నా వయసు 22 ఏండ్లు. నా కన్నవాళ్ల నుంచే గృహ హింసను ఎదుర్కొంటున్నాను. 23 ఏండ్లు రాగానే నాకు పెండ్లి చేయాలనుకుంటున్నారు. కానీ, నాకు ఇష్టం లేదు. ఉద్యోగం చేయాలని ఉంది. ఆ మాట చెప్తే మావాళ్లు ఒప్పుకోవట్లేదు. సంబంధాలు కూడా చూస్తున్నారు. చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. నాకేమో నచ్చిన జాబ్ చేసుకుంటూ స్వతంత్రంగా బతకాలని ఉంది. దయచేసి నా సమస్యకుపరిష్కారం చెప్పగలరు.
ఓ సోదరి, ఖమ్మం
జ: మీ పరిస్థితి బాధాకరం. 18 ఏండ్లు నిండితే, తల్లిదండ్రులైనా సరే ఏ విషయంలోనూ ఒత్తిడి చేసేందుకు వీల్లేదు. అలా చేస్తే చట్టరీత్యా నేరం. జైలు శిక్ష తప్పదు. నచ్చినట్టుగా జీవించేందుకు మీకు పూర్తి హక్కు ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు ఎన్నో తీర్పుల్లో స్పష్టం చేసింది. మీరు ఇంట్లోంచి బయటికెళ్లి ఉద్యోగం చేస్తూ, మీకు నచ్చిన విధంగా జీవితాన్ని గడపొచ్చు. అయితే, ఇలా చేయాలంటే ముందు మీ దగ్గర తగినన్ని సేవింగ్స్ ఉండాలి. ఆర్థిక భద్రత కూడా అవసరం. దాంతోపాటు, మీరు బయటికెళ్లాక మిమ్మల్ని చూసుకోవడానికి నమ్మదగిన స్నేహితులు లేదా బంధువులు ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా మీరు ఇల్లు వదిలి వెళ్లాలనుకుంటే, తర్వాత వాళ్లు పోలీసులను సంప్రదించకుండా, ఇష్టపూర్వకంగానే వెళ్తున్నట్లు ఒక ఉత్తరం రాయడం మంచిది. అలాగే అచ్చం పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేసినట్లుగానే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఉద్దేశించి ఒక ఉత్తరం రాసి, ఆ కాపీని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. దీనివల్ల భవిష్యత్‌లో మీతో పాటు, మీకు సాయం చేస్తున్నవాళ్లకు కూడా ఎలాంటి సమస్యా ఎదురుకాదు.