మంగళవారం 02 జూన్ 2020
Zindagi - Feb 20, 2020 , 23:04:06

మనోడు చెక్కిన.. మరాఠా చిత్రం!

మనోడు చెక్కిన.. మరాఠా చిత్రం!

తెలంగాణకు సినీ ధ్యాస ఎక్కువే. చూస్తున్నాం కదా? మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లు.. యాక్టర్లు.. ప్రొడ్యూసర్లలో మనోళ్లూ ఉన్నారు. టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని వుడ్‌లలోనూ మన ప్రతిభావంతులు ఉన్నారు. అలాంటివారిలో దేశబోయిన నవీన్‌ ఒకరు. కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. మరాఠీ సినీ పరిశ్రమలో నవీన్‌ ఇప్పుడొక సంచలనం. ఇంతకీ ఎవరా నవీన్‌? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఏ సినిమాలు తీశాడు?

అది 2000 సంవత్సరం. కొద్దిరోజుల్లో పదో తరగతి పరీక్షలు. అంతా పరీక్షలెలా రాయాలి? ఎన్ని మార్కులు సంపాదించాలి? అని ఆలోచిస్తున్నారు. ఒక పిలగాడు మాత్రం పరీక్షలే ప్రపంచమా? విద్యార్థి దశ నుంచే ఓ లక్ష్యం ఉండాలి కదా? అనుకున్నాడు. సినిమాలు అతడి ఆప్షన్‌. అది కూడా డైరెక్షన్‌. చెప్తే ఇంటా.. బయటా తిట్టారు. ఏం చేయాలి? అని ఆలోచించీ.. చించీ.. ఇంటి నుంచి పారిపోయాడు. 


2020 జనవరి 17.. మరాఠీలో ఒక సినిమా విడుదలైంది. పేరు ‘లతా భగవాన్‌ కరే’. డైరెక్టెడ్‌ బై దేశబోయిన నవీన్‌. ఈ సినిమా సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనూహ్య స్పందన వచ్చింది. మన రాష్ట్రం కాదు. మన చిత్ర పరిశ్రమ కాదు. మన భాష కాదు. కానీ యథార్థ కథను పాయింట్‌గా తీసుకొని సినిమా తీశాడు నవీన్‌. 2000 సంవత్సరంలో పరీక్షలు ఎగ్గొట్టి ఇంటి నుంచి పారిపోయిన ఆ పిలగాడే ఈ కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నవీన్‌.  ఏముంది కథలో? : నిరుపేద మహిళా జీవితం ఉంది. కుటుంబాన్ని పోషించేందుకు పడిన పాట్లు ఉన్నాయి. ఎలాగైనా జీవితాన్ని గెలువాలనే తెగువ ఉంది. సమస్యలను అధిగమించి పోరాడే ధైర్యం.. పట్టుదల ఉన్నాయి. 


ఇవి సినిమాలో లీడ్‌రోల్‌ చేసిన లతా భగవాన్‌ జీవితంలో అనుభవించినవే. అంటే ఇదొక పేద మహిళ బయోపిక్‌. సెలెబ్రిటీల బయోపిక్‌లే  కాదు.. చెమటోడ్చి పనిచేసే మహిళ బయోపిక్‌ తీసి చూపిద్దాం అనుకున్నాడు నవీన్‌. తాను అనుకున్నది కాకుండా.. లత జీవితంలో జరిగిందే సినిమాగా తీశాడు. జీవితమే సినిమాగా : లతది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పెంప్లీ గ్రామం. లత.. భర్త భగవాన్‌ కూలీ పని చేసేవారు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అప్పు చేసి పిల్లల పెండ్లిళ్లు చేశారు. ఇక ఆ అప్పు తీర్చాలి. రెండు మూడేండ్లు బాగా కష్టపడి ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి భగవాన్‌ అనారోగ్యం పాలయ్యాడు. ఇక చేసేది లత ఒక్కరే. అందులోనూ ఆడమనిషాయె. పరేషాన్‌తో ఉన్న లతకు ఒక పేపర్‌ ప్రకటన ఊరటనిచ్చింది. 


ఏమిటా ప్రకటన? : ‘మూడు మీటర్ల పరుగు పందెంలో పాల్గొనండీ.. మూడు వేల రూపాయలు గెల్చుకోండి. శరత్‌ మారథాన్‌ మంచి అవకాశం కల్పిస్తున్నది’ అనేది ఆ ప్రకటన సారాంశం. లతకు ఆశ కలిగింది. పరుగు పందెంలో గెలిచి భర్తను కాపాడుకోవాలనుకున్నది. అప్పుడామె వయసు 65 సంవత్సరాలు. మారథాన్‌ నిర్వహకులు వద్దన్నారు. లత తన పరిస్థితి వివరించగా వారు దయదలిచారు. 2013 డిసెంబర్‌ 17న మూడు కిలోమీటర్ల శరత్‌ మారథాన్‌లో విజయం సాధించి మూడు వేల రూపాయలు గెల్చుకుంది. ఇలా వరుసగా మూడుసార్లు పరుగు పందెంలో పాల్గొని భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంది. 


ఒప్పించి.. ఓదార్చి : లతా భగవాన్‌ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పటికే తస్లీమా నస్రీన్‌ ‘లజ్జ’ నవల ఆధారంగా సినిమా తీసినప్పటికీ తెరపైకి రాలేదు. మరో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న నవీన్‌కు లతా భగవాన్‌ గురించి తెలిసింది. ఆమెను కలిశాడు. లత కుటుంబ పరిస్థితి ప్రత్యక్షంగా చూసి బాధపడ్డాడు. వారి జీవితాన్ని సినిమాగా చిత్రీకరిస్తానని చెప్తే వాళ్లు వినలేదు. నవీన్‌ పట్టు వదలకుండా కొద్దిరోజులు వారితోనే ఉంటూ నమ్మకం ఏర్పరుచుకున్నాడు. మొత్తానికి లత వాళ్లు ఒప్పుకొన్నారు. 


చలింపజేసే కథనం:  కథ తెలుసు. ఒరిజినల్‌ క్యారెక్టర్లే ఉండాలి అనేది నవీన్‌ ఆలోచన. కానీ ప్రొడ్యూసర్లు ముందుకు రాలేదు. ముసలోళ్లను పెట్టి సినిమా తీస్తే డబ్బులెట్లా వస్తాయన్నారు. తన స్నేహితుడు ఆరబోతు కృష్ణకు విషయం చెప్పాడు. చలించిపోయిన అతను సినిమాకు ఓకే అన్నాడు. లత షూటింగ్‌లో మూడుసార్లు గాయపడింది. సినిమా ఆగిపోయే దాకా వచ్చింది. కానీ నవీన్‌ తాపత్రయం చూసిన లత రిస్క్‌ చేసింది. అరవైయేండ్ల వయసులోనూ సినిమా కోసం 200 కిలోమీటర్లకు పైనే పరుగులు తీసింది. 


శభాష్‌ నవీన్‌:  సినిమా ప్రశంసలు అందుకుంది. బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ వాళ్ల దృష్టికెళ్లడంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. ఇప్పుడు నవీన్‌తో సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. భిన్నమైన కథాంశంతో సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది. మానకొండూరు నుంచి పారిపోయిన నవీన్‌ మరాఠీ సినిమా దర్శకుడిగా ప్రత్యక్షం అవడంతో స్థానికులు శభాష్‌ అంటున్నారు. 


తెలుగులో రీమేక్‌ చేస్తాం: దేశబోయిన నవీన్‌ 

దర్శకుడు కావాలనే నా కళ నెరవేరింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డా. శ్యామ్‌ బెనగల్‌ నా అభిమాన దర్శకుడు. ఆయన్ను కలవడానికి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పుణేకు వెళ్లి మూడ్రోజులు ఎదురుచూశా. కానీ కలువలేకపోయా. లాభం లేదనుకొని అదే ఇనిస్టిట్యూట్‌ ముందున్న హోటళ్లలో పనిచేశా. వరంగల్‌కు చెందిన మిత్రుడు గోపాల్‌ సహకారంతో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరా. నాకు ‘మా భూమి’ డైరెక్టర్‌ బి.నర్సింగరావు స్ఫూర్తి. లతా భగవాన్‌ కరే సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 


-గడ్డం సతీష్‌ logo