సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Feb 09, 2020 , 23:29:26

పచ్చళ్ల తయారీలో కరోడ్‌పతి కృష్ణయాదవ్‌

పచ్చళ్ల తయారీలో కరోడ్‌పతి కృష్ణయాదవ్‌

ప్రతి మనిషికీ కొన్ని కలలుంటాయి. అయితే ఆ కలలు నిజమవ్వాలంటే మాత్రం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. లక్ష్యంపై దృష్టిపెడితే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కష్టేఫలి అన్నట్లు కష్ట పడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆమె కూడా తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగింది. ఆ నమ్మకమే ఆమెను నేడు కోటీశ్వరు రాలిని చేసింది. ఒకప్పుడు వీధుల్లో తిరుగుతూ పచ్చళ్లు అమ్మిన ఆమె నేడు ఒక పచ్చళ్ల కంపెనీకి ఓనర్‌ అయ్యింది. ఒకప్పుడు ఒకటి, రెండు పచ్చళ్లు అమ్మిన ఆమె నేడు ఎన్నో వెరైటీ పచ్చళ్లను అమ్ముతున్నది. అంతేకాదు వ్యాపారంలో రాణించినందుకు రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ఆవార్డు కూడా అందుకుంది. అనుకున్నది సాధించడంలో ఉన్న తృప్తి మరెందు లోనూ లేదంటున్న శ్రీకృష్ణ పికెల్‌ ఓనర్‌ కృష్ణయాదవ్‌ సక్సెస్‌మంత్ర.

కృష్ణ యాదవ్‌ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌ జిల్లాలో ఉండేది. నిరుపేద కుటుంబం. భర్త, ఇద్దరు పిల్లలతో కృష్ణ యాదవ్‌ జీవిస్తుండేది. అయితే యాదవ్‌ పెద్దగా చదువుకోలేదు. అలాగే ఈమె భర్త చదువు కూడా అంతంత మాత్రమే. దీంతో ఏ ఉద్యోగం చేయలేని పరిస్థితి. ఎక్కడ పనిచేసినా చాలీచాలని జీతం. అందుకే  ఇద్దరూ కలిసి ఊరగాయ వ్యాపారం మొదలు పెట్టారు. వారు పలు రకాల ఊరగాయలు తయారు చేసి అమ్మేవారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో వారి వ్యాపారం అంతగా సాగలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వారు ఢిల్లీకి మకాం మార్చారు. ఆమె పెద్దగా చదువుకోకపోవడం, గ్రామంలో పచ్చళ్ల తయారీలో కొంత అనుభవం ఉండడంతో ఢిల్లీ వచ్చింది కృష్ణయాదవ్‌. 1996లో కృష్ణ న్యూఢిల్లీలోని కేవీకే ఉజ్వా అనే సంస్థలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. దీనివల్ల పచ్చళ్లను ఎక్కువకాలం నిల్వ ఉంచడం, ఎలాంటి పదార్ధాలు వాడితే రుచిగా ఉంటాయి వంటి అనేక విషయాలను ఆమె తెలుసుకోగలిగింది.


వీధుల్లో తిరుగుతూ..

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శిక్షణలో తెలుసుకున్న మెళకువలతో మళ్లీ కృష్ణ ఊరగాయలు వ్యాపారం మొదలు పెట్టింది. దీనికోసం మొదట రూ. 500 మాత్రమే ఖర్చు పెట్టింది. తన వద్ద ఉన్న ఆ ఐదు వందల రూపాయలతో పచ్చడి తయారీ కోసం కావాల్సిన ముడి సరుకులు కొన్నది. ఆ తర్వాత రూ. 3000 ఖర్చు పెట్టి కరివి అంటే హిందీలో కరొండా అనే కాయతో 100 కేజీల ఊరగాయ పెట్టింది. దీంతో పాటు 5 కేజీల మిరపకాయ కూడా పెట్టింది. వాటిని వీధుల్లో తిరుగుతూ ఆమె భర్తతో కలిసి అమ్మింది.  మొత్తానికి వీటిని అమ్మేయగా ఆమెకు రూ. 5200 లాభం వచ్చింది. దీంతో ఆమె అలాగే పచ్చళ్లు తయారు చేయడం, వీధుల్లో అమ్మడం చేసింది. వారి వ్యాపారం రోజు రోజుకు వృద్ధి చెందుతూ వచ్చింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. రకరకాల పచ్చళ్లు తయారు చేసి అలాగే రకరకాల ఆహార పదార్థాలు చేసి ఒక స్వగృహ ఫుడ్స్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో వారి వ్యాపారం బాగా సాగింది.


శ్రీకృష్ణ పికెల్‌

వ్యాపారం లాభసాటిగా సాగుతుండడంతో వీరు ఏకంగా ‘శ్రీకృష్ణ పికెల్‌' అని ఒక కంపెనీ ప్రారంభించారు. దీంతో వీరు ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పటికి ఈమె ఏదో ఒక వెరైటీ ఊరగాయ తయారు చేస్తానంటున్నది. వాటికీ అప్పటికప్పుడు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈమె ఎన్నో రకాల వెరైటీ పచ్చళ్లను ఆహార పదార్థాలను తయారు చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నది. ఇప్పటికీ ఆమె తయారు చేసిన పచ్చళ్లకు ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఫ్యాన్స్‌ అయ్యారంటే అవి ఎంత రుచిగా ఉంటాయో ఆర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈమె ఏదో ఒక వెరైటీ ఊరగాయ తయారు చేస్తుంటుంది. వాటికి వచ్చే క్రేజ్‌ అంతా ఇంతా కాదు.


వ్యాపారులుగా..

సొంత కంపెనీ కావడంతో భార్యాభర్తలిద్దరూ కష్టపడ్డారు. వారి కష్టానికి తగినట్లు వీరు ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈమె, ఈమె భర్త ఢిల్లీలో ప్రముఖ వ్యాపారులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. పెద్దగా చదువుకోకపోయినా, పేద కుటుంబం నుంచి వచ్చిన కృష్ణయాదవ్‌ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విధానం మహిళలకూ స్ఫూర్తిదాయకం. భర్త సహకారంతో ఆమె విజయం సాధించడమే కాకుండా పలువురికి ఉపాధిని కూడా ఇస్తున్నారు. ఆమె కూడా ప్రతిరోజు తమ కంపెనీకి వెళ్లి పచ్చళ్ల్ల తయారీలో మునిగి తేలుతుంటుంది. అక్కడి వారికి సలహాలు, సూచనలిస్తుంది. 


ప్రతిరోజూ పండుగే

కృష్ణయాదవ్‌ పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించడంతో పలువురు ఔత్సాహికులు, వివిధ మహిళా గ్రూపులు ఆమెను నిత్యం సంప్రదిస్తున్నారు. ఆయా సంస్థలు వీరి కంపెనీకి వచ్చి ఆమె ఎదిగిన తీరును వారికి వివరిస్తుంటారు. కృష్ణయాదవ్‌ కూడా ఓపికగా అందరికీ సమాధానం చెబుతుంటుంది. ఇక మీడియా సంస్థలైతే రోజు ఆమె ఇంటర్వూ కోసం క్యూ కడుతున్నాయి. ఆమె ఈ రంగంలోకి వచ్చి రెండు దశాబ్ధాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవడానికి ఆసక్తిచూపే వారే అధికం. అందుకే ఆమె పచ్చళ్ల కంపెనీ ప్రతీరోజు పదుల సంఖ్యలో సందర్శకులతో కళకళలాడుతుంటుంది. పచ్చళ్ల తయారీ విధానం, నిలువ చేయడం, ఎన్ని రకాల పచ్చళ్లు తయారు చేస్తున్నారు. వారి వ్యాపారం విజయం సాధించడానికి అనుసరించిన విధానాలపై నిత్యం ఆమెను సంప్రదించేవారే అధికం. అయినా అటు వ్యాపారం, ఇటు తన విజయాలను అందరికీ పంచుతూ ముందుకు సాగుతున్నారు కృష్ణయాదవ్‌.


అవార్డులు, రివార్డులు


వ్యాపారంలో విజయం సాధించిన కృష్ణయాదవ్‌ను ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ క్రమంలోనే కృష్ణయాదవ్‌కు పలు అవార్డులు, రివార్డులు లభించాయి.  2015 లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్‌ అవార్డును కృష్ణయాదవ్‌ అందుకున్నది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తమ మహిళా వ్యాపారిగా రూ.51000 అందుకొంది. పలు సంస్థలు, మహిళా సంఘాలు కూడా ఆమె కృషిని గుర్తించి అవార్డులు, రివార్డులతో గౌరవించాయి.


సవాళ్లను అధిగమించాలి


‘వ్యాపారంలో రాణించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా పెద్దగా చదువుకోలేకపోయామని బాధపడుతూ కూర్చుంటే ఈ రోజు కృష్ణయాదవ్‌గా ఇంత గుర్తింపు పొందేదాన్ని కాదు. మన మెదడుకి పని పెట్టి, కష్టాన్ని నమ్ముకుంటే సాధించనిదంటూ ఏదీ లేదు. తలచుకోవాలేగానీ.. నిజంగా ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కరెక్ట్‌గా దృష్టి పెట్టి మనసు లక్ష్యంపై నిలపాలే గానీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఈ క్రమంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అక్కడే ఆగిపోతే విజయాన్ని అందుకోలేం. ఆ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగినప్పుడే విజ యం మనల్ని వరిస్తుంది.

-కృష్ణయాదవ్‌


logo