ఆదివారం 23 ఫిబ్రవరి 2020
వీర జవానులారా వందనం..

వీర జవానులారా వందనం..

Feb 14, 2020 , 22:57:13
PRINT
వీర జవానులారా వందనం..

ఒక్కొక్కరిది ఒక్కో కథ. మాటలకందని బాధ. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఒకవైపు.. దేశం కోసం బిడ్డలను ఇచ్చామన్న గర్వం మరోవైపు. ఉప్పొంగే ఉద్వేగం.. తమ బిడ్డల స్మారక స్థూపాల వద్ద ఆపుకోలేని కన్నీటి ధార.. ఇదీ వీర జవాన్ల తల్లిదండ్రులు, వారి సతీమణులు, కుటుంబసభ్యుల పరిస్థితి. ఎవ్వరిని కదిలించినా బిడ్డలను కోల్పోయామన్న బాధకంటే.. దేశసేవలో తమ బిడ్డ ఉన్నాడన్న సంతృప్తి కనిపించింది. కష్టాల కడలిలో మధ్యలో వదిలివెళ్లినా.. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ గడుపుతున్నారు వారి కుటుంబసభ్యులు. పుల్వామా సహా పలు ఘటనల్లో అమరులైన తెలంగాణ, ఏపీకి చెందిన 18 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబసభ్యులను సీఆర్‌పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌లో ఘనంగా సత్కరించారు. ఆ అమరుల త్యాగాలకు సంబంధించి వారు పంచుకున్న విషయాలు వారి మాటల్లోనే..

అమర జవాను రామ్మోహన్‌ తల్లిదండ్రులను సన్మానిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ ఐజీ ఎంఆర్‌ నాయక్‌ 


దేశంకోసం ప్రాణాలు అర్పించడంలోనే తమ సంతోషాన్ని వెతుక్కున్నారు. ముష్కరుల పన్నాగమేదైనా.. ప్రాణాలు ఎదురొడ్డి నిలబడ్డారు. ‘నీకు ఈ కొలువెందుకు బిడ్డా..’ అంటే.. ‘చావు ఎప్పుడైనా వస్తదే అవ్వ.. అందుకే దేశం కోసం సస్తున్నా..’ అంటూ పుట్టిన నేల రుణం తీర్చుకున్నారు ఈ వీర జవానులు. పుల్వామాలో జరిగిన నరమేధానికి ఏడాది పూర్తవడంతో.. ఆ అమరుల యాదిలో వివిధ ఘటనల్లో వీరమరణం పొందిన తెలుగు రాష్ర్టాలకు చెందిన 18 మంది జవాన్లకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు, కుటుంబ సభ్యులుఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబసభ్యులను కొందరిని ‘జిందగీ’ పలుకరించగా.. తమ బిడ్డల వీర త్యాగాల గురించి చెబుతూ కంటతడిపెట్టుకున్నారు.


మంచి పేరు తెచ్చుకున్నాడు..

మాది అనంతపురం జిల్లా కదిరి తాలూకా, నల్లమడ గ్రామం. మా కొడుకు రామ్మోహన్‌  మిలిటరీలో చేరడం, దేశం కోసం పనిచేయడం అంటే ఎంతో ఇష్టం అనేవాడు. అన్నట్టే 2011లో సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్‌ అయ్యిండు. ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా రోజుకు ఒక్కసారైన ఫోన్‌ చేసి మాట్లాడేటోడు. ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఏ పనైనా ముందుండి చేసేటోడు.. ట్రైనింగ్‌ల కూడా అందిరికంటే ముందే ఉండేవాడంట. అట్లనే డ్యూటీల కూడా. ఎక్కడ ఉన్నా మంచి పేరు ఉండేదంట. బెటాలియన్‌ మొత్తానికి మీ వోడు తెలుసు అని అందరూ చెప్పేటోళ్లు. 2014, డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఎక్కడ ఉన్నా మంచి పేరు ఉండేది.. ఇప్పుడు దేశం కోసం కొడుకును ఇచ్చారన్న మంచి పేరు మాకు ఇచ్చి పోయిండు.’ 

- అమరజవాన్‌ రామ్మోహన్‌ , తండ్రి  వెంకటస్వామి,తల్లి కిష్టమ్మ


మా కుటుంబానికే ధైర్యం వాడు..  

‘మా కుటుంబం మొత్తానికి ధైర్యమే మా వాడు గోవర్ధన్‌రెడ్డి. డిగ్రీ ఫస్టియర్‌లో ఉండగానే సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. అంత కష్టమైన ఉద్యోగం ఎందుకురా అని మేం వద్దన్నా, నా కొడుకు వినలేదు. ‘మనకు ప్రభుత్వ ఉద్యోగాలు త్వరగా రావు. వచ్చినప్పుడే వెళ్లాలి. ఇది దేశానికి సేవ చేసే ఉద్యోగం. ఇది నాకు మంచి అవకాశం’అని చెప్పిండు. సీఆర్‌పీఎఫ్‌లో చేరిన నాలుగేండ్లలో ఢిల్లీలో కొన్నాళ్లు, పంజాబ్‌, కేరళ, నాగ్‌పూర్‌ తర్వాత ఛత్తీస్‌గఢ్‌కి వచ్చాడు. ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఎప్పుడు ఫోన్‌ చేసినా నాకేం ఫర్వాలేదు. నేను బాగానే ఉన్నా అనేవాడు. అడవుల్లో డ్యూటీలో ఉన్నా.. ఎప్పుడూ ఇంత కష్టం ఉంటదని చెప్పేటోడు కాదు. కానీ మాకుమాత్రం ఎప్పుడు నేను బాగానే ఉన్నా.. మీరు జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పేటోడు. మా కుటుంబానికే ధైర్యం వాడు. ఇంటికి సంబంధించి ఏ విషయమైనా ఇట్లా చేసుకోవాలి..అట్లా చేసుకోవాలి అని చెప్పేవాడు. 2014 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, బీజాపూర్‌ జిల్లాలో జరిగిన నక్స్‌ల్‌ దాడిలో అమరుడయ్యాడు. దేశంకోసం వాడు ఇప్పుడు పోయాడు. బాధ ఉన్నా.. కొంత గర్వంగా కూడా ఉంటది మాకు.’ 

- అమర జవాన్‌ గోవర్ధన్‌రెడ్డి ,తల్లిదండ్రులు కరుణారెడ్డి, లలితమ్మ


కొడుకొస్తడనుకుంటే.. బట్టలొచ్చినయ్‌! 

‘మాది సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం, పోస్టు కట్కూర్‌, గ్రామం రాజాతండా. నాకు ముగ్గురు బిడ్డలు. ఒక్కడే కొడుకు. పోలీస్‌ ఉద్యోగం వద్దురా అన్నా వినలేదు. ‘నాకు ఏం కాదు. దేశం కోసం పోరాడుతున్నా..’ అని చెప్పేటోడు. 2005లో సీఆర్‌పీఎఫ్‌ల చేరిండు. అసోంలో ట్రైనింగ్‌.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌, తమిళనాడు, మహారాష్ట్రలో చేసి, సుకుమ జిల్లాకు వచ్చిండు. రోజుకు మూడుసార్లు ఫోన్‌ చేసి, ‘ఏం చేస్తున్నరు. తిన్నరా.. బాగున్నరా.. నేను బానే ఉన్నా.. తొందర్లనే వస్త’ అని చెప్పేటోడు. 2014 ఏప్రిల్‌ 9న సుక్మాజిల్లా చింతగుంట దగ్గర జరిగిన నక్సలైట్ల దాడిలో నా కొడుకు నర్సింహా చనిపోయిండు. అక్కడి నుంచి సార్లు ఫోన్‌ చేసిండ్రు. ఆ ఫోన్‌ రావడంతోనే నేను సోయి లేకుండా పడిపోయిన. కంతల నుంచి, పక్కటెముకల నుంచి ఒకటి రెండు బుల్లెట్లు తాకినయి, చనిపోయిండు అని చెప్పిండ్రు. కొడుకు ఇంటికి వస్తడు అనుకుంటే చినిగిపోయిన బట్టలు వచ్చినయ్‌. అటిని సూస్తే మహా దుఃఖం వస్తది. ఉన్న ఒక్క కొడుకు పోయినా, దేశం కోసం పోరాటం చేసిండన్న సంతోషం అయితే ఉంటది.’

- అమరజవాన్‌ నర్సింహ తండ్రి లింగయ్య 


ఎక్కడున్నా చావు తప్పదన్నాడు...

‘నా పేరు ఆలేటి ప్రతాప్‌రెడ్డి. మాది నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాది లింగసానిపల్లె గ్రామం. నాకు ఇద్దరు కొడుకులు. విజయభాస్కర్‌రెడ్డి చిన్నవాడు. ముందు నుంచి పోలీస్‌ అంటే చాలా ఇష్టం. ‘పోలీస్‌ ఉద్యోగం ఎందుకు రా.. ఎప్పుడు ఏం జరుగుతదో తెల్వదు అన్నా’ అయినా వినలేదు. ‘చావు ఎక్కడ ఉన్నా వస్తది నాన్నా.. నేను చచ్చినా, బతికినా పోలీస్‌గానే ఉంటాను’ అని చెప్పిండు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఉద్యోగం వచ్చింది. ఐదేండ్లు జమ్ముకాశ్మీర్‌లో చేసి వచ్చాడు. అక్కడి నుంచి పశ్చిమబెంగాల్‌కు 2011లో వచ్చిండు. వచ్చిన ఏడాదికి పశ్చిమ బెంగాల్‌లో జంగల్‌ డ్యూటీలో ఉన్నప్పుడు ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. అప్పటికి పెండ్లి అయి ఏడాది అయింది. కొడుకును పోగొట్టుకున్న దుఃఖం ఇంకా కలిచి వేస్తనే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం కూడా అంతా కోడలికే వెళ్లింది. తల్లిదండ్రులుగా మాకు ఏ ఆధారం లేకుండా పోయింది. కష్టం చేసుకుంటేనే జరుగుబాటు ఉంది. తల్లిదండ్రులుగా మాకు కూడా ప్రభుత్వ సాయం ఇవ్వాలని కోరుతున్నా.’ 

- అమరజవాన్‌ విజయభాస్కర్‌రెడ్డి తండ్రి ప్రతాప్‌రెడ్డి  


అండగా నిలువడం మా కర్తవ్యం  


దేశ రక్షణ కోసం గత పదేండ్లలో ఏపీ, తెలంగాణ నుంచి అమరులైన 18 మంది కుటుంబాలకు సీఆర్‌పీఎఫ్‌ ఎప్పుడూ అండగా ఉంటుంది. అది మా కర్తవ్యం. అమర వీరుల కుటుంబాలకు కేవలం ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించడంతో సరిపెట్టకుండా, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి వారి విద్యార్హతను బట్టి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మేం చర్యలు తీసుకుంటున్నాం. మా ఉన్నతాధికారులను వారి ఇండ్లకు పంపి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి, వారిలో భరోసా నింపుతున్నాం. 

- ఎంఆర్‌ నాయక్‌, ఐజీ, సదరన్‌ సెక్టార్‌, సీఆర్‌పీఎఫ్‌


  • నాగోజు సత్యనారాయణ, స్టేట్‌ క్రైం రిపోర్టర్‌


logo