శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Feb 18, 2020 , 22:50:00

ఓ ఐడియా.. చెత్తనే మార్చేసింది!

ఓ ఐడియా.. చెత్తనే మార్చేసింది!

ఒక ఆలోచన ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా వస్తుందో తెలియదు. చెట్టుపై నుంచి ఆపిల్‌ కింద పడగానే న్యూటన్‌కు ఐడియా వచ్చినట్లుగా.. ఇంట్లో వంటచేయగా వచ్చిన చెత్తను చూడగానే శిఖరకు ఐడియా వచ్చింది. ఈ ఐడియా పాతదే.. కానీ కొత్తగా వెలుగులోకి తీసుకురావాలనుకున్నది. దీనికి ‘అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌'ను వేదికగా చేసుకున్నది శిఖర. వర్క్‌షాపులతో ‘హోమ్‌ కంపోస్టింగ్‌' మొదలుపెట్టింది.అంతేకాకుండా యోగా, వీగన్‌ డైట్‌లలో మెళకువలు నేర్పుతూ ఉన్నత శిఖరాలకు చేరుకున్న శిఖరారెడ్డితో ‘జిందగీ’ ముచ్చటించింది.

గేటుమీద బోర్డు. దానిపై ‘అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌' అని రాసి ఉంది. బయటకు చెట్లు, పుట్టులు ఉన్నట్లు కనిపించినా లోపలికి అడుగు పెట్టగానే ప్రశాంతమైన ప్రదేశం. పచ్చనిచెట్లు.. మట్టితో కట్టిన గోడలు.. హాయిగొలిపే వాతావరణం. కాస్త లోపలికి వెళ్తే.. జనాల హడావిడి. ఏంటా? అని ఆరాతీస్తే.. ‘హోమ్‌ కంపోస్టింగ్‌ అండ్‌ ఎంజైన్‌' వర్క్‌షాప్‌. తెలుగులో చెప్పాలంటే.. ‘చెత్తతో ఎరువు తయారీ’ అన్నమాట. ‘దీనిపైన కూడా వర్క్‌షాప్‌ పెడతారా?’ అని అక్కడున్న ఒకరిని అడిగితే సమాధానం ఇలా ఉంది. ‘పల్లెటూరులో అయితే ప్రతిరోజూ వచ్చే చెత్తను ఒకచోట చేరుస్తారు. 


అది ఎండకు ఎండి, వానకు తడిసి ఏడాదికి ఎరువుగా తయారవుతుంది. దాన్ని తీసుకెళ్లి పంటలకు ఉపయోగిస్తారు రైతులు. మరి పట్టణాలల్లో.. ఇది అసాధ్యం కదా. అందుకనే ఇంటికొక డస్ట్‌బిన్‌. ప్రతిరోజూ మున్సిపాలిటీ బండి వచ్చి చెత్తను తీసుకెళ్తుంది. ఈ పద్ధతి బాగానే ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు సిటీలలో టెర్రస్‌ మీద మినీ గార్డెన్‌ పెట్టి సాగు చేస్తున్నారు. మరి ఆ మొక్కలకు ఎరువు కావాలంటే మార్కెట్లో దొరికే ఎరువు కొనాల్సిందే! అదేదో ఇంట్లో ఉండే చెత్తతో తయారు చేసుకుంటే ఈ తలనొప్పి ఏం ఉండదు కదా’ అని సమాధానం ఇచ్చారు వర్క్‌షాపుకు హాజరైనవారు. ఇలాంటి ఓ ఆలోచన చేసింది ఎవరో కాదు శిఖరారెడ్డి. అమెను పలుకరిస్తే ఎన్నో కొత్త విషయాలు చెప్పింది.


ఎలాంటి చెత్త?

చెత్త ఎక్కడెక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలంటున్నది శిఖర. వంట చేయాలంటే కూరగాయలు కట్‌ చేయాలి. వాటితొక్కలతో ఏమీ చేయలేం కాబట్టి చెత్తబుట్టలో పడేస్తాం. పెరట్లో చెట్లు ఉంటాయి. ఉదయం శుభ్రంగా ఊడ్చినా సాయంత్రానికల్లా మళ్లీ ఆకులు రాలుతాయి. వాటిని కూడా చెత్తబుట్టలో పడేస్తాం. రెస్టారెంట్లు, ఫంక్షన్లు ఇలా పదిమంది కలిసి తిన్న ప్రదేశంలో కచ్చితంగా ఆహారం వృథా అవుతుంది. దీన్ని ఎవరికి దానం చేయకుండా రోడ్డుపైనే పడేస్తారు. కారణం ఏదైనా సరే చెత్త పడేయడం మాత్రం కామన్‌. ఈ చెత్తతో ఎరువు తయారుచేయవచ్చని అందరికీ తెలుసు. కానీ ఎలా చేయాలో తెలియదు. ఈ ప్రయత్నంలో విఫలమైనవారెందరో. వారు సక్సెస్‌ సాధించేలా.. నేర్చుకోవాలని తపన పడే ప్రతివారినీ శిఖరం దాటిస్తానంటున్నది శిఖర.


ఎరువు తయారీ ఎలాగంటే..?

పెద్ద పెద్ద ప్రయోగాలు కూడా చిన్న ఆలోచనలతోనే మొదలవుతాయి. అప్పుడప్పుడు ఇలాంటి సిద్ధాంతాలు ఉపయోగపడుతాయని అంటున్నది శిఖరా. చెత్తబుట్టలకోసం కొత్తవి కొనాల్సిన పనిలేదు. పెయింటింగ్‌ డబ్బాలాంటివి ఏవైనా మూత ఉండేవి ఉంటే సరిపోతాయి. ఇలా మూడు డబ్బాలు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. వాటికి కింద మూడు చిన్న రంధ్రాలు పెట్టాలి. మరుసటి రోజు కూరగాయల తొక్కులను డబ్బాలో వేయాలి. దానికి ముందు కొబ్బరినార పెట్టాలి. దానిపై తొక్కులు. వాటిపైన పేపర్‌తో కప్పి మూత పెట్టేయాలి. తరువాతి రోజు పేపర్‌ తీసి మరలా కొబ్బరినార పెట్టి ఆకులు, కూరగాయల తొక్కులు ఇలా ఏవి ఉంటే అవి పెట్టి మరలా పేపర్‌ పెట్టాలి. 


ఇలా క్రమం తప్పకుండా పాటించాలి. ఈ చెత్తబుట్టలను ఎండలో కాకుండా ఒక మూలన పెడితే సరిపోతుంది. కింద రంధ్రాల ద్వారా గాలి బయటకు పోయి, కొత్తగాలి లోపలికి వచ్చి కుల్లిన వాసన రాకుండా చేస్తుంది. ఇలా ఐదు వారాలకు మూడు డబ్బాలు మారేసరికి ఎరువు పొడిపొడిగా మారుతుంది.  ఎలాంటి రసాయనాలు కలుపని ఎరువు మొక్కలకు అందుతుంది. దీంతో మొక్కల పెరుగుదలలో, వాటిని తినేవారిలో ఆరోగ్యం పెరుగుతుంది. ఈ ప్రాసెస్‌ అంతా వర్క్‌షాపులో చేసి చూపిస్తున్నది శిఖర. 


మూడురకాల వర్క్‌షాపులు

ఈ పద్ధతిని శిఖర ఎక్కడా నేర్చుకోలేదు. ఎవరినీ సలహా అడగలేదు. సొంతంగా పట్టుసాధించింది. నెట్‌లో సెర్చ్‌ చేసింది. పుస్తకాలు చదివింది. ఇతర రాష్ర్టాలలో చేస్తున్న వారి వీడియోలు చూసింది. ఇంట్లో తయారు చేసేందుకు సిద్ధం చేసుకున్నది. ఇంట్లో చెత్త నిల్వ ఉంచాలంటే మామూలు విషయం కాదు. అది ఏ మాత్రం గాడి తప్పినా భరించలేని వాసన వస్తుంది. ‘ఇవన్నీ నీకెందుకు?’ అని తల్లితో తిట్లుతిన్నది. ఈమె ప్రయత్నానికి కుటుంబసభ్యులే సాయం చేయడం మొదలుపెట్టారు. మామూలుగా ఇంట్లో కంటే హాస్టల్స్‌, రెస్టారెంట్లు లాంటి ప్రదేశాలలో ఈ పద్ధతి పాటిస్తే ఎక్కువ ఎరువు వస్తుందని అంటున్నది శిఖర. డిసెంబర్‌ 21న జరిగిన వర్క్‌షాపుకు ఇంట్లోని డబ్బాలనే ఉదాహరణగా చూపించింది. 


మరికొన్ని వర్క్‌షాపులు..

కంపోస్టింగ్‌ వర్క్‌షాపులే కాదు యోగా, వీగన్‌ డైట్‌ మీద కూడా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నది శిఖరా. ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ గురించి ఇంటి దగ్గరే కొంతమందికి యోగా నేర్పిస్తున్నది. దీంతో చాలామంది సమస్యను అధిగమిస్తున్నారు. శిక్షణకు వచ్చేవారి వీలును బట్టి ఉదయం, సాయంత్రం గంట  చొప్పున యోగా క్లాసులు చెబుతున్నది. నేర్పమని ఎక్కువమంది అడిగితే వర్క్‌షాపులు నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి 2న అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌లో ‘యోగా ఫర్‌ పికాస్‌' పేరుతో వర్క్‌షాపు నిర్వహించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 1000. యోగా ఒకటే చేస్తే సరిపోదు డైట్‌ కూడా పాటించాలి. చాలామంది ‘వీగన్‌ డైట్‌' వెజిటేరియన్‌ గాని, నాన్‌వెజిటేరియన్‌ అని అనుకుంటారు. దీన్ని పూర్తిగా పాటించాలంటే జంతువుల నుంచి వచ్చే పదార్థాలను కూడా వాడకూడదు. భూమినుంచి పండించిన వాటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఫిబ్రవరి 2న వీగన్‌డైట్‌పై వర్క్‌షాపు పెట్టింది. నెలలు, సమయాన్ని బట్టి ఫీజు ఉంటుంది. మార్చిలో ‘హోమ్‌ కంపోస్టింగ్‌ బయోఎంజైమ్‌' మీద వర్క్‌షాపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.facebook.com/ OurSacredSpace ను సంప్రదించండి.


నచ్చితే చాలు 

నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. నాన్న రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. అమ్మ హౌస్‌వైఫ్‌. నాకో తమ్ముడు. నేను పెర్మాకల్చర్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ చేసి ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. ఉద్యోగం మానేసి 2018 అక్టోబర్‌లో ముంబై వెళ్లి ‘హఠయోగా’ కోర్స్‌ చేశాను. హైదరాబాద్‌కు వచ్చాక అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌లో వర్క్‌షాపులు నిర్వహించడానికి పర్మిషన్‌ అడిగాను. వారు నన్ను ‘పార్ట్‌టైమ్‌గా పనిచేస్తావా?’ అని అడిగారు. ఓకే చెప్పాను. అప్పటినుంచి వర్క్‌షాపులు, ఆ ప్రదేశంలో జరిగే ప్రోగ్రామ్స్‌కి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాను. దీంతోపాటు అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌లో క్లినికల్‌ న్యూట్రిషన్‌ కోర్సు చేస్తున్నాను. ఇది పూర్తయ్యాక ప్రజలకు ఆహార విషయాలపై అవగాహన కల్పిస్తాను. 

- శిఖరారెడ్డి


-సరస్వతి వనజ       

-వీరగోని రజినీకాంత్‌