గురువారం 04 జూన్ 2020
Zindagi - Jan 08, 2020 , 15:32:10

సరికొత్త పరిష్కారం

సరికొత్త పరిష్కారం

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది చిన్నారులు డిస్లెక్సియా సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల వారు చదువులో రాణించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం వినూత్న పరిష్కారాలను అందిస్తున్నది ఓ పరిశోధకురాలు.

గుర్‌గ్రామ్‌కు చెందిన న్యూరో సైంటిస్ట్ నందిని ఛటర్జీ సింగ్ డిస్లెక్సియాతో బాధపడే చిన్నారులకు పరిష్కారాలందించేందుకు ముందుకొచ్చింది. రాయడం, చదవడంలో ఆసక్తి చూపించకపోవడాన్ని డిస్లెక్సియా అంటారు. చిన్నతనంలో ఈ సమస్యను గుర్తించి పరిష్కరించాలి. లేకపోతే చదువులో రాణించలేరు. ఇటువంటి సమస్యను ఎదుర్కొనే వారికి సులువైన పరిష్కారాలు అందించాలనుకున్నది నందిని. డిస్లెక్సియా ఉన్న వారిని గుర్తించాలంటే పలురకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరీక్షలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని డిస్లెక్సియా పాఠశాలలు వెలిశాయి. వీటిల్లో సంపన్నవర్గాలకు చెందిన వారు మాత్రమే ఫీజులు భరించగలుగుతారు. ఇదే సమస్య ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులకు పరిస్థితి ఏంటీ? అనుకున్నది. అటువంటి వారి కోసం ఏదైనా చేయాలనుకున్నది. అందుకోసం ప్రత్యేకంగా ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.


అందులో పలురకాల పరిశోధనలు చేసి డిస్లెక్సియాను గుర్తించే పద్ధతిని కనుగొన్నది. గుర్‌గ్రామ్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌తోపాటు భారతప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి డిస్లెక్సియా అసెస్‌మెంట్ ఫర్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా(డాలి) అనే సాధనాన్ని ప్రవేశపెట్టింది. నందిని ఛటర్జీ చేసిన పరిశోధనల ఆధారంగా డిస్లెక్సియాను గుర్తించేలా ఓ బుక్‌లెట్‌ను రూపొందించింది. కొన్నాళ్ల తర్వాత మరాఠీ, కన్నడ, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో డాలి అనే యాప్‌ను ఆవిష్కరించింది. దీనిని ఉపయోగించి డిస్లెక్సియా ఎదుర్కొనే వారిని సులువుగా గుర్తించగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా 80 శాతం మంది విద్యార్థులు డిస్లెక్సియా కారణంగా చదువులో వెనుకబడుతున్నారు. అటువంటి వారిని చిన్నతనంలోనే గుర్తిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చని నందిని ఛటర్జీ చెబుతున్నది.


logo