బుధవారం 03 జూన్ 2020
Zindagi - Mar 01, 2020 , 23:11:58

ఆకుపచ్చని ప్రయాణం

ఆకుపచ్చని ప్రయాణం

ఆమెకు ఎనభై ఏండ్లు. చెన్నయ్‌ ఫేమస్‌ గ్రీన్‌ హోమ్‌ ను నిర్వహిస్తున్నారు. ప్రజలకు, విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ గుర్తింపును పొందుతున్నారు. తోటపనిలో ఆమెకు అవార్డులు కూడా వచ్చాయి. ఆమె పేరు సరోజ.

సరోజకు పదహారేండ్ల వయస్సులో పెండ్లయింది. తమిళనాడు నుంచి చెన్నయ్‌ వెళ్లింది. చిన్నప్పటి నుంచే వ్యససాయంపై ఆసక్తి కారణంగా ఆమె మొక్కల పెంపకం ప్రారంభించారు. సుమారు అరవై ఏండ్లు శ్రమించారు. టెర్రస్‌ గార్డెనింగ్‌ చేస్తూ ఐదువందల రకాల మొక్కలను సంరక్షిస్తున్నారామె. తమిళనాడులోని నాగపట్నం సమీపంలోని ఓ గ్రామంలో జన్మించారు సరోజ. ఆమె కుటుంబానిది వ్యవసాయ నేపథ్యం. దీంతో మట్టిపై ఆమెకు అనుబంధం ఏర్పడింది.  వ్యవసాయం మీద ప్రేమ, చెట్ల మీద అప్యాయత కలిగింది. దీంతో పాటు ఆమెకు చిన్నప్పుడు ఒక ట్యూషన్‌ టీచర్‌ ఉండేవారు. ఆయన పాఠాలతో పాటు పర్యావరణ విద్య నేర్పించేవారు. దీని కోసం విద్యార్థులను తోటలోకి తీసుకెళ్లేవారు. ఇలా చిన్న వయస్సులోనే చెట్లపెంపకంపై సరోజకు ఆసక్తి కలిగింది. అది రాను రాను అభిరుచిగా మారింది. మరిన్ని మెళకువలు నేర్చుకొని టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె గార్డెన్‌లో పది రకాల కూరగాయలు, గులాబీలు, ఇరవై  రకాల మందార మొక్కలు ఉన్నాయని చెప్తున్నది. 


సరోజ నిర్వహిస్తున్న టెర్రస్‌ గార్డెనింగ్‌ను సందర్శించడానికి చాలామంది వస్తుంటారు. చుట్టుపక్కల విద్యార్థులు కూడా గ్రీన్‌హోం పర్యటనకు వస్తారు. వాడిపోయిన మందార పువ్వులను సేకరించి ప్రయోగాలకు ఉపయోగిస్తారు. దీంతో పాటు కంపోస్టింగ్‌, సేంద్రియ ఎరువుల వాడకం గురించి సరోజా నుంచి తెలుసుకుంటారు.  ‘మొక్కల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది’ అని సరోజ  అంటారు. తోటపనిలో ఆమె చేస్తున్న కృషికి 2015లో తమిళనాడు హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అవార్డు అందుకున్నారు. తర్వాత 2019లో అన్నా విశ్వవిద్యాలయం నుంచి కూడా మరో అవార్డు అందుకున్నారు. 2012లో సరోజ భర్త చనిపోయారు. పిల్లలు వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. కానీ పెరుగుతున్న మొక్కల కారణంగా ఆమె ఎప్పడూ ఒంటరిగా ఉన్నట్టు భావించలేదని చెప్తున్నది. ‘ఈ మొక్కలు ఎప్పుడూ నా కోసం ఉంటాయి’ అని చిరునవ్వుతో చెప్తున్నది. 


logo