శనివారం 29 ఫిబ్రవరి 2020
విజయానికి పట్టాభిషేకం!

విజయానికి పట్టాభిషేకం!

Feb 10, 2020 , 23:21:21
PRINT
విజయానికి  పట్టాభిషేకం!

వివిధ రంగాలు. విభిన్న నేపథ్యాలు. ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో మలుపులు. అన్నీ దాటేసి విజయం వైపు ప్రయాణం. అదీ అత్యధిక వయసులో కాదు. కేవలం మూడు పదుల వయసులోపే.. వారిప్పుడు దేశం గర్వించదగ్గ సంపన్నులు. సంపన్నులంటే ఆస్తి, అంతస్తుల్లో కాదు. మంచిగుణం, మనసు అన్నింటికంటే వారు ఎంచుకున్న రంగానికి వందశాతం న్యాయం చేయడం. వారు పనినే దైవంగా భావిస్తూ ఆయా రంగాల్లో అద్భుత విజయాలు సాధించారు. అలాంటి వారిని గుర్తించిన ప్రముఖ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌ అండర్‌ 30’లో చోటిచ్చింది. వారి విజయనేపథ్యం ‘జిందగీ’ ప్రత్యేకం..

పేరు : సాయి పల్లవి

వయసు : 27 యేండ్లు 

వృత్తి : నటన

సాయి పల్లవి.. ఈమె పూర్తి పేరు సాయిపల్లవి సెంతామరై. డ్యాన్సర్‌, నటిగా మాత్రమే మనకు తెలుసు. కానీ ఆమె స్కూల్లో ఉన్నప్పటి నుంచే హార్డిల్స్‌ ప్లేయర్‌. తమిళనాడులోని ఊటికి సమీపంలోని కొత్తగిరి అనే గ్రామంలో జన్మించింది. యూఎస్‌లోని టిబిలిసి స్టేట్‌ మెడికల్‌ కళాశాల(జార్జియా)లో వైద్య విద్యను చదివింది. సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. తాను మేకప్‌కు పూర్తిగా దూరం అంటున్నది. సహజ అందంతో ప్రేక్షకుల మనసులు దోస్తున్నది. అంతేకాదు.. అందానికి సంబంధించిన ప్రకటనల్లో నటించనని తెగేసి చెప్పింది. 2016లో కొచ్చి టైమ్స్‌ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌'గా ప్రకటించింది. సాయి పల్లవి వెజిటేరియన్‌. మలయాళం ప్రేమమ్‌లో ‘రాకాకుంతూ..’ పాటకు తానే స్వయంగా కొరియోగ్రఫీ చేసింది. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యరాయ్‌, మాధురీ దీక్షిత్‌ వీడియోలు చూసి డ్యాన్స్‌ నేర్చుకుంది. డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఎలాంటి క్లాసులు అటెండ్‌ కాలేదట. ఓనమ్‌ పండుగంటే ఆమెకు చాలా ఇష్టమట. ఆ రోజున ఇంటి ముందు రంగవల్లులు వేస్తూ తెగ సంబరపడిపోతుంది. కార్డియాలజిస్ట్‌ అయి ఎంతోమందికి తనవంతు సహాయం చేయాలని సాయిపల్లవి ఆశపడుతున్నది. 


పేరు : ఆకాంక్ష శర్మ 

వయసు : 28 ఏండ్లు 

వృత్తి : ఐకియా డిజైనర్‌


ఆకాంక్ష శర్మ.. ఢిల్లీకి చెందిన యువతి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. అనేక కట్టుబాట్ల ఇబ్బందులను ఎదుర్కొన్నది. కానీ  తెలియని రంగంలో ఆమె కృషి చేయాలనుకుంది. అదే ఆలోచనతో ఢిల్లీలోని నేషనల్‌  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో చేరింది. అక్కడ ఆమెను కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ ఇనిస్టిట్యూట్‌తో ఐకియా డిజైనింగ్‌ ప్రాజెక్టులు నిర్వహించేది. ఈ క్రమంలో ‘ఐకియా’ క్రియేటివిటీ విభాగం నుంచి ఆకాంక్ష ఆహ్వానాన్ని అందుకుంది. కానీ దాన్ని ఆమె తిరస్కరించింది. మూడు సంవత్సరాల కోర్సు పూర్తి కానిదే ఆమె ఉద్యోగంలో చేరాలనుకోలేదు. దీంతో ఐకియా ఆకాంక్ష కోసం ఏడాది పాటు వేచి చూసింది. కోర్సు అయిన తర్వాత ఆకాంక్ష 2017 ఫిబ్రవరిలో ఐకియాలో టెక్స్‌టైల్‌ డిజైనర్‌గా చేరింది. ఆకాంక్ష సృజనాత్మకతను మెచ్చిన ఐకియా ఆమెను తొలి భారత యువ డిజైనర్‌గా ఎంచుకుంది. ఐకియా ఉత్పత్తులకు స్వొంత ఆలోచనలతో రూపాలను, రంగులను ఇచ్చి ఆకర్షణీయంగా చేయడంలో ఆకాంక్ష ప్రతిభావంతురాలు.    టెక్స్‌టైల్‌ ఆర్టిస్ట్‌తో పాటు ఆకాంక్ష విజువల్‌ ఆర్టిస్ట్‌ కూడా. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలస్ట్రేషన్స్‌లో కూడా ఆమె పని చేస్తున్నది. 


పేరు : సాయి గోలె 

వయసు : 26 

వృత్తి : కో ఫౌండర్‌, భారత్‌ అగ్రీ


 ‘భారత్‌ అగ్రీ’  సాంకేతిక వ్యవసాయ సమాచారానికి వేదిక. టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేయడం, రైతులతో కలిసి పని చేయడం ఈ సంస్థ లక్ష్యం. భారత్‌ అగ్రీని స్థాపించిన వారిలో కో-ఫౌండర్‌ సాయిగోలె.  ఐఐటీ మద్రాస్‌, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ విద్యార్థిని. సాయిగోలె కుటుంబం 30 సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉంది.  ఈ రంగంలో ఉండే నిర్ధిష్ట సమస్యల గురించి ఆమెకు అవగాహన ఉంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ‘భారత్‌ అగ్రీ’ స్థాపనలో భాగమైంది. పీజీ తర్వాత పుణెలో ఐదు సంవత్సరాలు రైతులతో ఉండి సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోగలిగింది. శాస్త్రీయ పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో రైతులు చాలా తక్కువ సంపాదిస్తున్నారని తెలుసుకొని ‘భారత్‌ అగ్రీ’ స్థాపనలో కృషి చేసింది. ఇటీవల విడుదల చేసిన యాప్‌ ద్వారా సుమారు లక్ష మంది వినియోగదారులు భారత్‌ అగ్రీ సేవలు అందుకుంటున్నారు.  2017లో ఈ సంస్థ ఉబేర్‌ పిట్చ్‌ పోటీలో విజయం సాధించింది. ఉబేర్‌ ఈ స్టార్టప్‌లో 35 లక్షల పెట్టుబడికి ముందుకు వచ్చింది. 


పేరు : పాలక్‌ షా

వయసు : 28

వృత్తి : సీఈఓ, ఎకాయా.


ఎకాయా అనేది లగ్జరీ చేనేత బ్రాండ్‌. ‘పాలక్‌ షా’ ఈ కంపెనీనీ 2012లో స్థాపించింది. శతాబ్దానికి పైగా పాలక్‌ షా కుటుంబం వస్త్ర వ్యాపారంలో ఉంది. పాలక్‌ షా లండన్‌లోని కింగ్స్‌ బిజినెస్‌ కాలేజీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యనభ్యసించింది. భారతీయ వస్ర్తాల చుట్టూ ఉండే సంప్రదాయ కళను కొత్తగా అందించాలన్న తపనతో లగ్జరీ చేనేత బ్రాండ్‌ ఎకాయాను స్థాపించింది. భారతీయ వస్ర్తాలను దైనందిన జీవితంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ కంపెనీ బ్రాంచీలు 40 కోట్ల వార్షిక ఆదాయంతో, 80 వేల మంది చేనేత కళాకారులతో నడుస్తున్నాయి. ఢిల్లీ, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబైలో ఈ సంస్థ ప్రధాన దుకాణాలను కలిగి ఉంది. చేతితో నేసిన చీరలు, లెహంగాలు, రెడీ టు వేర్‌ వస్ర్తాలు ఉత్పత్తి చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. పాలక్‌కు  2018లో ఉమెన్‌ ఆఫ్‌ ది డికేడ్‌ ఇన్‌ సైస్టెనబుల్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ అవార్డును ఎకనామిక్‌ ఫోరం అందించింది. చేనేత, వస్త్ర సంపదను ప్రపంచానికి తెలియజేయడం, దాని కళానైపుణ్యాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యం అని పాలక్‌ అంటున్నారు. 


పేరు : ప్రియా ప్రకాశ్‌ 

వయసు : 28 యేండ్లు 

వృత్తి : హెల్త్‌ సెట్‌ గో, సీఈఓ


ప్రియా ప్రకాశ్‌ది హర్యానాలోని గూర్గావ్‌. ఆమె స్థానిక రిషివ్యాలీ స్కూల్లో చదివింది. ఆమె బాల్యంమంతా అధిక బరువుతో బాధపడింది. తనలా మరే విద్యార్థి బాధపడకూడదని ఆమె నిర్ణయించుకుంది. డిగ్రీ తర్వాత 2014లో ‘హెల్త్‌ సెట్‌ గో’ అనే ఆరోగ్య రక్షణ సంస్థను ప్రారంభించింది.  ఈ సంస్థ ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేవారు. ఇందులో భాగంగా పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. చేతులు ఎలా కడుక్కోవాలి. పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలా? ఆరోగ్యంగా జీవించడం ఎలా? ఆహారంలో ప్రొటీన్లు, తీసుకోకూడని ఆహారపదార్థాలు. జ్ఞానేంద్రియాలు, వ్యాధులు తదితర విషయాలను పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రియ ప్రకాశ్‌ అవగాహన కల్పించింది.  సంస్థ ప్రారంభం నుంచి వలంటీర్లతో కలిసి ఆమె 77 నగరాల్లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు, సంరక్షకులకు అవగాహన కల్పించింది. పాఠశాలల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే అతిపెద్ద సంస్థగా ‘హెల్త్‌ సెట్‌ గో’ సంస్థ పేరు పొందింది. 

...? జిందగీ డెస్క్‌


logo