శనివారం 29 ఫిబ్రవరి 2020
ఆటిజం చిన్నారులకు..ఆత్మీయ చికిత్స!

ఆటిజం చిన్నారులకు..ఆత్మీయ చికిత్స!

Feb 11, 2020 , 23:28:20
PRINT
ఆటిజం చిన్నారులకు..ఆత్మీయ చికిత్స!

బోసి నవ్వులతో పసిపిల్లలు ఇల్లంతా సందడి చేస్తుంటారు. బుడిబుడి అడుగులు వేస్తూ ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటారు. ఆ పరిస్థితికి భిన్నంగా మానసికంగా సరైన ఎదుగుదల లేని (ఆటిజం) పిల్లలు పుడితే. వారి బాధ మాటల్లో చెప్పేది కాదు. కుటుంబ సభ్యులంతా పుట్టెడు దుఃఖంతో కుమిలి పోవాల్సిందే. సరిగ్గా అటువంటి సమస్యనే ఎదుర్కొన్న ఓ చిన్నారి తల్లి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. తమలా ఏ తల్లిదండ్రులూ బాధపడకూడదనే తలంపుతో ఆటిజం బారిన పడిన చిన్నారులకు ఉచితంగా సేవలందించేందుకు ‘పినాకిల్‌ బ్లూమ్స్‌ సంస్థ’ను ఏర్పాటు చేశారు సరిపల్లి శ్రీజారెడ్డి. ఆమె చేస్తున్న సేవ గురించే ఈ కథనం..

మానసిక ఎదుగుదల లేని బుద్దిమాంద్యం ఉన్న పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' చేసే పని అదే. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికితీయడానికి, వారి కుటుంసభ్యులను, పాఠశాలలను కూడా భాగస్వాములను చేస్తున్నది. అందుకోసం సృజనాత్మక శిక్షణా కోర్సులను రూపొందించారు శ్రీజారెడ్డి. ఆటిజం చిన్నారులకు అర్థమయ్యేలా పలురకాల విధానాలను అనుసరిస్తున్నారు. పినాకిల్‌ బ్లూమ్స్‌ సంస్థ  అందించే సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అనేక చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్యుపేషనల్‌ థెరపీ, ప్లే అండ్‌ స్టడీ గ్రూప్స్‌, ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ వంటివి ఉన్నాయి. ప్రతి చిన్నారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిష్కరిస్తున్నారు. వారికి తగినట్లుగా ప్రత్యేకంగా కోర్సులు రూపొందించారు. ఆయా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. 


కేంద్రం ఏర్పాటు

శ్రీజారెడ్డి కొడుకు సంహిత్‌కు ఏడాదిన్నర దాటిన తర్వాత ‘ఆటిజం’ (బుద్ధిమాంద్యం) ఉన్నదని తెలిసింది. అప్పటివరకు వారికి ‘ఆటిజం’ అంటే ఏమిటో తెలియదు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి శ్రీజ, కోటిరెడ్డిలు అన్వేషణ మొదలుపెట్టారు. ‘ఆటిజం’ గురించిన 400 పేజీల పుస్తకం లభించింది. ఆ సమస్య గురించి చదువుతున్న కొద్దీ ఇద్దరికీ దుఃఖం ఆగలేదు. ఎంతో బాధపడ్డారు. ‘ఆటిజం’ ఎందుకువస్తుందో తెలుసుకోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ముప్పై ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారి పరిశోధనలు ఫలితాన్నివ్వలేదు. 1995లో 500 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. 2019 నుంచి 32 మంది పిల్లల్లో ఒకరు ‘ఆటిజం’ బారిన పడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న శ్రీజ, కోటిరెడ్డిలు ఎంతో చలించిపోయారు.


కొద్దిరోజులు తమ కుమారుడికి చికిత్స అందిస్తే మార్పు వస్తుందన్నారు వైద్యులు. దీంతో చేసేదేమీ లేక డాక్టర్ల సలహా మేరకు చికిత్స ఇప్పించడం మొదలు పెట్టారు. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ ఒక చోట. ఫిజియో థెరపీ మరొక చోట. స్పీచ్‌ థెరపీ ఇంకో దగ్గర ఇలా చికిత్స కోసం రోజుకు నాలుగైదు చోట్లకు తిరగాల్సి వచ్చేది. ఇటువంటి చిన్నారులకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే వేదిక ద్వారా అందించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆటిజం చిన్నారులకు ఎటువంటి సమస్యలుంటాయో? వాటిని ఏవిధంగా పరిష్కరించాలనేదాని గురించి పరిశోధన చేయడానికి రూ. 4కోట్లు ఖర్చు చేశారు. మూడేండ్ల రీసెర్చ్‌ తరువాత ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' పేరుతో సుచిత్రలో మొదటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బోయినపల్లి, హైదరాబాద్‌లలో వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇలా మొత్తం 14 కేంద్రాలు నెలకొల్పారు.  


ఉచిత చికిత్స

ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రతిరోజూ 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రతి సెషన్‌లో పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులు గమనించాల్సి ఉంటుంది. అలా వారు గమనించిన అంశాల ద్వారా ఏమేం మార్పులు చోటు చేసుకున్నాయనేదానిపై ‘పినాకిల్‌ కనెక్ట్‌ యాప్‌'లో రేటింగ్‌ ఇవ్వడం ద్వారా తమ స్పందనను తెలియచేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తెలిపిన సమాచారం ప్రకారం పిల్లలకు ఇచ్చే థెరపీలో మార్పు ఉంటుంది. అలా వారి స్థాయిలను బట్టి చిన్నారులతో ఎలా మెలగాలో నిపుణులు సూచిస్తారు. వీరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని 3 నెలల నుంచి రెండేండ్ల వరకూ థెరపీ అందిస్తారు. థెరపీ ఇప్పించలేని నిరుపేదలకు సేవా, కోటి ఫౌండేషన్‌ల ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 300 మంది పిల్లలు  పినాకిల్‌ బ్లూమ్స్‌ ద్వారా ఉచితంగా చికిత్స పొందుతున్నారు. 


వంద మంది స్పెషలిస్ట్‌లు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆటిజం చిన్నారులే కాదు టీనేజ్‌ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తీసుకురాదగిన థెరపీలను ఇక్కడ అందిస్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడకు వచ్చి కౌన్సెలింగ్‌ తీసుకొని పూర్తిగా కోలుకుంటున్నారు. ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' కేంద్రాల్లో మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌డేటా టెక్నాలజీ, ఆడియాలజిస్ట్‌, సైకాలజిస్టు, స్పీచ్‌, లాంగ్వేజ్‌ పాత్‌, ఆక్యుపేషనల్‌ థెరపీ, ఫిజియోథెరపీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందించడానికి ఆయా విభాగంలో నిపుణులను నియమించారు. ఇటువంటి పిల్లలకు మెరుగైన సేవలందించడానికి శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌సైన్సెస్‌, హార్వర్డ్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పరిశోధనలు జరుపుతున్నారు. 


ఎక్కడి నుంచో వచ్చి.. 

ఆటిజం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో సుమారు కోటి మంది ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారికి అవసరమైన వైద్య పరీక్షలు జరుగడం లేదు. దీంతో ఈ సమస్య బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య మరింతగా పెరుగుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుప్రజలే కాకుండా, తమిళనాడు, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, వంటి రాష్ర్టాలనుంచి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. విశేషమేమిటంటే అమెరికా,లండన్‌, కువైట్‌, ఖతార్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలవారు ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' సేవలు అందుకుంటున్నారు. 

- డాక్టర్‌ సరిపల్లి శ్రీజరెడ్డి, పినాకిల్‌ బ్లూమ్స్‌ నిర్వాహకురాలు   • పసుపులేటి వెంకటేశ్వరరావు
  • గడసంతల శ్రీనివాస్‌


logo