బుధవారం 03 జూన్ 2020
Zindagi - Mar 08, 2020 , 16:47:30

సరిలేరు మీకెవ్వరు

సరిలేరు మీకెవ్వరు

స్త్రీ.. దేవత.. అన్నప్పుడు ఆమెను ఆరాధించే గుణముండాలె. స్త్రీ.. పూజ్యనీయురాలు.. అన్నప్పుడు ఆమెను గౌరవించే మనుసుండాలె. ఈ రెండూ తెలంగాణ గడప గడపలో ఉన్నయి. స్త్రీ మూర్తులను గౌరవిస్తూ.. సత్కరిస్తూ.. సన్మానిస్తూ.. పురస్కారాలు అందజేసే ఆనవాయితీ ఇక్కడి సంస్కృతిలో ఉంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నేటి.. మేటి మహిళలను గౌరవించుకొనేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే రవీంద్రభారతి వేదికవుతున్నది. మట్టిబిడ్డలను మహిళా.. శిశుసంక్షేమాభివృద్ధి శాఖ, భాషా సాంస్కృతిక శాఖ కలిసి మట్టిలో మాణిక్యాలను, అద్భుత ఆణిముత్యాలను వెతికిపట్టుకున్నాయి. పల్లె ముచ్చట్ల ద్వారా సోషల్‌మీడియా సోయి నేర్పిన ఓ గంగవ్వ.. ఒగ్గుకథను ఒడిసిపట్టి కాలికి గజ్జె కట్టిన ఓ మల్లారి.. ఎవుసం ఆడోళ్లూ చేస్తరని బాజాప్తా చేసిచూపిన బేగరి లక్ష్మమ్మ అసొంటివారిని 20 విభాగాల్లో 30 మందిని సన్మానిస్తున్న సందర్భంగా..వాళ్ల పరిచయం.!

సోషల్‌ మీడియా 


సోషల్‌ మీడియాలో ఈవిడ ఒక సంచలనం. తెలంగాణ యాసతో అందరినీ అత్మీయంగా పలుకరించినట్లు ఉండే ఆమె మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘మై విలేజ్‌ షో’ యూట్యూబ్‌ చానెల్లో గంగవ్వ పాత్ర ద్వారా అందిరికీ పరిచయమయ్యింది. ఆమె చేసిన ప్రతి వీడియో సోషల్‌మీడియాలో సంచలనమైంది. ఆమె అందరిలో ఒకరు, సాధారణ సగటు మహిళ. ఇప్పుడు చాలామంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ తన నటనాచాతుర్యంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నది. పల్లెటూరి సంస్కృతిని తనదైన శైలిలో చాటిచెబుతూ ప్రత్యేక ముద్ర వేసింది గంగవ్వ. మల్లేశం, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నది. మరికొన్ని చిత్రాల్లో నటించనున్నది. ఎటువంటి రంగంలోనైనా రాణించాలంటే వయసుతో పనిలేదని గంగవ్వ నిరూపించింది. పైండ్లెన తర్వాత ఏమీ సాధించలేమనుకునేవాళ్లకు ఈమె ఆదర్శంగా నిలుస్తున్నది. 


జానపద కళ


సంప్రదాయ ఒగ్గుకథలో ఒగ్గు కథను ఏండ్ల తరబడి ఊపు ఊపిన ట్రెడిషనల్‌ ఫోక్‌ ఆర్టిస్ట్‌ జమ్మ మల్లారి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మల్లారి వేషధారణ చాలా భిన్నం. ఆమె అలంకరణంతా పురుషుడిలాగే ఉంటుంది. బీరప్ప ఒగ్గు కథలో మల్లారి కాలికి గజ్జె కట్టి ‘కామరాతి’ వేషం ఏస్తే ఊరు ఊరంతా జాతరయ్యేది. చిన్నప్పుడే దేవుడ్ని(అయ్యల బీరయ్య) పెండ్లి చేసుకున్న మల్లారి.. మళ్లీ పెండ్లి ఆలోచన చేయలేదు. ఏ కామరాతి ఏషమైతే కట్టి కాలు కదిలించిందో అదే పాత్రలో వాస్తవంలోనూ జీవించింది. వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి తలువాలు పోసింది మల్లారి. ఒగ్గుకథ చెప్పేందుకు మల్లారి స్టేజి మీద నిలబడితే.. కాలు కదిపేవారు కాదు జనాలు. ఆమె వయసులో చెప్పే ఒగ్గకథలకు ‘సూపర్‌స్టార్‌' అనే బిరుదు ఇచ్చారు యాచారం చుట్టుపక్కల గ్రామాలు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒగ్గుకథలు చెప్పిన మల్లారికి వయసు భారమైనా.. ఒగ్గు కథే ప్రాణంగా బతుకుతున్నది. ‘ఇల్లే గుడి.. గుడే ఇల్లు.. కళకే నా జీవితం అంకితం. కళకు నేను చేస్తున్న సేవను గుర్తించిన ప్రభుత్వానికి శనార్థులు’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది 75 యేండ్ల మల్లారి జమ్మ.


ఏవియేషన్‌


హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి పైలట్‌గా ఎదిగిన యువతి. తండ్రి బేకరీలో పనిచేస్తుంటాడు. చిన్ననాటి నుంచే పైలట్‌ కావాలనేది ఈమె కల. ఏవియేషన్‌కు సంబంధించిన ఏ వార్త కనిపించినా దాన్ని కత్త్తిరించి దాచుకునేది. స్నేహితులు, బంధువులు హేళన చేసినా ఆమె వెనకడుగు వేయలేదు. ఒకవైపు పెండ్లి చేసుకోమని ఇంట్లో బలవంతం పెట్టినా.. ఓ ముస్లిం కుటుంబం నుంచి బయటకువచ్చి తన కలను నెరవేర్చుకున్నది ఫాతిమా. శిక్షణలో భాగంగా సెస్నా 152, సెస్నా 172 ఎయిర్‌క్రాఫ్ట్‌లో 200 గంటలు విమానాన్ని నడిపింది. అందులో 120 గంటలు ఫాతిమా ఒంటరిగా విమానాన్ని నడిపింది. పెండ్లయిన తర్వాత కొన్నాళ్లు శిక్షణకు దూరంగా ఉండి.. మళ్లీ ఫ్లైట్‌ ఎక్కింది ఫాతిమా. తెలంగాణ ప్రభుత్వ సాయంతో న్యూజిలాండ్‌లో 62 గంటలపాటు ట్రైనింగ్‌ మోషన్‌లో విమానాన్ని నడపడం, 52 గంటల పాటు మల్టీ ఫంక్షన్‌ ఫ్లయింగ్‌ వంటివి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇక వెనుతిరిగింది లేదు. పైలట్‌ కావాలన్న ఫాతిమా కల నెరవేరింది. ‘నా కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వానికి థ్యాంక్స్‌. ఈ వార్త వినగానే గగనంలో విహరిస్తున్నంత ఆనందంగా ఉంది’ అని ఫాతిమా అన్నది.  


క్లాసికల్‌ డ్యాన్స్‌ 


డాక్టర్‌ వంగీపురం నీరజాదేవి ప్రముఖ నృత్యకారిణి. కూచిపూడి నృత్యంతో ప్రసిద్ధి చెందారు. స్వదేశీ కళల్లో నీరజాదేవి విశిష్ట కృషి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనేక ప్రదర్శనలతో స్వదేశీ కళలపై ఆసక్తిని పెంచుతున్నారు. దేశీయ కళల్లో ఆమె కృషికి గుర్తింపును పొందారు. 2008లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా 2015లో కూచిపూడి ఉత్తమ కళాకారిణి అవార్డు అందుకున్నారు. వీటితోపాటు ఆయా సందర్భాల్లో ‘నాట్యవిద్యాదరి’, ‘మువ్వలసవ్వడి’ అవార్డులను పొందారు. నీరజాదేవిది వనపర్తి జిల్లా. 1979లో స్వర్ణముఖి పేరుతో ఆర్ట్స్‌ అకాడమీని స్థాపించారు. దీనిద్వారా కళల వ్యాప్తికి కృషి చేస్తున్నారు. కళలు, నృత్యాలు దేశానికి సంపద అని, ముఖ్యంగా ప్రాంతీయ కళలను బతికించుకోవాలని అంటున్నారు నీరజాదేవి. ‘నృత్యం నాకు ఆత్మవిశ్వాసాన్ని, గుర్తింపును ఇచ్చిందని’ ఆనందం వ్యక్తం చేస్తున్నారామె.


మహిళాహక్కులు


ఆదిలాబాద్‌కు చెందిన సరిత హెచ్‌ఐవీ బాధితుల హక్కులకోసం పోరాడుతున్నారు. ‘అదిలా ఆదర్శ హెచ్‌ఐవీ పాజిటివ్‌ పీపుల్‌ వెల్ఫేర్‌ సొసైటీల’ని స్థాపించి.. 2006 నుంచి హెచ్‌ఐవీ పాజిటివ్‌ మహిళ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు సరిత. హెచ్‌ఐవీ మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. వారి పిల్లలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఎన్జీఓలతో కలిసి చనిపోయిన హెచ్‌ఐవీ బాధితుల అంత్యక్రియలు నిర్వహించారు సరిత. ప్రస్తుతం వీరి ఆర్గనైజేషన్‌లో 4,236 మంది పాజిటివ్‌ బాధితులున్నారు. వీరిలో 2వేలకు పైగా మహిళలు, 120 మందికిపైగా పిల్లలు ఉన్నారు. వీరందరి హక్కులను కాపాడుతూ న్యాయపరంగా అందాల్సినవి దగ్గరుండి అందిస్తున్నారు. ‘నేను చేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞలు. నా బాధ్యత మరింత పెరిగింది’ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు సరిత. 


సాహిత్యం


ఐనంపూడి శ్రీలక్ష్మి.. రచయిత్రి, యాంకర్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌. సాహిత్య రంగంలో విశేషమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో జన్మించారు. కాలేజీలో చదివే రోజుల నుంచే కవితలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఆమె అలలవాన, ధృక్కోణం, కవిత్వమే ఒక గెలాక్సీ, దర్వాజ మీద చందమామ వంటి కవితా సంపుటాలను ప్రచురించారు. రుస్కిన్‌ బాండ్‌, ఖలీల్‌ జీబ్రాన్‌, మృణాలినీ సారాబాయి రచనలను తెలుగులోకి అనువదించారు. సాహిత్య రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి మహిళా కవయిత్రుల సమ్మేళనాలు నిర్వహించారు. ‘అక్షరయాన్‌' పేరుతో రచయిత్రుల ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. సాహిత్యంలో మహిళల కృషి అవసరం అని, వారంతా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 


అచీవర్‌ ఎగెనెస్ట్‌ ఆడ్స్‌


స్రవంతి.. మల్టిపుల్‌ డిజెబిలిటీ కలిగిన 16 మంది గ్రాడ్యుయేట్స్‌లలో స్రవంతి టాపర్‌గా నిలిచింది. ఈ జబ్బును జయించిన నలుగురిలో ఒకరిగా స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నది. 15 ఏండ్ల పాటు స్రవంతిలో మార్పు రాకుంటే వదిలేద్దాం అనుకున్నది తల్లి శ్రీదేవి. అందుకోసం ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టెక్నిక్స్‌ అన్నీ నేర్చుకున్నది. ప్రతిరోజూ స్రవంతితో స్కూల్‌కు వెళ్లడం టీచర్లను కన్విన్స్‌ చేయడం తప్పలేదు. అలా పాపనూ ప్రోత్సహిస్తూ వచ్చింది. బలపం పట్టుకొని రాయలేదు అనుకున్న సమయంలో ఒక గీతతో ఏబీసీడీలు నేర్పింది తల్లి. దాంతో కూతురిపై నమ్మకం బలపడింది. ఇలా ఒక్కో తరగతి పూర్తి చేసి డిగ్రీ చేసింది. ఇప్పుడు ఏకంగా బ్యాంక్‌లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించింది. ‘నాకోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. ఇలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం’ అని అంటున్నది స్రవంతి. 


ప్రత్యేక అవసరాలున్న వారికి సేవ


మహిళల్లో మందబుద్ధులుగా (ఇంటెలెక్చువల్‌ డిజేబిలిటీ) ఉన్నవారిని ‘స్వయంకృషి’ సంస్థ అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణవారే కాకుండా అన్ని రాష్ర్టాల నుంచి 18 ఏండ్లు దాటి కుటుంబానికి భారమైన మహిళలకు నీడనిస్తున్నది. 1991లో మంజులా కళ్యాణ్‌ మొదలుపెట్టిన ఈ సంస్థలో ప్రస్తుతం 88 మంది మహిళలు ఉన్నారు. వీరిని ప్రోత్సహించేందుకు నగరంలోని సూపర్‌మార్కెట్లలో పనిలో పెట్టుకుంటున్నారు. మరికొంతమంది వారి సొంత పనులు కూడా చేసుకోలేరు. వారికి అన్ని పనులూ ఈ సంస్థే దగ్గరుండి చూసుకుంటుంది. చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన కళ్యాణ్‌ తెలంగాణకు తమ వంతు సాయం చేస్తానంటున్నది.


సూర్యా ధనుంజయ్‌.. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి. 2017 నుంచి కొనసాగుతున్నారు. మిర్యాలగూడలోని బల్లు నాయక్‌ తండాలో జన్మించారు. వ్యవసాయం చేయనిదే పూటగడవని కుటుంబం వీరిది. కుటుంబ పరిస్థితులు ఎంత విషాదంగా ఉన్నా చదువుకు మాత్రం దూరం కాలేదు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలన్న నాన్న మాటలే ఈమెను నడిపించాయి.  కోఠీ విమెన్స్‌ కాలేజీలో పీజీ చదివారు. తర్వాత డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్తూనే ఎంఫిల్‌ చేశారు. ప్రొఫెసర్‌ అయ్యారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీలోనే బోధనా బాధ్యతలు స్వీకరించారు. 1999లో ఓయూలో తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన సూర్యా ధనుంజయ్‌ అంచెలంచెలుగా ఎదిగి తెలుగు శాఖాధిపతి అయ్యారు. మొత్తం 20 ఏండ్ల అనుభవంలో సాహిత్యరంగంలో ఆమె కృషి చేస్తున్నారు. ‘ఆడపిల్లకు చదువు అవసరమా అనే భావన ఇంకా ఊర్లలో ఉంది.. కానీ మొత్తం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. అందుకోసం చదువుకోవాలి. అప్పుడే తెలివిగా బతుకగలం’ అంటున్నారు. 

హన్మకొండకు చెందిన బండా రామలీల, డాక్టర్‌ హరినాథ్‌ దంపతుల కూతురు, ఇద్దరూ కుమారులు. కాగా కుమారులు ఇద్దరు పుట్టుకతోనే మానసిక వికలాంగులు. వారి సంరక్షణకు ఎంతో కష్టపడింది. దివ్యాంగులుగా జన్మించిన తన కుమారులను సాధారణ బాలురుగా తీర్చిదిద్దాలనుకుంది. వెంటనే మానసిక వికలాంగులకు సంబంధించిన డిప్ల్లొమా కోర్సు చేసింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సహకారంతో 2001లో ఓ ప్రత్యేక కేంద్రం మొదలెట్టారు. తన తల్లి పేరున మల్లికాంబ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత మానసిక దివ్యాంగుల సంఖ్య పదులకు పెరిగింది. ఈ క్రమంలో బండా రామలీల చేస్తున్న సేవకు స్పందించిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి 2004లో హన్మకొండ హయగ్రీవాచారి మైదానం వెనుకాల అంబేద్కర్‌నగర్‌లోని కమ్యూనిటి హాల్‌ను కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే కేంద్రంను నిర్వహిస్తూ అభివృద్ది చేశారు. అంచెలంచెలుగా అభివృద్ది చేస్తూ ప్రస్తుతం 250 మందికి పైగా విద్యార్థులకు సేవలందిస్తున్నారు.  


చిన్ననాటి నుంచి నేటి వరకు ‘నృత్య కళాకారిణిగా.. రంగస్థల రారాణి’గా వెలుగొందుతున్నది పల్లెవాణి. బోనాలు, బతుకమ్మ, అమ్మవారి జాతర, పోతురాజు, శివసత్తుల నృత్యాలు ప్రత్యేకించి మోహినీ భస్మాసుర, గిరిజాకళ్యాణం, గంగాగౌరీ సంవాదం, గౌతమబుద్ధ, భక్తకన్నప్ప, మహిషాసుర మర్ధిని నృత్య రూపకాల్లో ఆరితేరింది పల్లె వాణి. ఆమె బాల్యం నుంచి ఇప్పటి వరకు మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. నృత్య కళాకారిణిగా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే పండుగలకు గజ్జెకట్టి కాలు కదుపుతుంది వాణి. రంగస్థల కళాకారిణిగా జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రాష్ట్రస్థాయి నాటిక పోటీల్లో 15 సార్లు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నది. నృత్యరంగంలో ‘బోనాల వాణి’గా, నాటక రంగంలో ‘బెలూన్‌ వాణి’గా గుర్తింపు పొందింది పల్లెవాణి. ‘కళకే నా జీవితాన్ని అంకితం చేశాను. అలాంటి నన్ను గుర్తించి, మహిళా దినోత్సవం రోజున సత్కరించడంతో నా జన్మ సార్థకమైంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రజా కళలను, కళాకారులను ఆదరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది పల్లెవాణి. 

సత్యవతి రాథోడ్‌.. అంటే ఎవరికీ తెలీదేమో కానీ.. మంగ్లీ అంటే తెలుగు రాష్ర్టాల్లో తెలియని వారుండరు. జానపద గాయకురాలిగా అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంగ్లీ. ‘తెలుగు రాష్ర్టాల్లో పండగలు వచ్చాయంటే మంగ్లీ పాట ఉండాల్సిందే’ అనే స్థాయికి చేరుకున్నదీ యువగాయని. సింగర్‌ కావాలని అనంతపురం నుంచి హైదరాబాద్‌ బాట పట్టింది. కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లొమా కూడా చేసింది. మాటకారి మాంగ్లీగా V6 ఛానల్లో తన మార్క్‌ వాయిస్‌తో తెలంగాణ యాసను ఇరగదీసింది. ఆ తర్వాత సింగర్‌గా వచ్చిన అవకాశాల్నీ చేజిక్కుంచుకొని మంచి పేరు తెచ్చుకుంది. మైక్‌ టీవీ సారథ్యంలో ప్రత్యేక ఫోక్‌ సాంగ్స్‌ పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. సినిమాలకు కూడా పాటలు పాడుతూ మంచిపేరు సంపాదించింది మంగ్లీ. ప్రస్తుతం యాంకర్‌, గాయనిగా రాణిస్తున్నది. వెండితెరపై ‘రాములో రాములో’ అంటూ తనదైన గొంతుతో ఇరగదీసింది. ‘స్వేచ్ఛ’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు సంపాదించింది మంగ్లీ. ‘ఈ సత్కారం నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అభిమానులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. నా కళను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది మంగ్లీ.


క్రీడలు


11 ఏండ్ల ప్రాయంలోనే భవిష్యత్‌ నిర్మాణానికి పునాది నిర్మించుకున్నది దీక్షిత. 2006 నుంచి రెండేళ్లు ఫిట్‌నెస్‌ కోసం విపరీతంగా శ్రమించింది. ఆతర్వాత గురువుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్నది. నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కైవసం చేసుకుంటున్నది. దీక్షిత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 35 పతకాలు. అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు సాధించింది. 2017 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్‌వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ 58 కిలోల విభాగంలో దీక్షిత గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఆమెను అభినందించారు. రూ.15 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. దీక్షితది మహబూబాబాద్‌. ఆమె తల్లిదండ్రులు వినోద, కేశవరావు. కష్టపడి దీక్షితను డిగ్రీ వరకూ చదివించారు. దీక్షిత ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగం సాధించింది. కరణం మల్లేశ్వరిని స్ఫూర్తిగా తీసుకొని ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌, 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్‌ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నది. 

ఆమెకు నీళ్లంటే భయం. కానీ ఆరోగ్యం కోసం ఈత నేర్చుకోవాలనుకున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లో సాధన చేశారు. అలా నీటికి దగ్గరైన ఆమె.. ఇప్పుడు రోజూ నీటిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. రోజుకు ఆరుగంటలు స్విమ్మింగ్‌లో సాధన చేస్తున్నారు. గోలి శ్యామలది హైదరాబాద్‌. ఆమె ప్రొడ్యూసర్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌, రైటర్‌ కూడా. నాలుగేళ్ల క్రితం ఆమె అనారోగ్య సమస్యలు దరిచేరవద్దని స్విమ్మింగ్‌ నేర్చుకోవాలనుకున్నారు. 2016లో ఈత నేర్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ నిర్వహించిన మాస్టర్స్‌ స్టేట్‌ మీట్‌లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్‌ వాటర్‌లో ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. ఫిబ్రవరి 21న ఆక్వారేబల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటిస్థానంలో నిలిచారు. ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా 30 కిలో మీటర్లు ఈదడమే లక్ష్యంగా గచ్చిబౌలి స్విమ్మింగ్‌పూల్‌లో సాధన చేస్తున్నారు. రాజీవ్‌త్రివేదిని ఆదర్శంగా తీసుకొని 12 గంటలు నాన్‌స్టాప్‌గా స్విమ్మింగ్‌ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకెళ్తున్నారు. భవిష్యత్‌లో ఇంగ్లిష్‌ చానెల్‌ ఈదాలనే లక్ష్యంతోఉన్నారు. 


జర్నలిజం


20 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతున్న నిర్మలా రెడ్డి నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల మండలం, చిలకమర్రి గ్రామానికి చెందినవారు. వార్త దినపత్రికతో తన ప్రస్థానం ప్రారంభించి ఆంధ్రజ్యోతి, టీవీ9లలోనూ సేవలందించారు. ఫీచర్‌ జర్నలిస్ట్‌గా అనేక మంది మహిళల విజయాలను వెలుగులోకి తెచ్చారు. మానవీయ కథనాల ద్వారా ఆపన్నులకు చేయూత అందేలా చేశారు. కథా రచయిత్రి గానూ తనదైన ముద్ర వేసుకున్న నిర్మలారెడ్డి సాక్షి ఫ్యామిలీ విభాగంలో పనిచేస్తూ బెటర్‌హాఫ్‌, పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌, మి అండ్‌ మై గాడ్‌ కాలమ్స్‌తో పాఠకులను ఆకట్టుకున్నారు. 2008లో ప్రతిష్ఠాత్మక డిఎన్‌ఎఫ్‌ ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డును అందుకున్నారు. జర్నలిజంలో మహిళా శక్తిని పెంచేందుకు ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట మహిళ అవార్డును ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిర్మలారెడ్డి. 


వ్యవసాయం


బేగరి లక్ష్మమ్మది సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హుమ్నాపూర్‌. వ్యవసాయం మాత్రమే చేస్తే ఆమె ఎవ్వరికీ గుర్తుండకపోయేది. కానీ అంతకుమించి ఆలోచన చేసింది. సేంద్రియ వ్యవసాయంపై, మట్టిలో సాంద్రతను పెంచడంపై అనేక గ్రామాల మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలో పనిచేస్తూనే.. చుట్టుపక్కల గ్రామాల మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నది. బహుళజాతి కంపెనీలపై ఆధారపడకుండా స్వయంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నది. గ్రామీణ మహిళలతో తయారు చేయిస్తున్నది. ఆమె 30 ఏండ్లుగా విత్తన సేకరణ చేపడుతున్నది. తన ఎనిమిదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నది. లక్ష్మమ్మ ఇంట్లో ఎక్కడ చూసినా గుమ్ములు కనిపిస్తాయి. దాదాపు 50 నుంచి 80 విత్తన రకాల్ని ఆమె నిల్వ ఉంచి రైతులకు అందజేస్తున్నది. వేలాది మంది మహిళలకు విత్తనాల్ని సేకరించి నిల్వ ఉంచుకునేలా కృషి చేస్తున్నది. తన నానమ్మ దగ్గర్నుంచి విత్తనాల నిల్వ, వ్యవసాయం నేర్చుకున్నానని.. భావితరాలకు వ్యవసాయాన్ని కానుకగా అందించాలని లక్ష్మమ్మ చెబుతున్నది.


మహిళా శిశు సంక్షేమం


గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి.. పట్టణ ప్రాంతాల్లో చేయడానికి వ్యత్యాసం ఉంటుంది. గ్రామాల్లో అయితే ఒకట్రెండు సార్లు చెప్తే వింటారు. కానీ పట్టణాల్లో ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌లోని సరస్వతీనగర్‌ అంగన్‌వాడీ సెంటర్లో పనిచేస్తున్న సంధ్యారాణిది ఇలాంటి పరిస్థితే. కానీ ఏనాడూ దానిని సమస్యగా భావించలేదు ఆమె. ఉన్నతాధికారుల సహకారంతో సరస్వతీనగర్‌ అంగన్‌వాడీని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ మహిళలు.. బాలింతలు.. గర్భిణులు.. పిల్లలకు ఆరోగ్య సూచనలు ఇస్తున్నారు. పోషకాహారం అందజేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సంధ్య 20 ఏండ్ల క్రితమే నగరం వచ్చి ఉప్పల్‌లో స్థిరపడ్డారు. భర్త మాధవరెడ్డి సహకారంతో 2007లో అంగన్‌వాడీ ఉద్యోగంలో చేరారు. విద్యావలంటీర్‌గా చేసిన అనుభవం సంధ్యకు ఉన్నది. అవార్డు పట్ల హర్షం వ్యక్తం చేశారు సంధ్య. 


Integrated Child Development Servicesలో మంచి అనుభవం ఉన్న సౌజన్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమ్మిగూడెం సెక్టార్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. గుమ్మడవెల్లి సెక్టార్‌కు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 18 గ్రామాలు.. 48 అంగన్‌వాడీ కేంద్రాల్లో తన సేవల్ని అందిస్తున్నారు. 2013లో ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఐసీడీఎస్‌ అధికారిగా ఎంపికైన సౌజన్య పుట్టి పెరిగింది అశ్వరావుపేటలో. మొదటగా కల్లూరు సెక్టార్‌లో సూపర్‌వైజర్‌గా సేవలందించి 2019 జూన్‌లో జమ్మిగూడెం సెక్టార్‌కు బదిలీ అయ్యారు. అంతా ట్రైబల్‌ ఏరియా. తెలంగాణ బార్డర్‌. కొన్ని ప్రాంతాల్లో అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిరోజూ 3-4 గ్రామాలు పర్యటించాలి. ప్రతీనెల అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ విజయవంతంగా నిర్వహిస్తూ ఎన్నో బాల్య వివాహాలను.. పిల్లల అమ్మకాలను నివారించి ఉత్తమ సూపర్‌వైజర్‌గా పురస్కారం అందుకోబోతున్నారు. 

టెకం యమునా బాయి : ఉత్తమ అంగన్‌వాడీ సహాయకురాలు

వైద్యం


గ్రామాల్లో పేదపిల్లలు పోషకవిలువలు లేని ఆహారం తీంటున్నారు. తల్లిదండ్రులకు ఆహారంపై అవగాహన లేక ఏది పడితే అది పెడుతున్నారు. దీంతో ఆ చిన్నారులు ఆ వయసులోనే ఆనారోగ్యానికి గురవుతున్నారు. వీరికి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో మెడికల్‌ కాంపెయిన్లు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్‌ అంజలీదేవి. ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు చేస్తున్నారు. ఈవిడ 1970లో ఈ సర్వీస్‌లో చేరి నిరంతరంగా సేవలు అందిస్తున్నారు. ఈనెలతో అంజలీదేవి 50 ఏండ్ల సర్వీస్‌ పూర్తి అవుతుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈమె హన్మకొండలో ఉంటున్నారు. 1983 నుంచి కళ్యాణి హాస్పిటల్‌తో సేవ చేస్తున్నారు. ‘ఈ అవార్డు రావడంతో మరింత బాధ్యత గుర్తుకువచ్చింది. ఊపిరి ఉన్నంతవరకు పేద ప్రజలకు అండగా ఉంటాను’ అని అన్నారు డాక్టర్‌ అంజలీదేవి. 


 యోగ


యోగ డాక్టర్‌ అరుణాదేవికి వారసత్వంగా వస్తున్నదే. అరుణ అమ్మగారి నానమ్మ నుంచి ఇంట్లో అందరూ యోగ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అరుణ నేషనల్‌ లెవల్లో వాలీబాల్‌ ప్లేయర్‌గా రాణించారు. తర్వాత తమిళనాడు, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకున్నారు. మొదట సుందరయ్యపార్క్‌, హియాయత్‌ నగర్‌లో చిన్న స్థాయిలో యోగా క్లాసులు నిర్వహించారు. 1995లో కావూరి హిల్స్‌లో సొంతంగా ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించారు. ఆయుర్వేద, యోగా, హోమియోపతి ఇలా ట్రెడిషనల్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను ప్రమోట్‌ చేస్తూ వచ్చారు. ‘ఇది ఆల్టర్‌నేట్‌ థెరపీ కాదు. ప్రధానమైన ట్రీట్‌మెంట్‌'గా తీసుకురావడానికి ఇన్ని రోజులు కృషి చేస్తున్నాని చెబుతున్నారు. 1990 నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అరుణాదేవి. ఇప్పటివరకు తెలంగాణలో ఎన్నో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందంటున్నారు అరుణ.


సమాజ సేవ


మహిళా సాధికారత కోసం వృద్ధాప్యంలోనూ పోరాడుతున్న ధీర వనిత డాక్టర్‌ సరోజ్‌ బజాజ్‌. బాలికా విద్య నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకూ అన్నింటా మహిళలకు అవకాశాలు కల్పించిన చైతన్య బావుటా సరోజ్‌ బజాజ్‌. ఉత్తరప్రదేశ్‌లో 1945లో జన్మించిన సరోజ్‌కు 15వ యేటనే పెండ్లి చేశారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చిన సరోజ్‌ తెలుగునాట సుపరిచితురాలు. ఉస్మానియాలో హిందీ ప్రొఫెసర్‌గా చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ‘మహిళా దక్ష సమితి’ని స్థాపించి ఆనాటి నుంచి నేటి వరకూ మహిళ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు చూపించడంతో అవిరళంగా శ్రమిస్తూనే ఉన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ‘ది ఏపీ రాజరాజేశ్వరి మహిళా కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌'ను స్థాపించి చైర్‌పర్స్‌గా వ్యవహరించారు. అనాథ బాలికల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో హాస్టల్స్‌, పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ, నర్సింగ్‌ కాలేజ్‌లు స్థాపించారు సరోజ్‌. 


బాల్య వివాహాలు, బాల కార్మికులు, పిల్లల ట్రాఫికింగ్‌, భ్రూణహత్యల నివారణకై పోరాటానికి కేరాఫ్‌ అడ్రస్‌ తరుణి స్వచ్ఛంద సంస్థ. 2000లో దీన్ని స్థాపించిన డాక్టర్‌ మమత రఘువీర్‌ ఆచంట మహిళల చైతన్యం, రక్షణ కోసం కృషి చేస్తున్నారు. తరుణి ఆధ్వర్యంలో గ్రామాల్లో బాలికా సంఘాల పేరిట 11 నుంచి 18 ఏళ్ల వయసు అమ్మాయిలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. 2015లోనెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లీగల్‌ యాక్టివిస్ట్స్‌  (ఎన్‌ఐఎన్‌ఎ) పేరుతో నెట్‌వర్క్‌ను ప్రారంభించారు  మమత. దీని ద్వారా శారీరక, మానసిక, సామాజిక, న్యాయపరంగా మోసపోయిన మహిళలకు చేయూతనిచ్చి, వాళ్లకు కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. తెలంగాణ పోలీస్‌ భరోసా సపోర్ట్‌ సెంటర్‌కు తరుణి సాంకేతిక భాగస్వామిగా కూడా పనిచేస్తున్నారు. నల్గొండకు చెందిన మమత లైఫ్‌ సైన్సెస్‌లో పిహెచ్‌డి చేశారు. సోషల్‌ వర్క్‌, న్యాయశాస్ర్తాలను కూడా అభ్యసించారు. 


పెయింటింగ్‌


పెయింటింగ్‌, కంపోజింగ్‌ పెయింటింగ్‌లో లక్ష్మీరెడ్డిది వైవిధ్యమైన ప్రతిభ. హస్తకళానైపుణ్యంలో ఆమెది అందెవేసిన చేయి. ప్రస్తుతం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) డిజైనింగ్‌ విభాగంలో ఉన్నారు. 25 సంవత్సరాలుగా అక్కడ పని చేస్తున్నారు. ఫేషన్‌, లైఫ్‌ైస్టెల్‌, ఇంటీరియర్‌, ఇండస్ట్రీ, హ్యండీక్రాఫ్ట్‌ డిజైనింగ్‌, పెయింటింగ్‌లో అనుభవజ్ఞురాలు. పెయింటింగ్‌ నేర్చుకోవడానికి తండ్రి, ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. జెఎన్‌టీయూలో  డిప్ల్లొమా చేశారు. తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్‌ఏ, పీహెచ్‌డీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కంపెనీ లోగోలను డిజైన్‌ చేశారు. ఆమె డిజైన్లతో అనేక ఎగ్జిబిషన్లను నిర్వహించారు. అనంతరం ఎన్‌ఐఎఫ్‌టీకి వెళ్లారు. అక్కడ విశేషమైన కృషితో దేశవ్యాప్త గుర్తింపును పొందారు. డిజైన్‌లను సృష్టించడంలో వాస్తవికత, టెక్నిక్‌లపై లక్ష్మికి పట్టు ఉంది. కళాకారిణిగా మరింత మంది కళాకారులను తయారు చేయడమే నా లక్ష్యం అని అంటున్నారీమె. 


సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌


మహబూబ్‌నగర్‌కు చెందిన మంజులారెడ్డి సైన్స్‌లో ఎన్నో పరిశోధనలు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. బ్యాక్టీరియా సెల్‌వాల్‌ (కణత్వచం)పై పదేండ్ల పాటు పరిశోధనలు చేసి కొత్త పద్ధతులతో బ్యాక్టీరియా వాల్‌ తయారయ్యే విధానాన్ని కనుగొన్నారు. బ్యాక్టీరియాను శక్తివంతమైన యాంటీబయోటిక్స్‌ సైతం నిరోధించలేకపోతున్నాయి. అందుకు గల కారణాలు ఏంటీ? అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనలు ఫలితాన్ని ఇచ్చాయి. బ్యాక్టీరియా సెల్‌వాల్‌ను నిరోధించగలిగితే దీనివల్ల వచ్చే టైఫాయిడ్‌, ఇన్ఫెక్షన్స్‌, టీబీ, డిఫ్తిరీయా, కుష్టు, కలరా వంటి వ్యాధులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా నిర్మూలన, అందుకు కొత్త యాంటీబయోటిక్స్‌ కనుక్కోవడానికి మంజులారెడ్డి పరిశోధన చాలా ప్రామాణికం కానుంది. 1990లో సెంటర్‌ ఫర్‌ సెక్యులర్‌ అండ్‌ మాలెక్యులర్‌ బయోలజీ(సీసీఎంబీ)లో జూనియర్‌ సైంటిస్ట్‌గా చేరారు. అక్కడ పరిశోధనలు చేస్తూనే ‘బ్యాక్టీరియా మ్యూటేషన్‌' అంశంపై 2001లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ‘అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిరంగాల్లో మహిళలు ఎదగాలి. అందుకోసం కుటంబసభ్యులు కూడా సహకరించాలి’ అంటున్నారు మంజులారెడ్డి. 


కార్పొరేట్‌ లీడర్‌షిప్‌


ఇన్ఫోసిస్‌ పోచారం సెంటర్‌ హెడ్‌గా పనిచేస్తున్న మనీషా సబూ నేటి తరం యువతులకు ఎంతో ఆదర్శం. పదేండ్లుగా ఐటీ రంగం అభివృద్ధికోసం ఆమె కృషి చేస్తున్నది. రిటైల్‌, బ్యాంకింగ్‌, హెల్త్‌ కేర్‌ వంటి ఇ-కామర్స్‌ డొమేయిన్లలో సేవలందించింది. మేడ్చల్‌ జిల్లా, ఘట్‌కేసర్‌ మండలంలోని పోచారంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ క్యాంపస్‌ ఉన్నది. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో 3,500 మందికిపైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. దీనికి ఆమె హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నది. ఐటీ రంగానికి సంబంధించి దేశ, విదేశాల్లో జరిగే సదస్సుల్లో మెళకువలు అందిస్తున్నారు. నేటి అవసరాలకు తగిన విధంగా నైపుణ్యతను పెంచేందుకు ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నది. ఎంఐటీ చదివిన ఆమె దేశంలోనే ఇన్ఫర్మేషన్‌ రంగంలో అత్యుత్తమ సేవలు అందించింది. 2017లో అత్యంత శక్తివంతమైన మహిళగా స్థానం సంపాదించింది. సాంకేతికతను మెరుగుపరిచేందుకు అవసరమైన పరిశోధనలు చేస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నది మనీషా సబూ. 


ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌


ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్‌ చాప్టర్‌కు వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు ఉషారాణి. ఎఫ్‌ఎల్‌ఓ ద్వారా మహిళలు అన్ని రంగాలల్లో ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, నైపుణ్యత అందిస్తున్నారు. ఔత్సాహిక రంగంలో మెళకువలను అందించడానికి పలురంగాల్లో నిష్ణాతులైన వారితో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పొల్మోన్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ‘చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా, మార్కెట్‌ అవసరాలకు తగిన విధంగా సేవలందించే ఔత్సాహికులదే భవిష్యత్‌ అంతా, అందుకోసమే కొత్త ఆలోచనలతో రావాలని నేటి తరం ఔత్సాహికులకు ఆమె సూచిస్తున్నది. మహిళలకు అన్ని రంగాల్లో ఎదగడానికి అవసరమైన ప్రోత్సాహం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా అందిస్తున్నామని’ ఉషారాణి అంటున్నారు. 


ఆరోగ్య సేవలు 


ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్య నేస్తం స్టాఫ్‌నర్స్‌ అనితా పవార్‌. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పిస్తూ.. అధిక సంఖ్యలో నార్మల్‌ డెలివరీస్‌ చేయించిన రికార్డు ఆమెకు ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అనిత బీఎస్సీ నర్సింగ్‌   నర్స్‌ కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. 2011లో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగం సంపాదించారు. ఆమె పుట్టింది ఉట్నూర్‌ మండలం శంకర్‌తాండాలో. చిన్నప్పటి నుంచి ప్రజారోగ్యంపై అవగాహన ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులు ఏంటో ఆమెకు తెలుసు. పెండ్లయి అత్తారింటికి వెళ్లిన తర్వాత కూడా నర్సింగ్‌ వృత్తి పట్లనే ఆసక్తితో ఉండి భర్తను ఒప్పించి ప్రజలకు సేవ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ స్టాఫ్‌ నర్స్‌గా ఎంపిక చేసినందుకు అనిత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండనకా.. వాననకా తాను చేస్తున్న కష్టానికి గుర్తింపుగా దీనిని భావిస్తున్నట్లు చెప్పారు. 13 సంవత్సరాలుగా ట్రైబల్‌ ఏరియా ప్రజలకు ఆరోగ్య వారధిగా పనిచేస్తున్నారు శారద. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలోని పెంచికల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శారద పనిచేస్తున్నారు. ట్రైబల్‌ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఆరోగ్యం గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ చొరవ తీసుకొని చేయిద్దామన్నా ఒప్పుకోరు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనూ ప్రజలను ఒప్పిస్తూ.. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు శారద. 2007లో ఏఎన్‌ఎమ్‌గా అపాయింట్‌ అయిన శారద జాయినింగ్‌ రోజు నుంచే ప్రజలకు మంచి వైద్య సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. భర్త చంద్రశేఖర్‌ సహకారంతో ఎక్కువ సమయం ప్రజారోగ్యానికే కేటాయిస్తూ ఆదర్శ ఏఎన్‌ఎమ్‌గా పేరు సంపాదించారు. గ్రామాల్లో వాక్సినేషన్‌ వేసేందుకు వాగులు.. వంకలు దాటుకొని వెళ్తూ పని పట్ల నిబద్ధత ఎలాంటిదో చాటిచెప్తున్నారు. తాజా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.