నా..

పూర్ణశాంతి అంతిమసేవలో పాల్గొన్నారని తెలుసుకున్నారు కుల పెద్దలు. పూర్ణశాంతి కుటుంబాన్ని సంఘం నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఆమె మరింత మంది అంతిమయాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రెండు జంటనగరాల్లో ఎక్కడ అనాథ శవాలున్నా.. తమకు సమాచారం ఇవ్వాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అలా ఎవ్వరు ఫోన్‌ చేసి సమాచారమందించినా ఆమె వెళ్లి మృతుల  అంతిమసంస్కారాల్ని నిర్వహిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు 32 మంది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అనాథల అంతిమ సంస్కారాల కోసం తనను 99666 55388లో సంప్రదించాలని ఆమె కోరుతున్నారు.


ఆమె సేవలు ఇలా..

ఎర్రం పూర్ణశాంతిది హైదరాబాద్‌. బాల్యం నుంచి ఆమె తండ్రి సేవా కార్యక్రమాలు చేస్తుండగా స్ఫూర్తి పొందారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి వలంటీర్‌గా సేవలందించారు. బాబా పేరు మీద ‘శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి’ని ప్రారంభించారు. సంస్థ ప్రారంభించిన వారం రోజులకు షిర్డీ చూడని 45 మంది వృద్ధులు, నిరుపేదలను షిర్డీనాథుడి దర్శనానికి తీసుకెళ్లారు. సోషల్‌ మీడియా వేదికగా వారానికోసారి పాత బట్టల్ని సేకరించి పేదలకు పంచుతున్నారు. నగరంలోని దాదాపు 25 వృద్ధాశ్రమాలకు ఫ్రిజ్‌లు, కూలర్‌లు, మిక్సీలు, గ్రైండర్‌లు అందించారు. సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ఓ దివ్యాంగ జంటకు రూ.70 వేలు ఖర్చుతో రెండు టీ స్టాల్స్‌ పెట్టించారు. వికలాంగులకు ఆర్టిఫిషియల్‌ లెగ్స్‌, చేతికర్రలు, వీల్‌ చైర్లు అందిస్తున్నారు. పేద మహిళలకు పుస్తెమట్టెలు సైతం అందిస్తున్నారు. తెలంగాణలోని దాదాపు 15 జంటలకు సంస్థ ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. భర్త భాస్కర్‌ ఆమె చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఆర్థికంగా అండగా ఉంటూ ప్రోత్సాహాన్నందిస్తున్నారు.


మహిళలకు అండగా..

పూర్ణశాంతి తమ సేవాకార్యక్రమాలతో పాటు మహిళలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. వితంతువులకు చేయూతనిచ్చేందుకు కుట్లు, అల్లికలపై శిక్షణనిప్పిస్తున్నారు. హస్తినాపురంలో 15 మంది వితంతువులకు బ్యూటీ పార్లర్‌ ట్రైనింగ్‌ ఇప్పించారు. గోసేవ, ఇతర సేవాకార్యక్రమాలన్నింటిలో ఆమె ముందుంటున్నారు.


ప్రతి ఒక్కరిలో దేవుడ్ని చూస్తాను!

మహిళలు అంత్యక్రియల్లో పాల్గొనవద్దు అని మా కుటుంబాన్ని సంఘం నుంచి బహిష్కరించారు. కానీ అనాథల అంత్యక్రియల్లో పాల్గొనాలంటే రాసి ఉండాలి. అందుకే వాటిని దగ్గరుండి జరిపిస్తున్నా.. నేను ప్రతి ఒక్కరిలో బాబాను చూస్తాను. త్వరలో శాంతిధామం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నా. మా సేవల్ని విస్తరించే పనిలో ఉన్నాం. 

- ఎర్రం పూర్ణశాంతి, శ్రీ సాయి శాంతి సహాయ 

-సేవా సమితి అధ్యక్షురాలు


‘ఆడవాళ్లు దహన సంస్కారాల్లో పాల్గొనవద్దా? అయితే కూతుళ్లు మాత్రమే ఉన్న తల్లిదండ్రుల పరిస్థితేంటి? అన్నింటా ఆడవాళ్లపై వివక్షేనా? పంతాలు, పట్టింపులు బతికున్నంత వరకే.. చనిపోయిన మనుషుల మీద కూడా జాలి చూపరా?’ అంటూ సమాజాన్ని  ప్రశ్నిస్తున్నారు పూర్ణశాంతి.


-పడమటింటి రవికుమార్‌

-నర్రె రాజేశ్‌


logo