బుధవారం 03 జూన్ 2020
Zindagi - Feb 09, 2020 , 23:26:36

వైకల్యాన్ని ఓడించి, విజయం సాధించి!

వైకల్యాన్ని ఓడించి, విజయం సాధించి!

ఆమె ఆత్మవిశ్వాసం వైకల్యాన్ని ఓడించి విజయం సాధించింది. ఆధునిక సాంకేతికతతో వినికిడి సమస్యను అధిగమించింది. సోషల్‌ మీడియా వేదికగా మిలియన్లమంది కష్టమర్లకు సేవలందిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నది ఓ మహిళ.

బెంగళూరుకు చెందిన ఆర్తి లక్ష్మణ్‌ రస్తోగికి చిన్నప్పటి నుంచి ఐస్‌క్రీమ్‌ అంటే  ఎంతో ఇష్టం. సహజసిద్ధమైన పదార్థాలతో పలురకాల ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లను రూపొందిస్తున్నది.ఆర్తికి  వినికిడి సమస్య ఉన్నది. దానిని అధిగమించడానికి వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ను ఎంచుకున్నది. వ్యాపారాన్ని మొదలు పెట్టిన సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. చాలామంది ఆమెకు ఫోన్‌ చేసేవాళ్లు. ఆమెకు వినికిడి సమస్య ఉన్నదని వాళ్లకు తెలిసేది కాదు. ఓ సారి తన సమస్యను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నది. దీంతో ఆమె పరిస్థితిని గమనించిన వినియోగదారులు ఆమెతో చాటింగ్‌ చేయడం మొదలు పెట్టారు. వినియోగదారులకు వచ్చే ఎటువంటి సందేహాన్నైనా ఆర్తి చాటింగ్‌ ద్వారానే తెలిపేది. ఐస్‌క్రీమ్‌ వ్యాపారాన్ని మొదలు పెట్టే సమసయంలో ఆమెను అందరూ నిరుత్సాహపరిచారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఐస్‌క్రీమ్‌లపై ప్రత్యేకంగా అన్వేషణ మొదలు పెట్టింది. ఎటువంటి ఫ్లేవర్లు అందిస్తే వ్యాపారం బాగా నడుస్తుందో గ్రహించింది. ‘ఆర్టిన్సి’ పేరుతో ఐస్‌క్రీమ్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. మార్కెట్‌లో లభించే ఐస్‌క్రీమ్‌లు కాకుండా సరికొత్త రుచులను విపణిలోకి ప్రవేశపెట్టింది. 


చక్కెరపొడితో రూపొందించిన ఐస్‌క్రీమ్‌లు తింటే జలుబు చేస్తుంది. అందుకోసమే ఆమె తయారు చేసే ఐస్‌ క్రీమ్‌లలో చక్కెరకు బదులు బెల్లాన్ని వినియోగించింది. బెల్లంతో రూపొందించిన వాటితో ఎటువంటి హాని లేకపోవడంతో వీటిని కొనేవారి సంఖ్య మరింతగా పెరిగింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరాను పెంచేందుకు మరికొంతమంది సిబ్బందిని నియమించింది ఆర్తి. అలా అనతి కాలంలోనే బెంగళూరులో ఐదు ప్రాంతాల్లో ఔట్‌లెట్లను ప్రారంభించింది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో చేరింది. అందులో వినియోగదారులకు కావల్సిన రీతిలో సేవలు అందించడం మొదలు పెట్టింది. కొందరు ఔట్‌లెట్లకు వచ్చి కొనుగోలు చేస్తుండగా. మరికొందరు  ఇండ్లు, కార్యాలయాలకు డోర్‌డెలివరి కోరేవాళ్లు. ఒక్కసారి ఆర్తి ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్‌ చేసిన వారు నెలలో నాలుగైదు సార్లు తెప్పించుకునేవాళ్లు. ఆర్తి వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌ ద్వారా తన దగ్గర లభించే అన్ని రకాల ఐస్‌క్రీమ్‌ల ఫొటోలను ఉంచేది.‘నాకు వినికిడి సమస్య ఉండడంతో చాలా బాధపడేదాన్ని వాట్సాప్‌ ద్వారా వ్యాపారం చేయొచ్చనే విషయం తెలుసుకున్న తర్వాత నాలో ఉత్సాహం పెరిగింది. ఏ విషయాన్నైనా టెక్స్‌ మెసేజ్‌రూపంలోనే చెప్పేదాన్ని’ అని ఆర్తి అంటున్నది. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల నా సమస్యను అధిగమించగలిగానని’  ఆమె చెబుతున్నది. 


logo