11.20 కోట్ల జరిమానా?


Sat,January 26, 2019 12:41 AM

fine
దేశీయ రియల్ రంగంలోనే సంచలనం.. భారతదేశంలో రెరా అథారిటీ ఏర్పాటయ్యాక.. ప్రప్రథమంగా ఒక రియల్టర్‌పై రూ.11.20 కోట్ల జరిమానాను విధించేందుకు తెలంగాణ రెరా అథారిటీ సమాయత్తం అవుతున్నది. యావత్ భారత రియల్ రంగంలో సంచలనం సృష్టిస్తూ.. తెలంగాణ రెరా అథారిటీ అడుగులు ముందుకేస్తున్నది.


హైదరాబాద్‌లో కొందరు రియల్టర్లు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా తెలంగాణ రెరా అథారిటీ దృష్టికొస్తున్నాయి. కొనుగోలుదారులను అమాయకులుగా చేసి ఆటాడుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సంస్థనేమో రెరా అనుమతి తీసుకోకుండా యధేచ్చగా ప్లాట్లు అమ్ముతుంటే.. మరొక రెరా ఏజెంటు నమోదు కాని వెంచర్‌లో ప్లాట్లను విక్రయిస్తున్నారు. వీరి నుంచి భారీ స్థాయిలో జరిమానాను విధించడానికి తెలంగాణ రెరా అథారిటీ సిద్ధమవుతున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే..


- రెరా అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా షాద్‌నగర్‌లో ఒక సంస్థ ప్లాట్లను విక్రయిస్తున్నది. విషయం తెలుసుకున్న తెలంగాణ రెరా అథారిటీ ఆయా రియల్టర్‌కు షోకాజ్ నోటీసును 2018 డిసెంబరు 11న జారీ చేసింది. అయినప్పటికీ, ఆ సంస్థ నుంచి స్పందన రాకపోవడంతో.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో పది శాతం జరిమానాను విధించేందుకు సిద్ధమైంది. రెరా ప్రకారం.. ఈ సంస్థ మొత్తం 2.60 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయిస్తున్నది. బ్రోచర్ ప్రకారం.. గజానికి రూ.4,299 చొప్పున ప్లాట్లను విక్రయిస్తున్నది. దీని ప్రకారం లెక్కిస్తే.. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.112 కోట్లుగా నమోదైంది. దీనిపై పది శాతం జరిమానాను లెక్కిస్తే.. రూ.11.20 కోట్లుగా లెక్క తేలింది. ఈ సంస్థ బ్రోచర్లను రెరా అథారిటీ సేకరించింది.


- ప్రభుత్వమెంతో ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రిని అభివృద్ధి చేస్తుంటే.. కొందరు అక్రమార్కులేమో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని రెరా చెబుతున్నది. యాదాద్రి చేరువలోని చిన్న కందుకూరులో ఓ రెరా రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్.. ఒక వెంచర్‌ను మార్కెట్ చేస్తున్నాడు. ఇందులో ప్లాటు కొనాలా? వద్దా? అని ఒక పెద్దాయన మాసబ్ ట్యాంకులోని రెరా కార్యాలయానికి విచ్చేశారు. దీంతో, ఆశ్చర్యపోయిన అధికారులు రెరా అనుమతి లేని వెంచర్‌ను.. రెరాలో అనుమతి పొందిన ఏజెంట్ విక్రయిస్తున్నాడని చర్యలకు ఉపక్రమించారు. ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని లెక్కిస్తే.. రూ.6.75 కోట్లుగా తేలింది. దీనిపై పది శాతం అంటే, రూ.67.50 లక్షలు జరిమానాను వసూలు చేయడానికి రెరా అడుగు ముందుకేసింది.

720
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles