శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Feb 21, 2020 , 23:11:47

నేడు కవలల పండుగ!

నేడు కవలల పండుగ!

మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారో లేదో తెలియదు! కానీ అచ్చుగుద్దినట్లుగా కొందరు కనిపిస్తుంటారు. వాళ్లే ట్విన్స్‌, ట్రిప్లెక్స్‌. అలా ఒక్కరిద్దరు కనిపిస్తేనే చూస్తూ ఉండిపోతాం. మరి ఒకేసారి అలాంటివారు వేలాది మంది కనిపిస్తే? ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌లో జరిగే ‘ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌'లో అలాంటి దృశ్యమే ఆవిష్కృతం కానుంది. వేలాది మంది కవలలు దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌ రానున్నారు. శనివారం కవలల దినోత్సవం! సందర్భంగా ప్రత్యేక కథనం.

సరిగ్గా ఆరు రోజుల క్రితం. తెలుగు లలిత కళా తోరణం. 666 బెలూన్లు. 66 కిలోల కేకు. 66 మొక్కలు. ఆరుగురు గెస్ట్‌లు. అక్కడో భారీ వేడుక జరుగుతున్నది. అది కేసీఆర్‌ జన్మదిన వేడుక. కానీ ఇతర ప్రాంతాల్లో మాదిరిగా రొటీన్‌గా మాత్రం అస్సలు కాదు. 166 మంది కవలలు ఈ కార్యక్రమానికి హాజరవడమే ప్రత్యేకం. ఒకేచోట అంతమంది. అదీ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో మమేకమవడం. 2కే ఫన్‌.. రన్‌ వంటి కార్యక్రమాలు ఎందరినో కట్టిపడేశాయి. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌, లక్ష్మణ్‌ కవలలతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కేవలం హైదరాబాద్‌ ప్రాంత కవలలే పాల్గొన్నారు. కానీ ఏప్రిల్‌ 26న నిర్వహించే ‘ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌' సందర్భంగా మాత్రం వివిధ దేశాల నుంచి సుమారు 5 వేల మంది కవలలు పాల్గొననున్నారు. 26వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


హైదరాబాదే ఎందుకంటే..

ప్రపంచంలోనే ఘన చరిత్ర కలిగిన ఏకైక ట్విన్‌ సిటీస్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఆలోచనతో ‘ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌'ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు, సామాజిక కార్యకర్త గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ గత ఏడాది నుంచి కవలల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ తయారు చేయించి వారి వివరాలు సేకరిస్తున్నారు. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా కవలల వివరాలు సేకరిస్తున్నారు. ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెబ్‌సైట్‌లో ఇప్పటికే 3వేల మందికి పైగా కవలలు పేర్లు నమోదు చేసుకున్నారు. 


కార్యక్రమాలేంటంటే..

ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని అన్ని రంగాల్లో స్థిరపడిన కవలలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు కవలలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రజా సేవకులతో ట్విన్స్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా కవలలకు ఉచిత విద్య, ఉద్యోగావకాశాలు, వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పేద కవలల తల్లిదండ్రులకు ఆర్థికసాయం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. సమాజంలో అనేక సంఘాలు, సంస్థలున్నాయి. కానీ కవలల సంక్షేమానికి కృషి చేసే వారే లేరు. ఈనేపథ్యంలో కవలలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో సామాజిక కార్యకర్త గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ తన మిత్రులతో కలిసి ట్విన్స్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.


కవలల దినోత్సవం ఈరోజే ఎందుకు?

కవలలకు ప్రత్యేకంగా ఓ రోజంటూ లేదు. ఒక్కో దేశంలో ఒక్కో రోజును కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 2 ను కవల సంఖ్యకు సూచికగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా రెండో నెల 22వ తేదీన కవలల దినోత్సవంగా నిర్వహించాలని ‘ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌' నిర్వాహకులు, కవలల తల్లిదండ్రులు ప్రతిపాదిస్తున్నారు. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ఇదే తేదీన కవలల దినోత్సవం జరిపించేలా అధికారికంగా అమలు చేసేందుకు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 


హైదరాబాద్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు ఓ బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలనే ఆలోచనే ట్విన్‌ సిటీస్‌ ట్విన్స్‌ కార్నివాల్‌ ఉద్దేశం. కవలలకు ప్రత్యేక రోజంటూ లేదు. 2వ నెల 22వ తారీఖున నిర్ణయించాలని చాలామంది కవలలు కోరుతున్నారు. వారందరి ఆలోచనను ఆచరణలోకి తీసుకొద్దామనే మేం ముందుకొచ్చాం. ట్విన్స్‌ కార్నివాల్‌లో అన్ని రంగాల్లో ఉన్న ట్విన్స్‌, నాయకులు, అధికారులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ర్టాల నుంచి వేల సంఖ్యలో కవలలు హాజరు కానున్నారు. భవిష్యత్‌లో 185 దేశాల కవలలను గ్యాదర్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నాం.

- గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, సామాజిక కార్యకర్త


-పడమటింటి రవికుమార్‌


logo