ఆదివారం 23 ఫిబ్రవరి 2020
బ్రిటన్‌ అటార్నీ జనరల్‌గా సుయెల్లా..

బ్రిటన్‌ అటార్నీ జనరల్‌గా సుయెల్లా..

Feb 14, 2020 , 22:55:19
PRINT
బ్రిటన్‌ అటార్నీ జనరల్‌గా సుయెల్లా..

బ్రిటిష్‌ వారు ఒకప్పుడు భారతదేశ ప్రజల్ని బానిసలుగా చేసుకొని పాలించారు. ఇప్పుడు అదే బ్రిటిష్‌రాజ్యంలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎన్నికల్లో గెలుపొంది భారతీయుల తెగువను చాటుతున్నారు. ఆక్కడి ప్రభుత్వంలో కీలక పదవులను చేపట్టే స్థాయికి ఎదుగుతున్నారు. బ్రిటన్‌ దేశ మంత్రివర్గ విస్తరణలో మన దేశ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మన్‌ అటార్నీ జనరల్‌గా ఎంపికయ్యారు.

ఇటీవల బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గ విస్తరణలో మన సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు అవకాశం కల్పించారు. రిషి సునక్‌ ఆర్థిక శాఖ, అలోక్‌ శర్మ, సుయెల్లా బ్రేవర్‌మన్‌ అటార్నీ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గోవాకు చెందిన 39 ఏండ్ల సుయెల్లా బ్రేవర్‌మన్‌పై నమ్మకంతో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఆమెను అటార్నీ జనరల్‌గా నియమించారు.   


ఉమా ఫెర్నాండేజ్‌, క్రిస్టీ దంపతులకు జన్మించారు సుయెల్లా. గోవాకు చెందిన ఉమా ఫెర్నాండేజ్‌ 1960 తర్వాత ఆమె బ్రిటన్‌కు వలస వెళ్లారు. 45 ఏండ్ల పాటు నర్సుగా సేవలందించిన ఉమా.. కొన్నాళ్లు కౌన్సిలర్‌గానూ పనిచేశారు. ఆమె భర్త క్రిస్టీ హౌజింగ్‌ సొసైటీలో పనిచేశారు. గ్రేటర్‌ లండన్‌లోని హరోవ్‌ ప్రాంతంలో పుట్టి, వెంబ్లీ నగరంలో పెరిగారు సుయెల్లా బ్రేవర్‌మన్‌. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండే సుయెల్లా.. స్కాలర్‌ షిప్‌తోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జిలోని క్వీన్స్‌ కాలేజీలో ‘లా’ చదివారు. పాంథియోన్‌ సోర్బొన్నే విశ్వవిద్యాలయంలో యూరోపియన్‌, ఫ్రెంచ్‌ భాషల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ కన్జర్వేటివ్‌ అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. 2005 నుంచి 2015 వరకు న్యాయవాదిగా సేవలందించారు. 


విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆమె పలు పత్రికల్లో కథనాలు రాశారు. సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు పలు కేసులను వాదించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో సుయెల్లా తొలిసారిగా పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 56.1 శాతం (22వేల ఓట్ల మెజారిటీ) సాధించారు సుయెల్లా. విద్యావ్యవస్థలో ఉండే అసమానతలను తొలగించేందుకు కృషి చేసి విజయం సాధించారు. మైఖేలా కమ్యూనిటీ స్కూల్‌ గవర్నర్ల అధ్యక్షురాలిగా సేవలందించారు. పలు స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుగా ఉన్నారు. ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


2017లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తరపున సుయెల్లా విజయంఢంకా మోగించారు. 2018లో యూరోపియన్‌ యూనియన్‌కు సెక్రటరీగా, బ్రెగ్జిట్‌ మంత్రిగా, ట్రెజరీకి పార్లమెంటరీ ప్రైవేటు కార్యదర్శిగా ఆమె సేవలందించారు. గతేడాది ‘రెల్‌' అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు సుయెల్లా. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 2019లో జరిగిన అక్కడి ఎన్నికల్లో ఫేర్‌హామ్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో సుయెల్లా 26వేలకు పైగా మెజార్టీ సాధించారు. ‘అందరికీ న్యాయం చేయాలనే ఆకాంక్ష ఈ పదవి ద్వారా చేయగలనని నమ్ముతున్నాను. అటు ప్రభుత్వానికి, ప్రజలకు అవసరమైన సేవలను అందించి మెరుగైన పరిపాలనకు కృషి చేస్తాను’ అని అంటున్నారు సుయెల్లా బ్రేవర్‌మన్‌.


logo