మంగళవారం 02 జూన్ 2020
Zindagi - Jan 08, 2020 , 15:47:10

వైవిధ్యమే విజయమంత్రం

వైవిధ్యమే విజయమంత్రం

బడిలో అడుగుపెడుతూ తల్లి చేతిని వదల్లేక భారంగా వీడ్కోలు చెప్పే చిన్నారిలా, మళ్లీ తిరిగొస్తానంటూ ప్రియుడిని అనునయించి వెళ్లిపోయిన అందాలప్రేయసిలా, ప్రవాసానికి వెళ్తున్న మిత్రుడిని ఆనందోత్సాహాలతో సాగనంపిన ఓ ఉద్విగ్న ఘట్టంలా ఈ ఏడాది కాలయవనికపై ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చి నిష్క్రమించడానికి సిద్ధమైంది. అదే తరుణంలో కోటి ఆశలతో కొంగొత్త వసంతానికి స్వాగతం పలుకడానికి సమాయత్తమవుతున్నది. ఎన్నో రంగుల కలలతో విరాజిల్లే చిత్రసీమ ఈ ఏడాది ఆశాజనకమైన ఫలితాల్ని సాధించింది. కథాంశాల్లో కొత్తదనానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ సంవత్సరం తెలుగులో బయోపిక్‌ల రూపకల్పన ఊపందుకుంది. అగ్రహీరోలు మంచి విజయాల్ని అందుకున్నారు. నవతారలు వినూత్న ఇతివృత్తాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సృజనాత్మకతపరంగా తెలుగు సినీరంగం కొత్త హద్దుల్ని స్పృశించడం శుభపరిణామంగా చెప్పాలి.

2019లో అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు అద్భుత విజయాలతో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షాన్ని కురిపించాయి. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా సంక్రాంతికి విడుదలైన ఎఫ్-2 చిత్రం ఈ ఏడాది అతి పెద్ద విజయంగా నిలిచింది. కుటుంబ బంధాలు, వినోదం సమ్మిళితంగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం నాలుగింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇస్మార్ట్‌శంకర్ చిత్రం హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్‌కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. మహర్షి సినిమాతో ఈ ఏడాది అద్వితీయ విజయాన్ని అందుకున్నారు మహేష్‌బాబు. స్నేహం, ప్రేమ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది భాషాభేదాలకు అతీతంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన చిత్రాల్లో సాహో ఒకటి. అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినా ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌తో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక చారిత్రక కథాంశంతో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం చక్కటి కలెక్షన్స్‌తో నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది.
F2

స్టార్స్ జోరు...

ఈ ఏడాది స్టార్ హీరోల్లో కొందరు అద్వితీయ విజయాలతో దూసుకుపోగా.. మరికొందరు మాత్రం పరాజయాల్ని ఎదుర్కొన్నారు. ఏడాది ఆరంభంలోనే ఎఫ్-2 చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులను పంచారు వెంకటేష్. పెద్ద విజయంతో ఈ ఏడాదిని ఆరంభించిన ఆయన వెంకీమామతో అదే జోరును కొనసాగిస్తూ 2019కి ముగింపు పలుకుతున్నారు. సైరా నరసింహారెడ్డిగా ఈ ఏడాది అభిమానుల్ని మెప్పించారు చిరంజీవి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అసమాన నటనను కనబరిచారు. మన్మథుడు-2 చిత్రంతో నాగార్జున అపజయాన్ని చవిచూశారు. ప్రచార చిత్రాలతో అంచనాల్ని రేకెత్తించిన ఈ సినిమా కథ, కథనాల్లో నవ్యత కొరవడటంతో పరాజయంగా నిలిచింది. మహర్షితో మహేష్‌బాబు అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఎఫ్-2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో ఈ ఏడాది రెండు విజయాల్ని అందుకున్నారు వరుణ్‌తేజ్.


అలాగే జెర్సీ సినిమాలో క్రికెటర్‌గా నాని అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఆయన నటించిన మరో చిత్రం గ్యాంగ్‌లీడర్ సగటు చిత్రంగా మిగిలింది. మజిలీ, వెంకీమామ విజయాలతో ద్విగుణీకృత ఉత్సాహంతో ఉన్నారు నాగచైతన్య. ఇస్మార్ట్‌శంకర్ ద్వారా కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో సాయితేజ్ చాలా విరామం తర్వాత సక్సెస్‌ల బాటపట్టారు. రాక్షసుడుతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నినువీడని నీడను నేనేతో సందీప్‌కిషన్, 118తో కల్యాణ్‌రామ్ సక్సెస్ రుచి చూశారు. వినయవిధేయరామతో హీరోగా రామ్‌చరణ్ నిరాశను ఎదుర్కోగా.. సైరా నరసింహారెడ్డి నిర్మాతగా మాత్రం సక్సెస్ అందుకున్నారు. అఖిల్ మిస్టర్ మజ్ను, రాజశేఖర్ కల్కి చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

సీనియర్స్ సత్తా చాటారు

sye-raa-director-surender-r
సీనియర్ దర్శకులకు 2019 అచ్చొచ్చిందనే చెప్పవచ్చు. ఇస్మార్ట్‌శంకర్ ఘన విజయంతో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు పూరి జగన్నాథ్. ైస్టెలిష్ ఎంటర్‌టైనర్‌గా మహర్షి సినిమాను తెరకెక్కించి సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఎఫ్-2తో కామెడీని పండించడంలో తన బలమేమిటో మరోసారి చాటిచెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగానే కాకుండా చారిత్రక కథాంశాల్ని సమర్థవంతంగా తెరకెక్కించగలడని సైరా నరసింహారెడ్డితో సురేందర్‌రెడ్డి నిరూపించుకున్నారు. మజిలీతో శివనిర్వాణ, జెర్సీతో గౌతమ్ తిన్ననూరి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. గద్దలకొండ గణేష్‌తో హరీష్‌శంకర్ సక్సెస్ అందుకున్నారు.

కొత్త దర్శకుల హవా

118
2019లో నూతన దర్శకులు చేసిన ప్రయత్నాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎస్.జె.స్వరూప్ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. మల్లేశం సినిమాతో రాజ్.ఆర్ దర్శకుడిగా పేరుప్రఖ్యాతుల్ని అందుకున్నారు. ఆసుయంత్రం రూపకల్పనలో తెలంగాణ చేనేతకారుడు చింతకింది మల్లేశానికి ఎదురైన అవరోధాల్ని హృద్యంగా తెరపై ఆవిష్కరించడంలో రాజ్ ఆర్ విజయవంతమయ్యారు. 118 చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ సక్సెస్‌ను అందుకున్నారు. ఎవరు సినిమాతో వెంకట్ రామ్‌జీ ప్రేక్షకుల మెప్పును పొందారు. నిను వీడని నీడను నేనే చిత్రంతో కార్తిక్‌రాజు, అర్జున్ సురవరం సినిమాతో టి. సంతోష్ అరంగేట్రంలోనే విజయాల్ని అందుకున్నారు.

వైవిధ్యానికి పట్టం

GADDALA-KONDA-GANESH
2019లో ప్రయోగాలు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో సీనియర్ నాయికలు కొత్త అడుగులు వేశారు. ఓ బేబీ, మజిలీ చిత్రాల్లో విలక్షణ నటనతో సమంత మెప్పించింది. భావోద్వేగభరిత పాత్రల్లో ఒదిగిపోయింది. మహర్షి, గద్దలకొండగణేష్ చిత్రాల్లో అందం, అభినయంతో అలరించిన పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోయింది. ఎఫ్-2, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో తమన్నా ఈ ఏడాది రెండు సక్సెస్‌లను సొంతం చేసుకున్నది. ఇస్మార్ట్‌శంకర్‌తో తెలుగులో తొలి విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్‌కు మిస్టర్ మజ్ను మాత్రం కలిసిరాలేదు. బ్రోచెవారెవరురా, 118 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించింది నివేథాథామస్. ఇస్మార్ట్‌శంకర్ సినిమాలో వరంగల్ యువతి నభానటేష్ హుషారైన నటనతో ఆకట్టుకున్నది.

కొత్త అందాలకు స్వాగతం

dhorasani
ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్త కథానాయికలు తమ అందచందాలు, అభినయపటిమతో ఆకట్టుకున్నారు. దొరసాని చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది రాజశేఖర్, జీవితల తనయ శివాత్మిక. ఈ సినిమాలో దొరసాని దేవకి పాత్రలో సహజ నటనను ప్రదర్శించింది. జెర్సీ సినిమాతో తెలుగులో తొలి అడుగు వేసిన కన్నడ సోయగం శ్రద్ధాశ్రీనాథ్ పరిణతితో కూడిన అభినయాన్ని కనబరిచింది. మజిలీ సినిమాతో దివ్యాంశకౌశిక్, మల్లేశం చిత్రంతో అనన్య, కౌసల్య కృష్ణమూర్తితో ఐశ్వర్యారాజేష్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

చిన్న సినిమాలు అద్భుత విజయాలు

Ugadi-Still
ఈ ఏడాది కొన్ని చిన్న సినిమాలు చిరస్మరణీయ మైన విజయాల్ని అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించాయి. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఫలక్‌నుమాదాస్ మంచి వసూళ్లను సాధించింది. ఏజెంట్‌సాయిశ్రీనివాస ఆత్రేయ లాభాల్ని తెచ్చిపెట్టింది. అడివి శేష్ నటించిన ఎవరు విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడమే కాకుండా పెద్ద సక్సెస్‌ను సాధించింది. మల్లేశం, బ్రోచెవారెవరురా, జార్జిరెడ్డి, నిను వీడని నీడను నేనే, అర్జున్ సురవరం లాభాలను తెచ్చిపెట్టాయి.

బయోపిక్‌ల జోరు

mallesham
ఈ ఏడాది తెలుగులో పలు బయోపిక్ సినిమాలు రూపొందాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి.వి.రాఘవ్ రూపొందించిన యాత్ర చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. మమ్ముట్టి తన నటనతో రాజశేఖర్‌రెడ్డి పాత్రకు ప్రాణంపోశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసుయంత్రం రూపకర్త చింతకింది మల్లేశం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ తెరకెక్కిన మల్లేశం చిత్రం వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి సినిమాగా అందరి మన్ననల్ని పొందింది. విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డి జీవితంతో తెరకెక్కిన జార్జిరెడ్డి చిత్రం కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. జార్జిరెడ్డి ఇతివృత్తాన్ని స్ఫూర్తిదాయకంగా తెరకెక్కించి ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు జీవన్‌రెడ్డి. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా చిత్రం తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందినప్పటికీ ఇతర భాషల వారిని ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

గ్యాప్ తీసుకున్నారు..

ఈ ఏడాది కొందరు అగ్ర కథానాయకుల్ని వెండితెరపై చూడాలనే అభిమానుల కోరిక తీరలేదు. 2019లో ఎన్టీఆర్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది అరవిందసమేతతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఈ 2019లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌షూటింగ్‌తో పాటు కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించారు. రవితేజతో పాటు నితిన్ ఈ ఏడాది అభిమానుల ముందుకు రాలేదు. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడంతో వీరిద్దరి కెరీర్‌కు 2019లో గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ ఈ ఏడాది వెండితెరపై కనిపించలేదు. అల వైకుంఠపురములో చిత్రీకరణతో ఈ సంవత్సరం బిజీగా ఉన్నారు.


logo