సోమవారం 30 నవంబర్ 2020
Zindagi - Feb 03, 2020 , 23:30:14

రోహిణీ..మిసెస్‌ బ్యూటీ!

రోహిణీ..మిసెస్‌ బ్యూటీ!

పసితనంలో టీవీలో మిస్‌ ఇండియా పోటీలు చూస్తూ.. ఏనాటికైనా ఓ కిరీటాన్ని సాధించాలని కలలు కన్నది. తన ఆశయాన్ని ఇంట్లో చెబితే.. ప్రోత్సహిస్తారో, లేదో అనే చిన్న భయం. చదువు, ఉద్యోగం. వెంటనే పెండ్లి, పిల్లలు. చివరికి తన మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందాల పోటీల్లో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్‌ యూనివర్స్‌ సౌత్‌ ఏషియా-2019’ పోటీల్లో ‘యూనివర్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ’ విభాగంలో విజేతగా నిలిచింది హైదరాబాదీ ‘రోహిణి నాయుడు’. ఓ సంస్థ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తున్న రోహిణి.. చైనాలో జరిగిన ఆ విశేషాలను ‘జిందగీ’తో పంచుకున్నది.

చైనాలో ‘మిసెస్‌ యూనివర్స్‌ సౌత్‌ ఏషియా-2019’ పోటీల వేదిక.. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌. మొత్తం పదిరోజులు గడువు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. 120 దేశాల నుంచి 90 మంది పోటీదార్లు ఉంటే.. వారిలో తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహించింది రోహిణి నాయుడు ఒక్కరే. దేశం కానీ దేశంలో.. భాష కానీ భాషలో నెట్టుకొచ్చి.. వేదికముందున్న పదిమంది న్యాయనిర్ణేతలను, వందలాదిగా హాజరైన ఆహుతులను మెప్పించింది రోహిణి. ఆ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ‘యూనివర్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ’గా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నది. ‘పెండ్లి అయిన తర్వాత.. జీవితమే శూన్యం అవుతుంది’ అనుకొని నిరాశలో కుమిలిపోతున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది మన రోహిణి.


మొదటి రౌండ్‌ : పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి. ‘డొమెస్టిక్‌ వాయిలెన్స్‌ అండ్‌ చైల్డ్‌ రైట్స్‌' టాపిక్‌. గృహహింస, పిల్లల హక్కులపై ఒక్కోక్కరు మాట్లాడారు. అలా రోహిణి కూడా ‘పిల్లలు ముందుగా వారి హక్కులు తెలుసుకోవాలి. వారికి తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. వారికి రక్షణ కల్పించాలి. బాల్యంలో బడికి పంపకుండా పనులకు పంపేవారికి శిక్ష పడాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది’. అన్న అంశాలతో వివరంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. 


రెండవ రౌండ్‌ : కాస్ట్యూమ్స్‌. ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించి ఆయా దేశం, రాష్ర్టాల ఔన్నత్యాన్ని చాటుకోవచ్చు. దీనికి రోహిణీ రాణి రుద్రమదేవి గెటప్‌ వేసింది. రుద్రమదేవిలా హావభావాలను పలికిస్తూ అందరినీ మెప్పించింది. ఆమెను చూస్తే రుద్రమదేవే వేదికపై కి వచ్చిందా అన్నట్లు చూపరులకు అనిపించింది. ఈ కాస్ట్యూమ్‌ రౌండ్‌లో ఎవరి అలంకరణ వారే చూసుకోవాలి. ఎవరూ సాయపడరు. 

మూడవ రౌండ్‌ : టాలెంట్‌ రౌండ్‌. ఇది ఫైనల్‌ రౌండ్‌. ప్రతిభను ప్రదర్శించే రౌండ్‌. అక్కడున్న వాళ్లందరూ పెయింటింగ్‌, ఆర్ట్స్‌ అంటూ వచ్చింది చేసి చూపిస్తున్నారు. రోహిణి మాత్రం కూచిపూడి నాట్యం ఎంచుకున్నది. నాట్యం చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. నాట్యంలో ప్రావీణ్యురాలైన రోహిణి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. 


ఇలా మూడు రౌండ్లు పూర్తయ్యాయి. అప్పటివరకు ఎంజాయ్‌ చేసిన ఆడియన్స్‌ ఇక మార్కుల కోసం నిశ్శబ్దంగా వేచిచూస్తున్నారు. అది భరించలేని విధంగా ఉన్నది. ఒక్కో రౌండ్‌లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అన్నీ కౌంట్‌ చేస్తున్నారు. మార్కులు తెలిశాయి. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో అనౌన్స్‌ చేస్తున్నారు. మొదట మిసెస్‌ యూనివర్స్‌గా హనీ ఎంపికైంది. తర్వాత ప్రకటించిన ‘మిసెస్‌ సౌత్‌ సెంట్రల్‌ ఏషియా’, ‘యూనివర్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ’ టైటిల్‌ను తెలంగాణకు చెందిన మిసెస్‌ రోహిణీ నాయుడు గెలుచుకున్నారు. ఈ పోటీల్లో భారత్‌ తరపున అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఇంజినీర్లు మంచి పోజిషన్‌లో ఉన్నవారే పాల్గొన్నారు. వారందరికంటే ఓ మెట్టు పైస్థాయిలో నిలువడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని అంటున్నది రోహిణి. జీవితంలో సమస్యను ఎదిరించి నిలిచిన వారికే ఇలాంటి కిరీటాలు దక్కుతాయని, అటువంటి పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని అంటున్నది రోహిణి. 


విడుదలకు సిద్ధంగా..

నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాన్న పోలీస్‌ ఆఫీసర్‌. అమ్మ ఇండియన్‌ ఆర్మీలో మెడికల్‌ ఆఫీసర్‌. ఇంజినీరింగ్‌ చేశాను. ప్రస్తుతం నా ఫౌండేషన్‌ ద్వారా పిల్లల హక్కులకోసం పోరాడుతున్నా. దీంతోపాటు జీఎన్‌ఐటీఎస్‌ కాలేజ్‌లో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. దీన్ని ఎప్పటికీ వదులుకోను. చిన్నప్పటి నుంచి బ్యూటీ కాంపిటేషన్‌లో పాల్గొనాలని ఉన్నా పేరెంట్స్‌ ఒప్పుకోరని మనసులోనే దాచుకున్నా. ఇప్పుడా కోరిక నెరవేరింది. 2016లో వివాహం చేసుకున్నాను. కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆ ధీమాతోనే సినిమాల్లో కూడా నటిస్తున్నాను. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, యాత్ర సినిమాలో చిన్న పాత్రలు చేశాను. బాలీవుడ్‌లో ఒక సినిమాకు లీడ్‌రోల్‌ చేశాను. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్యాషన్‌ను, కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలువడమే నా లక్ష్యం.


‘ది గర్ల్‌ ఫౌండేషన్‌' ద్వారా సేవ

‘ది గర్ల్‌ ఫౌండేషన్‌'ను స్థాపించి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నది. 2017లో ఈ సంస్థను  స్థాపించింది. దీని ప్రారంభంలో 100 రోజులు 100 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పిల్లలకు వారి హక్కులపై అవగాహన కల్పించింది. పేదపిల్లలకు శానిటరీ ప్యాడ్స్‌ అందిస్తున్నది. తెలంగాణలోని ప్రతీగ్రామాన్ని సందర్శించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నది. ఇంతకుముందు  ఎన్నో ఎన్‌జీఓల్లో వలంటీర్‌గా పనిచేసింది. రిపబ్లిక్‌ డే రోజున ‘ఓస్టెర్‌ డే’ సెలబ్రేషన్స్‌ సందర్భంగా రోహిణికి ‘సేవారత్న అవార్డు - 2020’ ప్రదానం చేశారు. ఇంతకుముందు ‘మిసెస్‌ హైదరాబాద్‌', ‘మిసెస్‌ ఏషియా టూరిజమ్‌'వంటి పలు అవార్డులు అందుకున్నారు. పెండ్లికి ముందు ఎన్నో పోటీల్లో పాల్గొనాలని ఆశ ఉన్నా.. కుదరలేదు. ఇప్పుడు తల్లి అయ్యాక ఆమె కలలన్నీ సాకారం చేసుకుంటున్నది. 

...? సరస్వతి వనజ