శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Jan 22, 2020 , 00:13:06

కాళ్లవేళ్లపై పరుగెత్తి..రికార్డులు కొల్లగొట్టి!

కాళ్లవేళ్లపై పరుగెత్తి..రికార్డులు కొల్లగొట్టి!

ఏ వ్యక్తి అయినా ఒక రంగంలో విశేషంగా రాణించాలంటే కఠోర శ్రమ, నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ, సీనియర్‌ క్రీడాకారుల సలహాలు, సూచనలు వంటివి అవసరం. ఒక్కోసారి ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేని వారు ఎందరో ఉన్నారు. కానీ మనం ఇక్కడ చెప్పుకొనే ఓ వ్యక్తి ఎవరి అవసరం లేకుండానే తనకున్న పరిజ్ఞానంతో అనితర సాధ్యమైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. అతనే కరీంనగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి రాపెల్లి శ్రీనివాస్‌.

కోతిరాంపూర్‌లో తల్లి, సోదరుడు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. జీవనోపాధి కోసం నగరంలోని వెంకటేశ్వర టెంపుల్‌ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతరులతో పోలిస్తే శ్రీనివాస్‌లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. తాను ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎంత కష్టమైనా పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమించి విజయాన్ని అందుకుంటుంటాడు. 


చిన్నతనంలో ఎఎక్స్‌ఎన్‌ చానల్‌లో వచ్చే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు షోలను చూసి తాను సైతం ఓ రికార్డును సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని తాను చేసి అద్భుతాన్ని సృష్టించాలనుకున్నాడు. రికార్డు సాధనకు ఆలోచన చేయగా కాలు మునివేళ్లపై ఇప్పటి వరకు ఎవరూ నడిచినా సందర్భాలు లేవని ధృవీకరించుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగి కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 మూడు గంటలు కఠోరంగా శ్రమించాడు. కొన్ని సంవత్సరాల తరువాత మునివేళ్లపై సులువుగా నడిచే స్థాయికి చేరుకున్నాడు. అనంతరం మరింతగా శ్రమించి కాలి మునివేళ్లపై ఒక నిమిషం వ్యవధిలో 137.1 మీటర్లు పరుగెత్తి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. ప్రస్తుతం తాను ఇటీవల సాధించిన రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఒక నిమిషం వ్యవధిలో కాలి మునివేళ్లపై 200 మీటర్లను పరుగెత్తి మరో రికార్డును సొంతం చేసుకొనేందుకు శ్రమిస్తున్నాడు. ఈ ఫీట్‌తో పాటు  ఈత కొలనులో అద్భుతం సృష్టించేందుకు ఒక చేత స్విమ్మింగ్‌ చేస్తూ మరో చేత రూబిక్‌ క్యూబ్‌ను పరిష్కరించేందుకు ప్రాక్టీసులో నిమగ్నమయ్యాడు శ్రీనివాస్‌. 


గిన్నిస్‌ రికార్డు 

కాలి మునివేళ్లపై నడవడమే కష్టం. అలాంటిది వాటిపైన పరుగెత్తి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని డా.బి ఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఒక నిమిషం వ్యవధిలో మునివేళ్లపై 137.1 మీటర్లు పరుగెత్తి సరికొత్త రికార్డును నెలకొల్పి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నిర్వాహకుల నుంచి మెడల్‌, ప్రశంసాపత్రం అందుకున్నాడు. దీనికోసం శ్రీనివాస్‌ సుమారు ఐదేండ్లపాటు కఠోరంగా శ్రమించాడు. అయితే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు సిద్ధ్దమయ్యాడు శ్రీనివాస్‌, ఈ సారి ఒక నిమిషం వ్యవధిలో కాలి మునివేళ్లపై 200 మీటర్లు పరుగెత్తి సరికొత్త రికార్డును సాధించేందుకు శ్రమిస్తున్నాడు. 


కళ్లకు గంతలతో ..

శ్రీనివాస్‌లో చెప్పుకోదగ్గది రూబిక్‌ క్యూబ్‌ల పరిష్కారం. అయితే వీటిని ఎవరైనా కళ్లతో చూసి పరిష్కరించడం మనం సాధారణంగా చూస్తుంటాం కానీ శ్రీనివాస్‌ అలా చేస్తే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడో ఏమో కళ్లకు గంతలు కట్టుకొని ఒక నిమిషం వ్యవధిలో రెండు క్యూబ్‌లను పరిష్కరించి 2016లో ముంబైలో జరిగిన పోటీలో పాల్గొని బంగారు పతకం అందుకున్నాడు. 

 

గొర్ల కాపరిగా..

పదోతరగతి వరకే చదువుతున్న శ్రీనివాస్‌ పేదరికంతో గొర్లకాపరిగా మారాడు. చిన్నతనంలోనే తండ్రి ఐలయ్య మరణించడంతో పెద్దవాడైన శ్రీనివాస్‌ కుటుంబ బాధ్యతలను మోశాడు. ఈ క్రమంలో చదువుకు స్వస్తి చెప్పి తల్లిని పోషిస్తూనే తమ్ముడిని చదివించాడు. పాఠశాల స్థాయి నుంచే శ్రీనివాస్‌కు నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆకాంక్ష ఉండేది. చిరుప్రాయంలో బ్రూస్‌లీని ఆదర్శంగా తీసుకోని మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సుమారు 500 వరకు బంగారు పతకాలు సాధించాడు. అనంతరం హైదరాబాద్‌లో పేరొందిన ఇద్దరు ఫైట్‌ మాస్టర్ల వద్ద అసిస్టెంట్‌ ఫైట్‌ మాస్టర్‌గా రెండేళ్లు పనిచేశాడు. 


యుద్ధ క్రీడల్లో..

శ్రీనివాస్‌కు ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే పట్టుపట్టి దాన్ని ఎలాగైనా సాధించేవాడు. ఈ క్రమంలో యుద్ధ్ద క్రీడలైన కరాటే, కిక్‌బాక్సింగ్‌, కుంగ్‌ఫూ, తైక్వాండో, బాక్సింగ్‌, జిమ్మాస్టిక్‌లతో పాటు స్విమ్మింగ్‌లో  రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాడు. ఆయన చేసే ఫీట్లు అనితర సాధ్యంగా ఉంటాయి. ఒక కాలిని భూమిపై ఉంచి మరో కాలిని నిటారుగా లేపి రెండు చేతులతో పట్టుకోవడం, ఒక చేతిపైనే శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచడం, స్ట్రెచింగ్‌, మునివేళ్లపై వెనుకకు వంగి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఘనతలను సాధించాడు. 


మరిన్ని రికార్డులు

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుతో పాటు వండర్‌ బుక్‌, జీనియస్‌ బుక్‌, లిమ్కా బుక్‌, భారత్‌ వరల్డ్‌ రికార్డు, తెలుగు బుక్‌, హైరేంజ్‌, 5 స్టార్స్‌, రాష్ట్రీయ పురస్కార్‌, మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్‌ అవార్డులనూ సొంతం చేసుకున్నాడు. 


కుటుంబ నేపథ్యం..

రాపెల్లి శ్రీనివాస్‌ది నిరుపేద కుటుంబం. రోజువారీగా కూరగాయల అమ్మకం ద్వారా వచ్చే సంపాదనతోనే కుటుంబ పోషణ చేస్తున్నాడు. తల్లిదండ్రులైన కేతవ్వ, ఐలయ్యలలో ఐలయ్య చిన్నతనంలోనే మరణించాడు.  శ్రీనివాస్‌కు వివాహం కాగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. చిన్నవాడైన తమ్ముడు మల్లేశం చదువుకుంటూనే అన్నకు కూరగాయాల అమ్మకంలో చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. 


కీర్తి చాటుతా: రాపెల్లి శ్రీనివాస్‌

ఇప్పటివరకు ఎవరిపైనా అధారపడకుండా, ఎవరి సహకారం లేకుండానే ఇన్ని రికార్డులను నెలకొల్పాను. ప్రభుత్వం నాకు ప్రొత్సాహాం, సహకారం అందిస్తే తెలంగాణ కీర్తిని దేశంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తాను. రికార్డుల సాధనలో ప్రతిరోజు సాధన చేయాల్సి వస్తుండటంతో వ్యాపారం అంతగా లేక కుటుంబ పోషణ భారంగా మారింది. వృద్ధురాలైన తల్లితో పాటు భార్య, పిల్లలు, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నాకు ప్రభుత్వం ఏ విధమైన సహకారం అందించినా జీవితాంతం రుణపడి ఉంటా.


వెయ్యి పతకాలు